ETV Bharat / international

మాస్క్‌ ధరించనని మొండిపట్టు.. చివరకు అరెస్టు

author img

By

Published : Nov 29, 2020, 8:32 PM IST

కరోనా తీవ్రత అధికంగా ఉన్న అమెరికాలో కొందరు తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సాల్ట్​లేక్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి ప్రవర్తనే ఇందుకు ఉదాహరణ. అధికారులు ఎంత చెబుతున్నా వినకుండా మాస్క్​ పెట్టుకోకుండా విమానం ఎక్కి.. చివరకు పోలీసులు అరెస్ట్​ చేసేంత వరకు తెచ్చుకున్నాడు.

Man arrested for refusing to wear mask
మాస్క్ పెట్టుకోకుండా విమానంలో వీరంగం

అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సాల్ట్‌ లేక్‌ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు ఉదాహరణ. 44 ఏళ్ల వ్యక్తి మాస్క్‌ ధరించకుండా శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లేందుకు సాల్ట్‌లేక్‌ సిటీ విమానాశ్రయానికి వెళ్లాడు. సిబ్బంది అతడిని మాస్క్‌ ధరించాలని చెప్పినా వినకుండా విమానం ఎక్కాడు. దీనితో ఆ వ్యక్తిని కిందకు దించేందుకు ప్రయత్నించే క్రమంలో ఆ విమానం 45 నిమిషాల పాటు ఆలస్యమైంది. అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు అక్కడి మీడియా తెలిపింది.

అసలేమైందంటే..

ఝోషువా కోల్బీ కౌన్సిల్‌ అనే వ్యక్తి బుధవారం రాత్రి మాస్క్‌ ధరించకుండా విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. గేట్‌ ఏజెంట్‌ అతడిని అడ్డుకొని మాస్క్‌ పెట్టుకోవాలని చెప్పాడు. అయినా ఖాతరు చేయకుండా కోల్బీ ముందుకు సాగాడు. దీనితో అతడిని అనుసరించిన ఏజెంట్‌.. కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉందని చెప్పినా ఏమాత్రం పట్టించుకోకుండా విమానం ఎక్కాడు. విమానంలో కెప్టెన్‌, ఇతర సిబ్బంది చెప్పినా చెవికెక్కించుకోలేదు. దీనితో వారు విమానాశ్రయ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అతడిని విమానం నుంచి దించేయాలని సూచించారు. అయినా అతడు సీటునుంచి లేచి బయటకు వచ్చేందుకు నిరాకరించాడు. అతడి మొండి ప్రవర్తనకు విసిగిపోయిన తోటి ప్రయాణికులు బయటకు వెళ్లేందుకు సిద్ధం కావడం వల్ల చివరకు అతడు విమానం దిగాడు. ఈ ఘటనతో దాదాపు 45 నిమిషాల పాటు విమానం ఆలస్యమైంది. తమ విమానం ఆలస్యమైనందుకు గాను ప్రయాణికులకు డెల్టా ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు చెప్పింది. అమెరికాలో ఇప్పటికే కరోనాతో 2.64లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం కూడా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:కరోనా పుట్టింది భారత్​లోనే: చైనా

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.