ETV Bharat / international

'సిద్దీఖిని బంధించి, హింసించి చంపిన తాలిబన్లు'

author img

By

Published : Jul 30, 2021, 10:25 AM IST

Updated : Jul 30, 2021, 12:31 PM IST

Danish Siddiqui
డానిష్​ సిద్దీఖి

తాలిబన్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ ఫొటో జర్నలిస్టు డానిశ్​ సిద్దీఖి మరణం.. ఆకస్మికంగా జరిగింది కాదని అమెరికా మేగజీన్​ ఒకటి తెలిపింది. సిద్దీఖిని తాలిబన్లు బంధించాక.. చిత్రవధ చేశారని చెప్పింది. తలచుట్టూ తీవ్రంగా గాయపరచి, బుల్లెటతో తూట్లు పొడిచి, శరీరాన్ని ముక్కలు చేసి పాశవికంగా చంపారని పేర్కొంది.

అఫ్గానిస్థాన్‌లో ఇటీవల తాలిబన్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ ఫొటో జర్నలిస్టు, పులిట్జర్​ అవార్డు గ్రహీత డానిశ్​ సిద్దీఖి మృతి... అకస్మాత్తుగా యాదృచ్ఛికంగా జరిగింది కాదని అమెరికా మేగజీన్‌ 'వాషింగ్టన్‌ ఎగ్జామినర్‌' పేర్కొంది. దీనిపై గురువారం ప్రత్యేక కథనం ప్రచురించింది. "సిద్దీఖి.. పాకిస్థాన్‌ సరిహద్దులోని బోల్డక్‌ ప్రాంతంలో అఫ్గాన్‌- తాలిబన్ల పోరాటాన్ని కవర్‌ చేసేందుకు అఫ్గాన్‌ ఆర్మీ బృందంతో కలిసి వెళ్లారు. బోల్డక్​ చెక్‌పోస్టు వద్ద ఈ బృందంపై తాలిబన్లు దాడి చేయడం వల్ల అంతా చెల్లాచెదురయ్యారు. సిద్దీఖి, మరో ముగ్గురు అఫ్గాన్​ సైనికులు వేరుపడ్డారు. దాడిలో పదునైన ఆయుధం సిద్దీఖిని తాకింది. అతన్ని సమీపంలోని మసీదులోకి తీసుకెళ్లిన సైనికులు అక్కడే ప్రాథమిక వైద్యం చేయించారు" అని కథనంలో చెప్పింది.

అతనెవరో తెలిశాక..

"ఆ తర్వాత కొద్దిసేపటికే మసీదులో జర్నలిస్టు ఉన్నాడన్న సమాచారం తాలిబన్లకు తెలిసి, అతని కోసమే ప్రత్యేకంగా దాడి చేశారు. తాలిబన్లు బందీగా పట్టుకొనేసరికి సిద్దీఖి బతికే ఉన్నాడు. అతనెవరో తెలుసుకున్నాకే చిత్రవధ చేశారు. తలచుట్టూ తీవ్రంగా గాయపరచి, బుల్లెట్లతో తూట్లు పొడిచి, శరీరాన్ని ముక్కలు చేసి పాశవికంగా చంపారు. ఈ క్రమంలో తాలిబన్ల నుంచి సిద్దీఖిని కాపాడేందుకు ప్రయత్నించిన సైనికులు కూడా హత్యకు గురయ్యారు" అని ఆ కథనం పేర్కొంది. యుద్ధ నియమాలను, అంతర్జాతీయ ఒడంబడికలను తాలిబన్లు ఏమాత్రం పాటించడం లేదన్న విషయం సిద్దీఖి దారుణ హత్యతో స్పష్టమైందని వాషింగ్టన్‌ ఎగ్జామినర్‌ వివరించింది.

ఇదీ చూడండి: సిద్ధిఖీ ఫొటోలు.. వేల భావాలు పలికే చిత్రాలు

ఇదీ చూడండి: తాలిబన్లు అంటే ఉగ్రవాదులు కాదు: పాక్ ప్రధాని

Last Updated :Jul 30, 2021, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.