ETV Bharat / international

బిల్​గేట్స్​ను వందల కోట్లకు బురిడీ కొట్టించిన పాకిస్థానీ

author img

By

Published : Aug 22, 2021, 3:15 PM IST

మైక్రోసాఫ్ట్​ అధినేత, అపర కుబేరుడు బిల్​ గేట్స్​ను పాకిస్థాన్​కు చెందిన ఓ వ్యక్తి వందల కోట్లు మోసం చేశారంటే నమ్ముతారా? అయితే.. అదే నిజం. ఓ వ్యక్తి.. బిల్​ లాంటి వ్యాపార దిగ్గజాన్ని అంత సునాయాసంగా ఎలా మోసం చేయగలిగాడు? అసలు ఏం జరిగింది?

arif naqvi duped gates
బిల్​గేట్స్ అండ్ నక్వీ

ప్రపంచ కుబేరుల్లో టాప్​-5లో ఒకరైన బిల్​ గేట్స్​ గురించి తెలియని వారుండరు. వ్యాపారంలోనే కాదు.. దాతృత్వ కార్యక్రమాల్లోనూ ముందుంటారు. గేట్స్​ ఫౌండేషన్​ ద్వారా ఇప్పటికే వేల కోట్ల రూపాయలు సాయం చేశారు. అలాంటి ఆయన్ను ఓ పాకిస్థానీ వందల కోట్ల రూపాయలు మోసం చేశాడంటే నమ్ముతారా? నమ్మశక్యంగా లేదు కదూ..! కానీ అదే నిజం. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా.. 100 మిలియన్​ డాలర్లు(సుమారు రూ.743 కోట్లు) బురిడీ కొట్టించాడు. అతడే.. పాకిస్థాన్​కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ప్రైవేటు ఈక్విటీ సంస్థ అబ్రాజ్​ గ్రూప్​ అధినేత ఆరిఫ్​ నఖ్వీ.

గేట్స్​ ఒక్కరే కాదు.. ఎంతో మంది ఆరిఫ్​ బుట్టలో పడ్డారు. సాయం పేరిట ధనవంతులను మోసం చేస్తున్న విధానంపై ఆయన సంస్థలోని సైమన్​ క్లార్క్​, విల్​ లాంచ్​ 'ద కీ మ్యాన్​: ద ట్రూ స్టోరీ ఆఫ్​ హౌ ద గ్లోబల్​ ఎలీట్​ వస్​ డ్యూప్​డ్​ బై ఏ క్యాపిటలిస్ట్​ ఫేయిరీ టేల్​' పేరిట ఓ పుస్తకమే రాశారు. దాని ప్రకారం.. నఖ్వీ 780 మిలియన్​ డాలర్లు సేకరించగా.. అందులో 385 మిలియన్​ డాలర్లకు లెక్కలు లేవు.

2013లో అబ్రాజ్​ సంస్థ ఏర్పాటు..

పాకిస్థాన్​, కరాచీలో 1960లో జన్మించారు నఖ్వీ. లండన్​ స్కూల్​ ఆఫ్​ ఎకనామిక్స్​లో చదువుకున్నారు. 2003లో 118 మిలియన్​ డాలర్లను సేకరించి అబ్రాజ్​ సంస్థను నెలకొల్పారు. అందులో చాలా వరకు పశ్చిమాసియా ప్రభుత్వాలు, రాజ కుటుంబీకులు, వ్యాపారులు పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలోనే ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పేదరికాన్ని రూపుమాపే ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లు ప్రకటించారు నఖ్వీ.

2010, ఏప్రిల్​లో అప్పటి అమెరికా అధ్యక్షుడి బరాక్​ ఒబామా అధ్వర్యంలో నిర్వహించిన వ్యాపారవేత్తల సమావేశానికి నఖ్వీతో పాటు 250 మంది ముస్లిం వ్యాపారులకు ఆహ్వానం అందింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే పెట్టుబడులు, కోట్లాది మంది చిన్నారులకు శిక్షణ, ఉపాధి కల్పన వంటి వాటిపై మాట్లాడారు నఖ్వీ. కొత్త సంస్థలు, పెట్టుబడులతోనే అది సాధ్యమవుతుందని నమ్మబలికారు. ఆ కార్యక్రమం జరిగిన రెండు నెలల తర్వాత అమెరికా ప్రభుత్వం.. నఖ్వీకి చెందిన అబ్రాజ్​ సంస్థలో 150 మిలియన్​ డాలర్లు పెట్టుబడి పెట్టింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు కోట్లాది రూపాయలు విరాళం అందించారు నఖ్వీ. గేట్స్​ ఫౌండేషన్​ మాదిరిగానే అమన్​ ఫౌండేషన్​ను స్థాపించారు. పాకిస్థాన్​లో ఆరోగ్య, విద్యా రంగాల అభివృద్ధికి కృషి చేయాలని సంకల్పించినట్టు ప్రకటించారు.

గేట్స్​ను బుట్టలో వేసి..

2017 సెప్టెంబర్​లో బిలియన్​ డాలర్ల నిధిని సమీకరించే లక్ష్యంతో న్యూయార్క్​లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు నఖ్వీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలపై పోరాడేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ధనవంతులు, బలమైన నేతలను కలిశారు. అందులో బిల్​ గేట్స్​, బిల్​ క్లింటన్​ వంటి ప్రముఖులు ఉన్నారు.

ఈ క్రమంలో.. బిల్​ గేట్స్​కు దగ్గరయ్యారు నఖ్వీ. తమ స్వచ్ఛంద సంస్థలు కలిసి పాకిస్థాన్​లో జనాభా నియంత్రణకు కృషి చేయాలనే అంశంపై ఇరువురు పలు సందర్భాల్లో మాట్లాడారు. ఆరిఫ్​ను నమ్మారు బిల్​ గేట్స్​. గేట్స్​ ఫౌండేషన్​ నుంచి 100 మిలియన్​ డాలర్లను నఖ్వీ సంస్థకు అందించారు. ఆ తర్వాత న్యూ అబ్రాజ్​ గ్రోత్​ మార్కెట్స్​ హెల్త్​ ఫండ్​కు ఇతర పెట్టుబడిదారుల ద్వారా 900 మిలియన్​ డాలర్లు అందాయి. ఇది ముఖ్యమైన భాగస్వామ్య పెట్టుబడిగా పేర్కొన్నారు గేట్స్​. భవిష్యత్తు కోసం వాగ్దానాలను కలిగి ఉన్న సున్నితమైన​ భాగస్వామ్యాలకు ఒక ఉదాహరణగా తెలిపారు.

అయితే.. నిజానికి నఖ్వీ నిధులను దుర్వినియోగం చేయటం అప్పటికే ప్రారంభించారు. అబ్రాజ్​లో ప్రపంచవ్యాప్తంగా 300 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. నియంత్రణ సంస్థల తనిఖీల సమయంలో బ్యాంకుల్లో డబ్బులు చూపించి ఆ తర్వాత ఖాళీ చేసే వారు.

అనుమానం నిజమైంది..

కొంత కాలం తర్వాత గేట్స్​ ఫౌండేషన్​లోని ఫండ్​ మేనేజర్​ ఆండ్రూ ఫర్నమ్​.. అబ్రాజ్​ గ్రూప్​పై​ అనుమానం వ్యక్తం చేశారు. ఆ సంస్థలపై నిఘా వేశారు. గతంలోని నిధులను వాటిని ఖర్చు చేసినట్లు చూపించనప్పటికీ మరిన్ని నిధులు ఇవ్వాలని అడగటంపై అనుమానం వ్యక్తం చేశారు. 2017లో గేట్స్​ ఫౌండేషన్​ అందించిన నిధులపై వివరాలు ఇవ్వాలని ఈమెయిల్​ పంపారు ఫర్నమ్​. నిధులు దుర్వనియోగం కాలేదని నిరూపించుకోవాలని స్పష్టం చేశారు. అయితే.. పాత బ్యాంకు స్టేట్​మెంట్లు పంపి తప్పించుకునే ప్రయత్నం చేశారు నఖ్వీ. వారం తర్వాత అబ్రాజ్​ సంస్థ ఉద్యోగి ఒకరు పెట్టుబడిదారులకు జరుగుతున్న మోసంపై ఈమెయిల్​ పంపగా నఖ్వీ బండారం బయటపడింది. అబ్రాజ్​ను నమ్మటం మానేసిన ఇన్వెస్టర్లు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని పట్టుబట్టారు.

అబ్రాజ్​ లెడ్జర్​ పుస్తకాలపై ఫోరెన్సిక్​ టీంతో దర్యాప్తు చేయించింది గేట్స్​ ఫౌండేషన్​. అయితే.. సంస్థపై దర్యాప్తు చేస్తున్నప్పటికీ మరోవైపు.. 6 బిలియన్​ డాలర్లు నిధుల సేకరణకు ప్రయత్నించటం గమనార్హం. సుమారు 660 మిలియన్​ డాలర్ల నిధులు పెట్టుబడిదారులకు తెలియకుండా అబ్రాజ్​ రహస్య​ ఖాతాల్లోకి వెళ్లాయని పుస్తకంలో పేర్కొన్నారు. అందులో 200 మిలియన్​ డాలర్లు ఆరిఫ్​, ఆయన సన్నిహితులకు అందినట్లు చెప్పుకొచ్చారు.

2019, ఏప్రిల్​ 10న లండన్​లోని హీత్రో​ ఎయిర్​పోర్ట్​లో నఖ్వీని అరెస్ట్​ చేశారు. అవినీతి ఆరోపణలు నిజమైతే.. ఏకంగా 291 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.

ఇదీ చదవండి: Electric vehicles: ఆన్​లైన్​లో జోరుగా విద్యుత్ వాహన కొనుగోళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.