ETV Bharat / entertainment

'సమంత ఇచ్చిన ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను'

author img

By

Published : Nov 10, 2022, 7:07 AM IST

samantha yashoda release date
యశోదలో సమంత

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమాల్లో కీలకమైనది... 'యశోద'. సమంత ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ చిత్రానికి హరీష్‌ - హరి దర్శకులు. తమిళంలో విజయవంతమైన పలు చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకులు వీళ్లు. చిత్రం విడుదలని పురస్కరించుకుని ముచ్చటించిందీ దర్శకద్వయం. ఆ విశేషాలు..

'యశోద'.. సమంత ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ చిత్రానికి హరీష్‌ - హరి దర్శకులు. తమిళంలో విజయవంతమైన పలు చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకులు వీళ్లు. 'యశోద'ని పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు. హిందీతోపాటు దక్షిణాది భాషల్లో చిత్రం విడుదలని పురస్కరించుకుని విలేకర్లతో ముచ్చటించిందీ దర్శకద్వయం. ఏమన్నారంటే..

"ఎప్పుడూ కొత్త రకమైన కథని చెప్పాలనేదే మా ప్రయత్నం. ఆ కథని ఎలా చెబుతున్నామనేది కూడా ముఖ్యమే. మేం గతంలో తమిళంలో చేసిన సినిమాల్లాగా, కథ చెప్పడం పరంగా 'యశోద' విషయంలోనూ సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సినిమా స్థాయి కూడా పెద్దది. ఇలాంటి కథని ఈ స్థాయిలో చెప్పడం అవసరం కూడా.

కథానాయిక సమంతతోపాటు, ఇతర ప్రధాన తారగణం, సాంకేతిక బృందం తోడయ్యాక సినిమా పరిధి మరింతగా పెరిగింది. మేం ఈ కథని సమంతని దృష్టిలో పెట్టుకునే రాశాం. కానీ ఆవిడ చేస్తుందో లేదో మాకు అప్పటికి తెలియదు. అందుకే తక్కువ నిర్మాణ వ్యయం అంచనాతోనే కథని రాసుకున్నాం. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌కి ఈ కథ చెప్పాక ‘అంతర్జాతీయ స్థాయిలో చెప్పాల్సిన కథ ఇది. పాన్‌ ఇండియా సినిమాగా చేద్దాం’ అన్నారు. సమంతని కలిశాక ఆమెది కూడా అదే అభిప్రాయమే".

సమంత ఆరోగ్య పరిస్థితి గురించి మాకు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే తెలిసింది. అంతకుముందు ఓ రోజు ఫైట్‌ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యాక సాయంత్రం సమంతకి జ్వరంగా ఉందని తెలిసింది. అంతే తప్ప, ఏ రోజూ చిత్రీకరణలో సమంత ఇబ్బంది పడలేదు.

సంగీత దర్శకుడు మణిశర్మ, ఛాయాగ్రాహకుడు సుకుమార్‌, ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేష్‌, రచయితలు పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి... ఇలా మంచి సాంకేతిక బృందం తోడైంది. ఆ ప్రభావం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. తదుపరి శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాణంలోనే మరో సినిమా చేస్తాం.".

"వాస్తవ సంఘటనల ఆధారంగా రాసిన కథ ఇది. సరోగసీ అంశం ఇందులో ప్రధానం కాదు. కథలో అదొక భాగమంతే. దానికంటే కీలకమైన విషయాలు కథలో ఉంటాయి. మీడియాలో వచ్చిన వార్తల్ని చూసిన తర్వాత రాసుకున్న స్క్రిప్ట్‌ ఇది. తెరపై ఈ కథని చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ షాక్‌ అవుతారు. హరీష్‌ ఓ కథనం చదివి దీనిపై మనం ఏమైనా చేద్దామనే ఆలోచనని వ్యక్తం చేశాడు. అప్పుడు మేం ఇద్దరం కలిసి స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం.

స్క్రిప్ట్‌ సిద్ధమయ్యాక ఆ కథకి తగ్గట్టుగా సస్పెన్స్‌ అంశాల్ని జోడించడంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. ఇదొక మెడికల్‌ మాఫియా తరహా కథ అనుకోవచ్చు. భావోద్వేగాలు సినిమాకి కీలకం. ఆ విషయంలో మాకు దర్శకుడు రాజమౌళి స్ఫూర్తి. ఆయన ప్రతీ సన్నివేశంలోనూ బలమైన భావోద్వేగాలు పండాలని చెబుతుంటారు. కళా దర్శకుడు అశోక్‌ నేతృత్వంలో దాదాపు 40 సెట్స్‌ నిర్మించాం. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ కథకి ఏం కావాలో అది సమకూర్చారు."

"సమంత కోసమే సిద్ధమైన ఈ కథలో ఆమె నటించడంతోనే సగం విజయం అందుకున్న అనుభూతి కలిగింది. సెట్లో ఆమెతో కలిసి పనిచేసిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎంత పెద్ద భావోద్వేగ సన్నివేశమైనా సరే, రెండు నిమిషాల సమయం అడిగి సెట్‌ అంతా నిశ్శబ్దంగా మారాక సులభంగా చేసేస్తారు. గ్లిజరిన్‌కూడా వాడరు.

దర్శకులుగా మేం ఏం కోరుకున్నామో అది ఇచ్చేసేవారు. మేం స్క్రిప్ట్‌ రాసుకున్నప్పుడే ఈ కథలో పోరాట ఘట్టాలు ఉన్నాయి. సమంత ‘ఫ్యామిలీమేన్‌ 2’ చేయడం, ఇందులోనూ పోరాట ఘట్టాలు ఉండటంతో అవి మరంత హైలెట్‌గా కనిపిస్తున్నాయి".

ఇదీ చదవండి: నా పెళ్లిలో చాలా పెద్ద గొడవ.. చెప్పులతో గట్టిగా కొట్టుకున్నారు: కత్రిన

శ్రీదేవి టూ అనుష్క అలాంటి పాత్రల్లో మెస్మరైజ్​ చేసిన భామలు వీరే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.