ETV Bharat / entertainment

'కేజీఎఫ్-2 సినిమా బాలీవుడ్​కు నచ్చలేదు.. నేనైతే నోరెళ్లబెట్టి చూశా'

author img

By

Published : Sep 5, 2022, 12:27 PM IST

director-ram-gopal-verma
director-ram-gopal-verma

కేజీఎఫ్-2 సినిమా బాలీవుడ్ వారిని చాలా భయపెట్టిందని అన్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. బాలీవుడ్​లో చాలా మందికి ఈ చిత్రం నచ్చలేదని చెప్పారు. తాను మాత్రం సినిమాను నోరెళ్లబెట్టి చూశానని తెలిపారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రంపైనా ఆయన స్పందించారు.

rgv on kgf 2: రూ.1250 కోట్ల వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని అలరించిన 'కేజీయఫ్‌ - 2'పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా విజయం బాలీవుడ్‌ వారిని ఎంతగానో భయపెట్టిందని అన్నారు. తాజాగా ఓ ఆంగ్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ వెబ్‌సైట్‌కు వర్మ ఇంటర్వ్యూ ఇచ్చారు. 'కశ్మీర్‌ ఫైల్స్‌', 'కేజీయఫ్‌ - 2' చిత్రాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు.

.

"కేజీయఫ్‌ - 2' బాలీవుడ్‌లో చాలా మందికి నచ్చలేదు. బీటౌన్‌కు చెందిన ఓ బడా దర్శకుడు ఓసారి నాకు ఫోన్‌ చేసి.. సినిమా అరగంట కూడా చూడకముందే బోర్‌గా అనిపించిందని చెప్పాడు. అదే సినిమాలోని ఓ సీన్‌ విషయంపై అతడికి, అతడి స్క్రిప్ట్‌ రైటర్‌కి మధ్య చిన్న చర్చ జరిగినట్లు తెలిపాడు. వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. ఆ సినిమా మీకు నచ్చినా, నచ్చకపోయినా అది సాధించిన విజయాన్ని ఎవరూ కాదనలేరు. నా దృష్టిలో 'కేజీయఫ్‌ - 2' భిన్నమైన కథ. 1970ల్లో అమితాబ్‌ నటించిన సినిమాల జోన్‌కు సంబంధించిన కథ ఇది. వాస్తవికతకు దూరంగా అసహజమైన రీతిలో ప్రశాంత్‌నీల్‌ దీన్ని రూపొందించారు. ఒక్కసారి 'పెద్దమ్మ' సీన్‌ గుర్తు చేసుకుంటే రాఖీభాయ్‌ మెషిన్‌ గన్‌తో పేలిస్తే జీపులన్నీ గాల్లోకి ఎగురుతాయి. ఇలా జీపులు గాల్లోకి లేవడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఈ సినిమా నాకు నచ్చలేదని చెప్పను. ఇందులోని కొన్ని సీన్స్‌ చూసినప్పుడు మాత్రం నోరెళ్లబెట్టుకుని మరీ చూశా" అని ఆర్జీవీ చెప్పారు.

.

rgv on kashmir files: "ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో అద్భుత విజయాన్ని అందుకున్న వాటిలో 'కశ్మీర్‌ఫైల్స్‌' కూడా ఒకటి. బాలీవుడ్‌ వాళ్లు కూడా పెద్దగా పట్టించుకోని ఓ దర్శకుడి నుంచి ఇలాంటి సినిమా రావడం గొప్ప విషయం. ఈ సినిమాలో నటించిన వారిలో అందరికీ తెలిసింది అనుపమ్ ఖేర్‌ ఒక్కరే. కానీ, ఈచిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.250 కోట్లు వసూలు చేసింది. దర్శకుడు ఈ చిత్రాన్ని స్లో నెరేషన్‌లో రూపొందించారు. సరైన స్క్రీన్‌ప్లే, ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ ఉండనప్పటికీ ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. గడిచిన ఇరవై ఏళ్లలో 'కశ్మీర్‌ ఫైల్స్‌'ని చూసినంత సీరియస్‌గా ఏ చిత్రాన్నీ ప్రేక్షకులు చూసి ఉండరు" అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.