ETV Bharat / entertainment

సౌందర్యలహరిపై మాట్లాడిన దర్శకేంద్రుడు, అదే కారణమంటూ

author img

By

Published : Aug 18, 2022, 7:24 AM IST

raghavendra rao director
raghavendra rao director

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న సినిమా వాంటెడ్​ పండుగాడ్​. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆయన ఈనాడు సినిమాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలు మీకోసం

కొంచెం తీపి.. కొంచెం కారం.. కొంచెం పండ్లు.. 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ' పుస్తకానికి అగ్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు పెట్టిన ఉపశీర్షిక అది. ఆయన జీవితంలో పండుకి ఉన్న ప్రాధాన్యం అదీ! న్యూటన్‌ ఆపిల్‌ పడినప్పుడు గురుత్వాకర్షణ కనిపెడితే, నేను మాత్రం ఆపిల్‌ ఎక్కడ పడాలో కనిపెట్టానని చెబుతారాయన. అందుకేనేమో ఇటీవల 'వాంటెడ్‌ పండుగాడ్‌ అంటూ ఓ సినిమానీ సమర్పిస్తున్నారు. శ్రీధర్‌ సీపాన దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఇది ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా దర్శకేంద్రుడు 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ..

"సామాజికంగా.. రాజకీయంగా చాలా గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈఎమ్‌ఐలు, పెరిగిన ధరలు, ఫీజులు, కరోనా తర్వాత పరిణామాలు.. వీటిన్నిటితో ఎవరిని కదిపినా సరే ఒక రకమైన ఒత్తిడి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో మనందరికీ కావల్సింది స్వచ్ఛమైన నవ్వు. మనసుకి చికాకుగా అనిపించిందంటే మన మిత్రుల్లో సరదాగా మాట్లాడే వాళ్లుంటే కాసేపు వాళ్లదగ్గరికి వెళ్లి గడుపుతాం. అలా ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి హాస్యభరితం చిత్రం చేస్తే బాగుంటుందనిపించింది. అప్పుడే జనార్ధన మహర్షి ఓ కథ చెప్పారు. చెబుతున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాం. జంధ్యాల, ఈవీవీ ఉన్నప్పుడు వాళ్ల సినిమాలకి వెళ్లి కడుపుబ్బా నవ్వుకుని వచ్చేవాళ్లం. మన జీవితాల్లో అరుదైనవి కాబట్టి హాస్యానికీ, గ్లామర్‌కీ ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. జనార్ధన మహర్షి కథ చెప్పగానే ఇది నా శైలి పాటలతో, వందశాతం వినోదంతో సినిమా తీయాలని నడుం బిగించాం. అదే... 'వాంటెడ్‌ పండుగాడ్‌".

"నిధి వేట తరహాలో సాగే కథ ఇది. పట్టుకుంటే కోటి అనే ఉపశీర్షికలోనే ఈ కథ ఉంది. ఇందులో ఒకొక్కరికీ ఒక్కో అవసరం ఉంటుంది. ఆ అవసరాలు చాలా సరదాగా, నవ్వుకునేలా ఉంటాయి. వాళ్లందరూ కోటి కోసం ఎలా ప్రయత్నించారనేది ఈ సినిమా కథ. నటుల్లో చాలామంది ఈ సినిమాకి కొనసాగింపుగా 'పట్టుకుంటే పది కోట్లు' అని, ఆ తర్వాత ఇరవై కోట్లు అని వరుసగా సినిమాలు చేద్దామన్నారు. వాళ్లందరినీ అంతగా ప్రభావితం చేసిందీ కథ. ఎంతో బాధ్యతగా తీసుకుని కొత్తతరాన్ని పరిచయం చేశా. కథానాయకులు, కథానాయికలు, సాంకేతిక నిపుణులు... చాలామందే నా సినిమాలతో పరిచయమయ్యారు. మొన్న 'పెళ్లిసందడి'తో నాయకానాయికలుగా పరిచయమైన రోషన్‌, శ్రీలీల వరకు అందరూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు దర్శకుల్ని పరిచయం చేస్తున్నా. 'పెళ్లిసందడి' సినిమాకి మాటలు రాస్తూ మాతో ప్రయాణం చేసిన శ్రీధర్‌ సీపానలో మంచి కామెడీ టైమింగ్‌ ఉంటుంది. తనైతే బాగుంటుందని దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పా".

  • "ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. 'సీతారామం', 'బింబిసార', 'కార్తికేయ2' ఇలా ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా వైవిధ్యంగా సాగే సినిమాలు. మా సినిమా చాలా రోజుల తర్వాత వస్తున్న సంగీతం, గ్లామర్‌ ప్రధానంగా సాగేపూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం".
  • "ఆత్మకథలా నా గురించి కాకుండా.. పరిశ్రమకి, రాబోయే తరానికి ఉపయోగపడాలనే 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ' పుస్తకాన్ని రాశా. నేను 'సౌందర్యలహరి'తో మాట్లాడటానికీ కారణం అదే. ఇంత జీవితాన్నిచ్చిన సినీ రంగానికి మనమేదైనా చేయాలనే మాట్లాడా. ప్రతి ఎపిసోడ్‌ ఓ పాఠంలా నాతో కలిసి పనిచేసిన నటులు, సాంకేతిక నిపుణుల అనుభవాలతో ఆ కార్యక్రమం సాగుతుంది. సహాయ దర్శకులు, దర్శకులు వాళ్ల జీవితాల్లో చేయాల్సినవి, చేయకూడనివంటూ కొన్ని ఉంటాయి. అలాంటి విషయాల్ని నా అనుభవాలతో ఈ పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశా. అక్కడక్కడా నా వ్యక్తిగత జీవిత విశేషాలు ఉంటాయి. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధామూర్తి ఈ పుస్తకాన్ని చదివి ఫిల్మ్‌ ఇండస్ట్రీ బైబిల్‌గా అభివర్ణించారు"

ఇవీ చదవండి: ఆస్కార్​ రేసులో నాని, సాయిపల్లవి సినిమా

విజయ్​దేవరకొండ లైగర్​ కొత్త ప్రోమో, కన్నీటిపర్యంతమైన ఛార్మి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.