ETV Bharat / crime

న్యాయవాద దంపతుల హత్య కేసులో ముమ్మర దర్యాప్తు

author img

By

Published : Feb 19, 2021, 8:52 PM IST

police probe on vaman rao couple murder case
న్యాయవాద దంపతుల హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో కీలక నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. బిట్టు శ్రీను పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మేనల్లుడు. హత్యకేసులో నిందితులకు వాహనం, ఆయుధాలు సమకూర్చింది అతడేనని పోలీసులు వెల్లడించారు.

రాష్ట్రంలో కలకలం రేపిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏ1 నిందితుడు కుంట శ్రీను, ఏ2 నిందితుడు చిరంజీవి, ఏ3 నిందితుడు అక్కపాక కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు.... మరో కీలక వ్యక్తి బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. వామన్‌రావు, నాగమణి హత్య కేసులో నిందితులకు వాహనం, ఆయుధాలు సమకూర్చింది బిట్టు శ్రీను అని ఏ1 కుంట శ్రీను తెలిపినట్లు నిన్న ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు.

కత్తులను పండ్ల దుకాణం నుంచి తెచ్చారు

జడ్పీ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తన తల్లి పేరిట నిర్వహిస్తున్న ట్రస్ట్‌ బాధ్యతల్ని బిట్టు శ్రీను చూస్తుంటాడు. హత్యలో ఉపయోగించిన కత్తుల్ని మంథనిలోని ఓ ప్రజాప్రతినిధికి చెందిన పండ్ల దుకాణం నుంచి తీసుకొచ్చారనే వాదన వినిపిస్తోంది. బిట్టు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేయటంతో ఇప్పుడు మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. పుట్ట మధుకు సంబంధించి పలు విషయాల్లో న్యాయవాది వామన్‌రావు ఫిర్యాదులు, పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో తాజాగా బిట్టు శ్రీనును అరెస్టు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.

ఆరు ప్రత్యేక బృందాలు

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో పట్టపగలే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే న్యాయవాద దంపతులను కిరాతకంగా నరికి చంపారు. రక్తపు మడుగులో పడి ఉన్న న్యాయవాది వామన్ రావు.... కుంట శ్రీను పేరును వెల్లడించారు. హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసుల ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతికత సాయంతో... మహారాష్ట్ర సరిహద్దుల్లో హత్య చేసి పారిపోతున్న కుంట శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్‌లను అరెస్టు చేశారు.

నిందితులకు కరోనా పరీక్షలు

హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి హత్య వెనక జడ్పీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రమేయం ఉందని వామన్ రావు కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. అతన్ని కూడా ప్రశ్నించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కుంట శ్రీనివాస్‌, చిరంజీవి, కుమార్‌కు పోలీసులు గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించారు. ముగ్గురికి కరోనా నెగెటివ్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆటోను తప్పించబోయి బస్సు కిందపడి వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.