ETV Bharat / crime

బొగ్గు గనిలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఒకరు వెలికితీత

author img

By

Published : Mar 8, 2022, 4:11 PM IST

Updated : Mar 8, 2022, 8:30 PM IST

peddapalli coal mine
peddapalli coal mine

16:08 March 08

బొగ్గు గనిలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఒకరు వెలికితీత

పెద్దపల్లి జిల్లా రామగుండం ఆండ్రియాల్‌ లాంగ్వాల్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగి 30 గంటలు గడిచినా ఘటనపై పూర్తిస్థాయి స్పష్టత రావడం లేదు. సోమవారం మధ్యాహ్నం సైడు పైకప్పు కూలడంతో.. మొత్తం ఏడుగురు చిక్కుతున్నారు. వెంటనే అప్రమత్తమైన సహాయక సిబ్బంది.. రెస్క్యూ ఆపరేషన్​ ప్రారంభించారు. ఫలితంగా నిన్న.. వీరయ్య, పిల్లి నరేష్, జాడి వెంకటేశ్వర్లును క్షేమంగా బయటకు తీశారు. ఇవాళ మధ్యాహ్నం బొగ్గు గని శిథిలాల నుంచి బదిలీ వర్కర్​ రవీందర్​ను వెలికి తీశారు. అనంతరం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు నలుగురిని బయటకు తీయగా.. మరో ముగ్గురు ఇంకా శిథిలాల కిందే చిక్కుకున్నారు. శిథిలాల కింద ఏరియా సేఫ్టీ మేనేజర్ జయరాజ్, అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, ఒప్పంద కార్మికుడు శ్రీకాంత్​లను బయటికి తీసుకు రావడానికి రెస్య్కూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది.

శిథిలాలను యంత్రాల ద్వారా తొలగిస్తే అందులో చిక్కుకుపోయిన వారికి గాయాలు, ప్రాణనష్టం జరుగుతుందేమోనన్న ఉద్దేశంతో మాన్యువల్​గానే శిథిలాలను తొలగిస్తున్నారు. దీనివల్లనే సహాయక చర్యల్లో ఆలస్యమవుతోందని సమాచారం. మరో వైపు కుటుంబ సభ్యులంతా తమవాళ్లను ఎప్పుడు బయటికి తీసుకువస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు. ముగ్గురు సింగరేణి డైరెక్టర్లు బలరాం, చంద్రశేఖర్, సత్యనారాయణ.. బొగ్గు గని వద్ద క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బొగ్గు గనిలోని ప్రమాద స్థలికి ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ కిట్లను పంపిస్తూ చర్యలను ముమ్మరం చేశారు.

'కార్మికులపై భారం మోపుతున్నారు..'

ఉత్పత్తే ధ్యేయంగా సింగరేణి ఉన్నతాధికారులు కార్మికులపై భారం మోపుతున్నారని కార్మిక సంఘం నేత వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. రక్షణ మరిచి లక్ష్యాల కోసం ఒత్తిడి చేయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రణాళిక లోపం ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా.. ముఖ్యమంత్రి సహా మంత్రులెవరూ స్పందించకపోవడం దారుణమన్నారు. బాధితులకు కనీసం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ ఉదయం గనిలోపలికి వెళ్లినప్పుడు.. సహాయక సిబ్బంది పైప్​తో రవీందర్​కు నీళ్లు అందించారు.. కానీ మరో ముగ్గురు నుంచి ఎటువంటి లైట్​, శబ్దం రావడం లేదన్నారు. వారూ క్షేమంగా బయటకురావాలని ఆకాంక్షించారు.

'ప్రమాదానికి వారే కారణం..'

ఈ ప్రమాదానికి సింగరేణిలోని క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు కారణం కాదని సింగరేణి గుర్తింపు సంఘం నాయకులు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. ప్రణాళిక లోపం కారణంగానే ఘటన జరిగినట్లు తాము భావిస్తున్నట్లు చెప్పారు. బొగ్గు గని లోపల కింది నుంచి ప్యానల్​ను పైకి తీసుకురావాల్సి ఉండగా.. పైకి నుంచి కిందకు తీసుకొచ్చారు. డీవాటరింగ్​ సహా పనిస్థలాల్లో ఒత్తిడి పడడమూ ఇలాంటి ప్రమాదాలకు కారణమన్నారు.

గనిలోకి వెళ్లిన మంత్రి కొప్పుల..

పెద్దపల్లి జిల్లా అడ్రియాల్ బొగ్గు గనిలోకి మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌, సింగరేణి డైరెక్టర్ బలరాంలతో లోపలికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు.

ఇదీచూడండి: బొగ్గు గనిలో ప్రమాదం.. శిథిలాల కింద చిక్కుకుపోయిన పలువురు సిబ్బంది

Last Updated :Mar 8, 2022, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.