ETV Bharat / crime

ఎస్‌బీఐలో నకిలీ బంగారం కలకలం.. రూ. కోటికి పైగా స్వాహా..

author img

By

Published : Jun 25, 2021, 8:50 AM IST

Updated : Jun 25, 2021, 9:41 AM IST

Loans with fake gold jewelers at SBI Manchiryala District
నకిలీ బంగారంతో రుణాలు

నమ్మకమైన పనిని అప్పగిస్తే.. నామాలు పెట్టాడు ఓ వ్యక్తి. బంగారంపై రుణం ఇచ్చే సమయంలో బ్యాంకర్లు అప్రైజర్‌తో తనిఖీ చేయించడం చూస్తుంటాం. బంగారంపై అవగాహన ఉన్నవారిని ఈ పనిలో పెట్టుకుంటారు. నస్పూర్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో నియమితుడైన వ్యక్తి తనకు తెలిసిన స్నేహితుల సాయంతో నకిలీ బంగారాన్ని కుదువ పెట్టించి రూ.కోటికి పైగా సొమ్ము స్వాహా చేశారు.

మంచిర్యాల జిల్లా నస్పూర్ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో నకిలీ బంగారు ఆభరణాలతో రూ. కోటికి పైగా రుణాల తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నస్పూర్‌ ఎస్​బీఐలో అరుణ్‌కుమార్‌ అనే వ్యక్తి 2014 నుంచి గోల్డ్‌ అప్రైజర్‌ పనిచేస్తున్నారు. కృష్ణా జిల్లా బందర్‌లో సుమారు 9 తులాల రాగికి ఒక తులం బంగారం కలిపి 10 తులాల బంగారు ఆభరణాలు తయారు చేస్తారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో ఇలాంటి నకిలీ బంగారాన్ని అరుణ్‌కుమార్‌ స్నేహితుల సహాయంతో తాకట్టు పెట్టి దాదాపు రూ. కోటికి పైగా రుణాలు తీసుకున్నారని పోలీసులు తెలిపారు.

మొత్తం నకిలీ బంగారం 2.81 కిలోలు ఉండగా 350 గ్రాములు మాత్రమే రికవరీ అయిందని.. విచారణ కొనసాగుతుందని ఏసీపీ పేర్కొన్నారు. అందులో బ్యాంకు సిబ్బంది సహకారం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వీరు సుమారు 30 మందికిపైగా తమ బంధువులు, స్నేహితులు, పరిచయస్థుల ఖాతాల ద్వారా నకలీ బంగారంతో రుణాలు తీసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. మరో నిందితుడు లక్ష్మారెడ్డి పరారీలో ఉండటంతో అతని పూర్తి లావాదేవీలు తెలియలేదని.. ఆయన రూ.కోటి వరకు రుణం తీసుకోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఆరుగురిపై కేసు నమోదు..

తీసుకున్న రుణాలు రికవరీ కాకపోవడంతో బ్యాంకు మేనేజర్‌ నేహాశర్మ ఈనెల 19న నస్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొదట ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా మరో ముగ్గురు రుణాలు తీసుకోవడంతో వారిపైనా కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అప్రైజర్‌ అరుణ్‌కుమార్‌తో పాటు సంతోష్‌కుమార్‌ ఇద్దరిని రిమాండ్‌కు తరలించామని.. అన్వేష్‌, లక్ష్మారెడ్డి, లింగారెడ్డి, జీవన్‌ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: KTR: నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్​ను ప్రారంభించనున్న కేటీఆర్​

Last Updated :Jun 25, 2021, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.