ETV Bharat / crime

Booster Dose Cyber Crimes : అలర్ట్​.. ఈ విధంగా మీకూ మెసేజ్​ వచ్చిందా...?!

author img

By

Published : Jan 25, 2022, 8:10 AM IST

Booster Dose Cyber Crimes
Booster Dose Cyber Crimes

Booster Dose Cyber Crimes : రోజుకో రూట్ మారుస్తూ.. పోలీసుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. అమాయకులకు ఎర వేస్తూ.. వారి కష్టాన్ని దోచుకుంటూ.. పోలీసుల చేతిలో నుంచి ఇసుక జారినట్లు జారిపోతున్నారు సైబర్ కేటుగాళ్లు. కేవైసీ, బ్యాంక్​, లోన్లు, ఇతర కారణాలతో ఫోన్లకు సందేశాలు పంపిస్తూ అమాయకులకు వల వేస్తూ నగదు దోచేస్తున్నారు. ఇప్పుడు పంథా మార్చి కరోనా బూస్టర్ డోస్​ పేరుతో మాయ చేస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి డబ్బు కాజేస్తున్నారు.

Booster Dose Cyber Crimes : ‘'కాలం మారుతున్నట్టు.. సైబర్‌ నేరగాళ్ల ఆలోచనా విధానాలూ మారుతున్నాయి. మనల్ని ఎప్పటికప్పుడు ఇరకాటంలో పెడుతూ ఏదో విధంగా మోసం చేస్తూనే ఉన్నారు కంటికి కనిపించని కేటుగాళ్లు. ఇప్పుడు ప్రజల బలహీనతను అవకాశంగా చేసుకుని కొత్త మోసానికి తెరతీశారు. మేము జీహెచ్‌ఎంసీ నుంచి ఫోన్‌చేస్తున్నాం. మీరు బూస్టర్‌ డోసు తీసుకోవాల్సి ఉందా అంటారు. మేం స్లాట్‌ బుక్‌ చేస్తున్నాం. ఓటీపీ చెప్పమంటారు. అంతే ఖాతాలో సొమ్మంతా ఖాళీ చేస్తారు. వ్యాక్సినేషన్‌ పేరు మీద మీకు ఎవరైనా ఫోన్‌చేసి వివరాలు అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి’’.

- ఇదీ సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ విభాగం హెచ్చరిక.

ఫిర్యాదు చేస్తే.. సొమ్ము దొరికే అవకాశం..

Booster Dose Frauds : ‘‘మీకు ఇట్టే లాభాలు వస్తాయంటూ ఆశపెడుతుంటారు. యాప్‌ల్లో పెట్టుబడితో లక్షలు వస్తాయంటారు. మేం పంపుతున్న లింకులను క్లిక్‌ చేస్తే చాలంటూ సైబర్‌నేరగాళ్లు మోసాలకు దిగుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్థిక నేరానికి గురైనట్టు గ్రహించగానే బాధితులు వెంటనే 155260/ 100 నంబర్లకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయండి. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి పొందే అవకాశం ఉంది' అంటూ రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసుల సూచనలు.

సైబర్ నేరాల కట్టడికి అసలైన అస్త్రమదే..

Cyber Crimes in the name of Booster Dose : రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌నేరాలపై వచ్చే ఫిర్యాదుల్లో 90శాతం గ్రేటర్‌ నుంచే ఉంటున్నాయి. ఉన్నతోద్యోగులు, విద్యావంతులు, సాంకేతిక నిపుణులు, గృహిణులు, వయోధికులు ఇలా అన్నివర్గాలు మాయగాళ్ల ఉచ్చులో పడి లక్షలు నష్టపోతున్నారు. మోసగాళ్లు కూడా అనువుగా ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. ప్రస్తుతం తక్కువ ధరకే వస్తువులు, పెట్టుబడులు, బూస్టర్‌డోసులంటూ ప్రజలకు టోకరా వేస్తున్నారు. కొత్త ఏడాది 15 రోజుల వ్యవధిలోనే సుమారు 90-100 వరకూ ఫిర్యాదులు అందాయి. మాయగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం సామాజిక మాధ్యమాలను వేదికగా మలచుకుంది. మోసపోయేందుకు వీలున్న అంశాలపై అవగాహన కల్పిస్తోంది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అన్నింటి ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది. పిల్లల నుంచి పండుటాకుల వరకూ అందరి వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు సైబర్‌ నేరాల కట్టడికి అసలైన అస్త్రం అంటున్నారు.

సైబర్‌ మాయగాళ్లు పంపిన సందేశాలు

కళ్లెదుటే ఉన్నా ఇంకా అదే తీరు..

Booster Dose Frauds in Telangana : ప్రభుత్వం అందించే బూస్టర్‌డోసుకు ఎటువంటి నగదు తీసుకోదు. ఫోన్‌చేసి ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయమని డిమాండ్‌ చేయరని గుర్తించాలని రాచకొండ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ సూచించారు. సైబర్‌ మాయగాళ్ల మాటలతో మోసపోతున్న బాధితులు కళ్లెదుట కనిపిస్తున్నా గ్రహించకపోవటం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నామని వివరించారు. సైబర్‌ నేరస్థులు ఏయే తరహాలో మోసగిస్తారు. ఏ విధంగా మాట్లాడతారు. ఎటువంటి అంశాలను ఎంపిక చేసుకుంటారనే అంశాలు.. మాయగాళ్లు పంపిన సందేశాలను ఉదాహరణలుగా చూపుతూ అవగాహన పెరిగేలా చేస్తున్నట్టు చెప్పారు. బిహార్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ వంటి చోట్ల నుంచి ఫోన్‌చేసి మేం ఫలానా అని చెప్పగానే గుర్తించాలి. తోట్రుపాటు, మర్యాదలేని మాటతీరుతో వీళ్లను ఇట్టే గుర్తించవచ్చన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.