10th Class Student Suicide: తన పేరు మీద ఇన్‌స్టాగ్రాంలో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి.. అసభ్యకర సందేశాలు పోస్ట్ చేస్తున్నారన్న మనస్తాపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్‌లో జరగ్గా.. కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్ గ్రామానికి చెందిన ముస్లే సాక్షి అనే బాలిక.. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసింది. అయితే.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇన్‌స్టాగ్రాంలో సాక్షి పేరు మీద ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు. అందులో తనను కించ పరిచే విధంగా సందేశాలు.. అసభ్యకర ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.
ఈ విషయం తనకు తెలియటంతో వాటిని చూసి సాక్షి మనస్తాపానికి గురైంది. తన పేరు మీద ఉన్న ఐడీతో వస్తున్న సందేశాలను స్నేహితులతో పాటు తెలిసినవారంతా చూసి ఉంటారన్న ఆలోచన తనను వెంటాడింది. ఆ సందేశాలు చూసిన వాళ్లంతా తనను తప్పుగా అనుకుంటారని మనసులో మొదలైన ఆలోచన ఆమెను కుంగదీసింది. ఆ ఐడీ తనది కాదని అందరికీ చెప్పలేననుకుందో..? ఒకవేళ చెప్పినా ఎవ్వరూ నమ్మరు అనుకుందో..? మొత్తానికి ఈ సమస్యకు పరిష్కారం తన చావేనని నిర్ణయించుకుంది. మే 29న ఉదయం ఏడున్నర ప్రాంతంలో ఇంట్లో పురుగుల మందు తాగింది. తీవ్ర వాంతులు చేసుకుంటున్న సాక్షిని.. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూనే 30న సాక్షి మృతి చెందింది. తన కూతురి పేరు మీద అసభ్యకరంగా సందేశాలు పంపడం వల్లే ఆత్మహత్య చేసుకుందని తల్లి యశోదాబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తనకు ఎదురైన సమస్యకు చావే పరిష్కారమన్న అనాలోచిత నిర్ణయంతో నిండు ప్రాణాన్ని తీసుకుని.. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. ఎవరో చేసిన పిచ్చి పనికి తన బంగారు భవిష్యత్తును చేజేతులా కాలరాసుకుంది. అలా కాకుండా కొంచెం తెలివిగా ఆలోచించి.. తన సమస్యను తల్లిదండ్రులతోనో, స్నేహితులతోనో, ఉపాధ్యాయులతోనో, పోలీసులతోనో.. పంచుకుంటే పరిష్కారం దొరికుండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కుంగిపోయి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా.. విద్యార్థులు, యువత దైర్యంగా, తెలివిగా ఎదుర్కొని పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి సైబర్ సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు చెప్పి నకిలీగాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి కానీ.. విలువైన ప్రాణాలు తీసుకోకూడదని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: