ETV Bharat / city

కొడకండ్లలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

author img

By

Published : Oct 30, 2020, 5:21 PM IST

ministers niranjan reddy, errabelli, satyavathi rathod monitoring cm tour arrangements in kodakondla
కొడకండ్లలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

రైతు వేదికలు కర్షక దేవాలయాలని... దేశంలో నూతన ఒరవడికి నాంది అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఈ వేదికల ద్వారా కొత్త ఆలోచనలు, నూతన పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుని అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు. జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పర్యటన ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్‌, కడియం శ్రీహరితో కలిసి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు.

రాష్ట్రంలో తొలి రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జనగామ జిల్లా కొడగండ్లలో ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి కొడగండ్లకు చేరుకుని రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్​ కొడకండ్లలో సభా ఏర్పాట్లను పరిశీలించారు. మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

రూ.573 కోట్ల వ్యయంతో 2,601 వేదికలు..

రైతులను సంఘటితం చేసి చైతన్య పరిచేలా.. ప్రతి 5 వేల మందికి ఒక వేదిక ఉండేలా రూ.573 కోట్ల వ్యయంతో.. రాష్ట్రంలో 2,601 రైతు వేదికలకు సర్కార్ శ్రీకారం చుట్టింది. పలు చోట్ల ఇప్పటికే వేదికలు పూర్తవ్వగా.. మరికొన్ని చోట్ల ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. రైతులు కూర్చునేందుకు విశాలమైన గదులు, ఇంటర్నెట్ కనెక్షన్లు మొదలైన వసతులను వేదికల్లో కల్పిస్తున్నారు. సాగులో ఎదురైయ్యే సాదకబాధకాలకు.. అధికారులు, శాస్త్రవేత్తల నుంచి సలహాలు సూచనలు కూడా రైతులు వేదికల ద్వారా తెలుసుకునే వీలుంటుంది. జనగామ జిల్లాలో కొడగండ్లలో తొలి రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు స్వయంగా ప్రారంభించనున్నారు.

రైతే రాజుగా బతకాలి..

ఇది రైతువేదిక కాదని, రైతుల భవిష్యత్ వేదికలని మంత్రి నిరంజన్ రెడ్డి అభివర్ణించారు. రైతే రాజుగా బతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకుని నిరంతరం పనిచేస్తున్నారన్నారు. ఈ వేదికల ద్వారా రైతులకు ముఖ్యమంత్రి దిక్చూచిగా నిలుస్తారని తెలిపారు.

వ్యవసాయ ముఖచిత్రం ప్రతిబింబించేలా..

వ్యవసాయ ముఖచిత్రం ప్రతిబింబించేలా రైతు వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ధాన్యం తీసుకువెళ్లే రైతు, నాగలి, ఎడ్లబండి కళాకృతులు ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. సమీపంలోనే ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనం కూడా అందంగా రూపుదిద్దుకుంటోంది. రాళ్లపై వన్యప్రాణులు, రకరకాల పక్షుల చిత్రాలకు కళాకారులు జీవం పోశారు. పిల్లలు ఆడుకునేందుకు అనేక వస్తువులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లలో పోలీసులు నిమగ్నమయ్యారు.

కొడకండ్లలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

ఇవీ చూడండి: అబద్ధాల పునాదులపై గెలవాలని భాజపా ప్రయత్నిస్తోంది: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.