ETV Bharat / city

Vijayawada durga temple: ఇంద్రకీలాద్రిపై స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు

author img

By

Published : Oct 7, 2021, 7:49 AM IST

Vijayawada durgamma
Vijayawada durgamma

విజయవాడ ఇంద్ర కీలాద్రిపై దసరా వేడుకలు ఆరంభం అయ్యాయి. మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. తొలిరోజున స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనుంది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనుంది. వినాయక ఆలయం దగ్గర నుంచి క్యూలైన్లు ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు మీదుగా వేశారు. ఒకసారి క్యూలైన్‌లో ప్రవేశించిన భక్తులు నేరుగా అమ్మవారి దర్శనం చేసుకున్నాకే బయటకు వస్తారు. భవానీపురం వైపు నుంచి వచ్చేవారికి కుమ్మరిపాలెం చౌరస్తా నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఐదు లైన్లలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు అమ్మవారి దర్శనం సాఫీగా సాగిపోయేలా క్యూలైన్లను ఏర్పాటు చేశారు.

దర్శనం చేసుకున్న తర్వాత శివాలయం వైపు నుంచి కిందకు దిగిపోతారు. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. రోజుకు 10వేల మందికే దర్శనాలు కల్పిస్తామంటున్నప్పటికీ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దానికోసం ముందస్తుగానే టిక్కెట్‌ కౌంటర్లను.. నగరపాలక సంస్థ, పున్నమిఘాట్‌, ఘాట్‌రోడ్డులో, కొండ దిగువన ఏర్పాటు చేశారు. ఈ ఏడాది తొమ్మిది రోజులకు కలిపి 10 నుంచి 15 లక్షల లడ్డూ ప్రసాదం సిద్ధం చేస్తున్నారు. అవసరాన్ని బట్టి తయారు చేసేలా ఏర్పాట్లు చేశారు. కొండ దిగువన కనకదుర్గానగర్‌లో ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. కొండపైన కూడా ఒక కౌంటర్‌, పున్నమిఘాట్‌ వద్ద మరో ప్రసాదం కౌంటర్‌ వీఐపీల కోసం ఉంచారు.

కేశఖండన, జల్లు స్నానం...

కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి కూడా నదీ స్నానాలకు అనుమతించడం లేదు. సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాలను ఏర్పాటు చేశారు. అక్కడే భక్తులు జల్లు స్నానాలు చేసేలా 300కు పైగా షవర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మించారు. క్యూలైన్లలో భక్తులు వెళ్లే సమయంలో వారికి తాగునీటి ప్యాకెట్లను అందిస్తారు. చిన్న పిల్లలకు వేడి పాలను కూడా ఇవ్వనున్నారు.

ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష..

దసరా ఉత్సవాల ఏర్పాట్లపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ బుధవారం సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌హాల్‌లో జరిగిన సమావేశానికి.. రెవెన్యూ, మున్సిపల్‌, దుర్గగుడి అధికారులు హాజరయ్యారు. ఉత్సవాల నిర్వహణలో అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. దుర్గగుడి వద్ద భక్తులు వచ్చే మార్గంలో ప్రతి 40 మీటర్ల దూరానికి ఒక ఆశా వర్కర్‌, వారిని పర్యవేక్షించేందుకు ఒక హెల్త్‌ సెక్రటరీ, ఏఎన్‌ఎంలను నియమించాలని చెప్పారు. నగరంలో ఉన్న వార్డుల్లో రోజుకు మూడింటి వాలంటీర్లను విధులకు వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌కు కలెక్టర్‌ సూచించారు.

35 వేల మందికి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు..

ప్రతి రోజూ పది వేల చొప్పున ఆన్‌లైన్‌లో టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు తొమ్మిది రోజులకు కలిపి 35వేల మంది టిక్కెట్లను తీసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. భక్తులు క్యూలైన్లలో వచ్చేటప్పుడు కచ్చితంగా మాస్కు ధరించాలని, విధుల్లో ఉన్న సిబ్బంది, వలంటీర్లు కూడా మాస్కుతోనే ఉండాలని సూచించారు.

నేడు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా..

దసరా ఉత్సవాల తొలిరోజు గురువారం స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనుంది. పూర్వం మాధవవర్మ అనే మహారాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు విజయవాటికాపురిలో కనకవర్షం కురిపించిందని ప్రతీతి. అప్పటి నుంచి అమ్మవారిని కనకదుర్గగా కొలుస్తూ.. దసరా మహోత్సవాలలో స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల దారిద్య్రాలు నశిస్తాయనేది భక్తుల నమ్మకం.

ఇదీచూడండి: Bathukamma celebrations: ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.