ETV Bharat / city

చుక్కల్లో కూరగాయల ధరలు.. బెంబేలెత్తుతున్న సామాన్యులు

author img

By

Published : Sep 28, 2020, 11:17 PM IST

Vegetables Price hike In Markets
చుక్కల్లో కూరగాయల ధరలు.. బెంబేలెత్తుతున్న సామాన్యులు

మార్కెట్​లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వరుస వర్షాల వల్ల.. కూరగాయల పంటలు దెబ్బతిని.. చాలావరకు చేలలోనే పాడైపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా గత పది రోజుల్లోనే కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. మార్కెట్​కి వెళ్లి ఏ కూరగాయలు కొనాలన్నా.. సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

కరోనా సమయంలో కూరగాయలతో కూడిన బలవర్ధకమైన ఆహారం తీసుకోవటం ముఖ్యమని వైద్యులు చెప్తున్నారు. రోజూ కూరల్లో తప్పనిసరిగా ఉపయోగించే ఉల్లి ధరలు ఇప్పటికే.. ఆకాశానికంటాయి. హైదరాబాద్‌లోని రైతు బజార్లలో గతవారం రోజుల్లో 20 రూపాయలు పెరగగా.. బయట పదిరూపాయాలు ఎక్కువే అమ్ముతున్నారు. ఉల్లి, టమాటతో పాటు ఇతర కూరగాయలు రేట్లు కూడా రెండింతలయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలతో స్థానికంగా కూరగాయల లభ్యత తగ్గిపోవటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుండటం వల్ల కూరగాయల రేట్లు పెరిగినట్లు విక్రయదారులు చెప్తున్నారు.

కిలో 25రూపాయలు ఉండే ఉల్లి ఇప్పుడు రూ.45కి చేరింది. కిలో టమాట రూ.50 నుంచి 60కి అమ్ముతున్నారు. కిలో బెండకాయలు రూ.60, బీన్స్ రూ.100, మార్కెట్లో చిక్కుడు తక్కువగా ఉండటం వల్ల కిలో రూ.80 ధర పలుకుతోంది. రెండు వారాల్లోనే.. కూరగాయల ధరలు పెరగడం వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. రూ.100 ఖర్చు పెడితే వచ్చే కూరగాయల కోసం రూ.200 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోటు వల్లే ధరల పెరిగాయి..

ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు పాడైపోయాయని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల వల్ల.. చేలలోని పంట సైతం కుళ్లిపోయి.. మార్కెట్​లో కూరగాయలకు లోటు ఏర్పడింది. మహారాష్ట్ర, కర్ణాటకలాంటి రాష్ట్రాల నుంచి కూరగాయల తెప్పించాల్సి వస్తోందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. ఖరీఫ్‌ నుంచి రబీ సీజన్‌ మధ్య ఖాళీలో కూడా ధరల పెరుగుతాయని.. రైతు బజార్​ అధికారులు తెలిపారు.

వారం రోజుల్లో ధరలు తగ్గుతాయ్​..

రైతు బజార్‌లో ధరల సూచిక బోర్డుపై ఉండే ధరలకు కాకుండా ఎక్కువ ధరకు కూరగాయలు అమ్ముతున్నారు. ధరలు చూసిన వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ధరలు నియంత్రించేందుకు చర్యలు తీసుకోని కిలో టమాటపై 26 రూపాయలు, ఉల్లిగడ్డపై రూ.34గా నిర్ణయించారు. అయితే ఈ ధరకు రైతులు విక్రయించటం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఎర్రగడ్డ రైతుబజార్​కు దొండకాయ, బీరకాయ, గోరు చిక్కుడు, ఉల్లి, ములక్కాయ, చామగడ్డ, బెండకాయ, కాకరకాయ పుష్కలంగా లభిస్తున్నాయి. ప్రస్తుతం కొంచెం ధరలు పెరిగినప్పటికీ వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టడం వల్ల వారం పది రోజుల్లో ధరలు తగ్గే అవకాశం ఉందని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి : ఇందూరు ఎమ్మెల్సీ ఉపఎన్నికే లక్ష్యంగా తెరాస వ్యూహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.