ETV Bharat / city

Telangana Government schools : బడి మెరుస్తోంది.. విద్యార్థుల్ని మురిపిస్తోంది!

author img

By

Published : Oct 11, 2021, 8:48 AM IST

Telangana Government schools
Telangana Government schools

ఒకప్పుడు సర్కార్ బడులంటే(Telangana Government schools) విరిగిపోయిన బెంచీలు, పెచ్చులు రాలిపడే పైకప్పులు, విద్యార్థుల్లేక ఉపాధ్యాయులు ఖాళీ బ్లాక్​బోర్డును చూస్తే గడిపే రోజులు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. ప్రభుత్వ పాఠశాలలను కాన్వెంట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులను ఆకర్షించడానికి బడి రూపులే మార్చేస్తున్నారు. రూపురేఖల్లోనే కాదు విధివిధానాల్లోనూ, నిర్వహణలోనూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులను సర్కార్ బడులకు రప్పించేలా రాష్ట్ర విద్యాశాఖ బృహత్తర ప్రణాళిక రచిస్తోంది.

సర్కారు బడులంటే(Telangana Government schools) విరిగిపోయిన బెంచీలు, పెచ్చులు రాలిపడే పైకప్పులు.. ఇలాంటి పరిస్థితిని మార్చడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. పిల్లల్ని ఇట్టే ఆకర్షించేలా బడులను తీర్చిదిద్దేందుకు పాఠశాల విద్యాశాఖ(Telangana Education Ministry) కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,634 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మోడల్‌ క్లస్టర్‌ పాఠశాలలుగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక తయారుచేస్తోంది. ఒక్కో దానికి రూ. 3 లక్షల చొప్పున మొత్తం రూ.109 కోట్లు ఖర్చు చేయనున్నారు. అందులో 60:40 శాతం నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేస్తాయి. సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) కింద మోడల్‌ క్లస్టర్‌ పాఠశాలలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మూడు నెలల క్రితమే ఆమోదం తెలిపింది. పనులు చేపట్టేందుకు నియమ నిబంధనలు తయారు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ(Telangana Education Ministry) అధికారి ఒకరు తెలిపారు.

ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యం

రాష్ట్రంలో 1,817 స్కూల్‌ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ఒక్కోదాని పరిధిలో రెండేసి పాఠశాలలను మోడల్‌ క్లస్టర్‌ పాఠశాలలుగా మారుస్తారు. మండలంలో కొన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు కలిపి ఒక ఉన్నత పాఠశాలే స్కూల్‌ కాంప్లెక్స్‌గా పనిచేస్తుంది. విద్యాపరంగా పర్యవేక్షణకు స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడికి అధికారాలుంటాయి. జాతీయ నూతన విద్యా విధానంలో కూడా వాటిని బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. క్లస్టర్‌ లేదా స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని కొన్ని పాఠశాలలను అన్ని రకాల వనరులతో అభివృద్ధి చేసి ఇతర పాఠశాలలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నది ఆలోచన. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎస్‌ఏ కింద మోడల్‌ క్లస్టర్‌ పాఠశాలలకు ప్రతిపాదించగా కేంద్రం 60 శాతం వాటా నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఒక్కో స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో రెండేసి చొప్పున మొత్తం 3,634 బడుల్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారు.

చూడగానే ఆకట్టుకునేలా..

చూడగానే విద్యార్థులను ఆకర్షించేలా బడులను రూపుదిద్దాలన్నది లక్ష్యం. అందుకు ప్రధానంగా విద్యార్థులు కూర్చొని చదువుకునేందుకు చక్కటి డెస్కులు ఏర్పాటు చేస్తారు. రంగులు వేస్తారు. తరగతి గదిలో గోడలకు కింది నుంచి మూడు, నాలుగు అడుగుల వరకు పిల్లలు రాసుకునేందుకు వీలుగా చుట్టూ బ్లాక్‌ బోర్డులు మాదిరిగా రంగులు వేస్తారు. ఆపైన ఇతర రంగులు వేస్తారు. తరగతి గదిలో ఎటు చూసినా విజ్ఞానాన్ని పెంచేలా అక్షరాలు, లెక్కలు, బొమ్మలు కనిపించేలా తీర్చిదిద్దుతారు. గ్రంథాలయం కోసం కొన్ని పుస్తకాలు ఏర్పాటు చేస్తారు. మొత్తానికి ఇతర పాఠశాలల్లో లేనివిధంగా.. చూడగానే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ బడిలో చేర్పించేందుకు ముందుకు రావాలన్నది లక్ష్యం. ఒక్కో బడికి రూ. 3 లక్షలు నిధులు సరిపోకుంటే విడతలవారీగా రెండు, మూడేళ్లపాటు ఈ పథకం కింద నిధులు ఖర్చు చేస్తామని అధికారవర్గాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.