ETV Bharat / city

ap zptc mptc elections 2021: పదవి వరించింది... విధి వక్రీకరించింది

author img

By

Published : Sep 20, 2021, 9:32 AM IST

ఎన్నో ఆశలతో ఏపీ పరిషత్ ఎన్నికల్లో(Parishath elections) పోటీ చేసి... గెలిచిన కొందరు అభ్యర్థులు ఆ విజయానుభూతిని ఆస్వాదించకముందే కన్నుమూశారు. పోలింగ్‌ తర్వాత వివిధ కారణాలతో పలువురు అభ్యర్థులు చనిపోయారు(candidates died). వీరంతా తాజా ఫలితాల్లో గెలిచారు. దీంతో వారి కుటుంబీకులు, పార్టీ శ్రేణుల్లో విషాదం మరింత పెరిగింది.

పదవి వరించింది... విధి వక్రీకరించింది
పదవి వరించింది... విధి వక్రీకరించింది

ఏపీ పరిషత్‌ ఎన్నికల్లో గెలిచినవారిలో కొందరు అభ్యర్థులు విజయానుభూతిని ఆస్వాదించకముందే కన్నుమూశారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత కరోనా, ఇతర అనారోగ్య కారణాలతో కొందరు మృతి చెందారు. దీంతో వారి కుటుంబీకులు, పార్టీ శ్రేణుల్లో విషాదం మరింత పెరిగింది. గుంటూరు జిల్లా కర్లపాలెం-1 ఎంపీటీసీ స్థానానికి వైకాపా తరఫున దొంతిబోయిన ఝాన్సీలక్ష్మి పోటీ చేశారు. కర్లపాలెం మండలాధ్యక్ష పదవి కూడా ఆమెకే దక్కుతుందని అంతా భావించారు. జూన్‌లో రెండో దశ సమయంలో కరోనా ఆమెను బలి తీసుకుంది. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఝాన్సీలక్ష్మి తెదేపా అభ్యర్థిపై గెలుపొందారు.

  • చిత్తూరు జిల్లాలో అయిదుగురు ఎంపీటీసీ అభ్యర్థులు పోలింగ్‌ తర్వాత వివిధ కారణాలతో చనిపోయారు. వీరంతా తాజా ఫలితాల్లో గెలిచారు. రామసముద్రం- 1లో హసీన్‌తాజ్‌, గుడుపల్లె మండలం సంగనపల్లిలో బసప్ప, మదనపల్లి మండలం మాలేపాడులో చంద్రశేఖర్‌రెడ్డి, శాంతిపురం మండలం 64 పెద్దూరులో చెంగారెడ్డి వైకాపా తరఫున ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేశారు. పోలింగ్‌ తర్వాత వీరంతా మే నెలలోనే చనిపోయారు. నగరి మండలం నంబాకం తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి జయశేఖరరెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. తాజాగా వైకాపా అభ్యర్థిపై 590 ఓట్లతో గెలిచారు.
  • ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లేళ్లపల్లి ఎంపీటీసీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన జిల్లెల జ్యోతి ఇటీవల మరణించారు.
  • పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం సత్యవోలులో వై.రంగారావు, పెరవలి మండలం కానూరు-2లో ఎం.సుశీల, నిడదవోలు మండలం తాళ్లపాలెంలో రోహిణిబాబు, తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం-2లో కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు వైకాపా తరఫున ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసి గెలిచారు. పోలింగ్‌ తర్వాత వీరిలో కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, రంగారావు కరోనాతో మరణించారు. సుశీల, రోహిణిబాబు కూడా ఇటీవల కన్నుమూశారు.
  • విశాఖ జిల్లా మునగపాక మండలం నాగులాపల్లి- 2 సెగ్మెంట్‌ నుంచి వైకాపా తరఫున గెలిచిన మళ్ల నాగసన్యాసిరావు తన కుమార్తె కరోనాతో మృతి చెందడంతో మనోవేదనతో కన్నుమూశారు.
  • విజయనగరం జిల్లాలో వెంకంపేట, రెడ్డికంచేరు, సారిపల్లి వైకాపా ఎంపీటీసీ అభ్యర్థులు లక్ష్మణరావు, అప్పల రాములు, శంకరకాసులమ్మ ఇటీవల మృతి చెందారు. వీరంతా ఈఎన్నికల్లో గెలిచారు.
  • శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం దేవుదల ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థిగా గెలిచిన కెంబూరు అన్నపూర్ణ (75) ఇటీవలే కన్నుమూశారు.

93 మంది అభ్యర్థుల మృతి

సుదీర్ఘకాలం సాగిన పరిషత్‌ ఎన్నికల ప్రక్రియలో 93 మంది అభ్యర్థులు పోలింగ్‌కు ముందే మృతి చెందారు. వీరిలో 82 మంది ఎంపీటీసీ అభ్యర్థులు, 11 మంది జడ్పీటీసీ అభ్యర్థులు ఉన్నారు. ఈ స్థానాల్లో ఎన్నికలు నిలిపివేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పోలింగ్‌ పూర్తయ్యాక కూడా మరో 20 మంది మృతి చెందారు. వీరిలో ఇద్దరు జడ్పీటీసీ అభ్యర్థులు కాగా మిగిలిన 18 మంది ఎంపీటీసీ అభ్యర్థులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.