ETV Bharat / city

CORONA VACCINE: స్లాట్‌లు లభించక.. నిర్ణీత తేదీకి వెళ్లినా దొరక్క..

author img

By

Published : Jul 17, 2021, 9:54 AM IST

corona vaccine
corona vaccine

కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చి ఇన్నాళ్లయినా.. అనుకున్న సమయంలో సామాన్యులకు టీకా దొరకడం లేదు. స్లాట్​లు లభించక.. నిర్ణీత తేదీకి వెళ్లినా దొరక్క అవస్థలు పడుతున్నారు. తొలి డోసు వేసుకున్నాక.. రెండో డోసు కోసం వేచిచూడాల్సిన పరిస్థితి వస్తోంది.

  • వనస్థలిపురంలో ఉంటున్న దంపతులు తొలిడోసు కింద కొవిషీల్డ్‌ టీకాను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తీసుకున్నారు. రెండో డోసు ఈ నెల మూడో తేదీలోపు వేయించుకోవాలి. అప్పటి నుంచి తిరుగుతున్నా సరే వారికి వ్యాక్సిన్‌ లేదని, తర్వాత రావాలని ఏదో కారణంతో తిప్పి పంపుతున్నారు. అసలే థర్డ్‌వేవ్‌పై ఆందోళన...ఇప్పటికే మొదటి డోసు గడువు ముగియడంతో ఆ దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటులో వేయించుకోవాలంటే ఆర్థిక స్తోమత లేక వెనక్కి తగ్గుతున్నారు.
  • అమీర్‌పేట్‌లో ఉంటున్న దంపతులు తమ దగ్గరలోని ప్రభుత్వ కేంద్రంలో తొలి డోసు కొవాగ్జిన్‌ తీసుకున్నారు. అక్కడే రిజిస్ట్రేషన్‌ చేసి టీకా ఇచ్చారు. నిర్ణీత సమయం దగ్గర పడటంతో రెండోడోసు తీసుకోవాలంటూ వారి సెల్‌కు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. అయితే అదే సెంటర్‌కు వెళితే కొవిడ్‌ యాప్‌లో బుక్‌ చేసుకొని రావాలని సిబ్బంది సూచించారు. యాప్‌లో బుక్‌ చేసుకుందామని తెలిసిన వారి దగ్గరకు వెళితే అందులో స్లాట్‌ కన్పించలేదు. దీంతో ఆందోళనతో అదే సెంటర్‌కు వెళితే మళ్లీ అదే సమాధానం వచ్చింది.

వీరే కాదు... నగరంలో చాలామంది పరిస్థితి ఇలానే ఉంది. రెండో డోసు కోసం చాలామంది తిప్పలు పడుతున్నారు. టీకా కోసం ప్రభుత్వ కేంద్రాలకు వెళితే తిప్పిపంపుతున్నారు. కొవిన్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో బుక్‌ చేసుకొని రావాలని సూచిస్తున్నారు. కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. కొన్నిచోట్ల మాత్రం తిరస్కరిస్తున్నారు. రోజుల తరబడి ఉచిత స్లాట్‌ కోసం ప్రయత్నిస్తున్నా దొరక్కపోవడంతో నగరవాసులు అసహనానికి గురవుతున్నారు. 10 నుంచి 15 రోజులు ప్రయత్నించినా సరే ఉచిత స్లాట్‌ కనిపిచండం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. పెయిడ్‌ ఆప్షన్‌ ఎంచుకోగానే చాలా ప్రైవేటు కేంద్రాలు ప్రత్యక్షమవుతున్నాయని వాపోతున్నారు.

కేవలం 11 లక్షల మందికే..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌ జిల్లాల పరిధిలో కోటిన్నర వరకు జనాభా ఉంది. ప్రతి జిల్లాలో టీకా పంపిణి రోజుకు గరిష్ఠంగా 35 వేలకు మించి దాటడం లేదు. ముఖ్యంగా రెండో డోసులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ జిల్లాల పరిధిలో 65.74 లక్షల మందికి మొదటి డోసు టీకా వేశారు. అంటే దాదాపు 50 శాతం మందికి ఇచ్చినట్లైంది. అయితే రెండో డోసు విషయంలో వెనుకబాటు కన్పిస్తోంది. ఇప్పటివరకు కేవలం 11.85 లక్షల మందికి మాత్రమే రెండో డోసు అందించారు. ఇంకా 50 లక్షలపైనే నిరీక్షిస్తున్నారు. అదనపు కేంద్రాలతోపాటు అపార్ట్‌మెంట్లు, కాలనీలు, బస్తీలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ప్రత్యేక కేంద్రాలు పెట్టి టీకా అందించాల్సిన అవసరం ఉంది. టీకాతోనే థర్డ్‌వేవ్‌ను అడ్డుకునే పరిస్థితి ఉందని నిపుణులు సైతం చెబుతుండటంతో ఆ దిశగా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మొదటిది నమోదు కాక ఇబ్బందులు

కొందరు మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నా సరే...ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు కాకపోవడంతో రెండో డోసుకు ఇబ్బందులు తప్పడం లేదు. క్యూలో నిలబడటం ఇష్టం లేక ఇతర పనుల్లో హడావుడిగా ఉండేవారంతా పైరవీలు ఇతరత్రా దారులు వెతుక్కొని మొదటి డోసు వేయించుకున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అవడంతో రెండో డోసు ఎలా అని తర్జనభర్జన పడుతున్నారు. ‘మా అమ్మకు కొవిషీల్డ్‌ మొదటి డోసు వేయించాం. అయితే ఆ స్టేటస్‌ ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ కాలేదు. దీంతో రెండో డోసు వేయించేందుకు ఆస్కారం లేకుండా పోయింది’ అంటూ ఫిల్మ్‌నగర్‌కు చెందిన శ్రీమాన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. కొవిడ్‌-19 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసినా స్పందన లేదని వాపోయాడు. లక్డీకాపూల్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో మొదటి డోసు తీసుకున్న అశ్విన్‌ అనే వ్యక్తికి సర్టిఫికేట్‌ రాకపోవడంతో రెండో డోసుకు దూరమవుతున్నానంటూ ఆవేదన చెందుతున్నాడు. ఇలాంటి వారికి ఒకదారి చూపాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖపై ఉంది.

ఇవీచూడండి: కొవిడ్‌ ఉద్ధృతి తగ్గాలంటే.. వ్యాక్సిన్‌ ఉద్ధృతి పెరగాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.