ETV Bharat / city

భాజపా చరిత్రలో ఇలాంటి ఎన్నిక ఎప్పుడూ జరగలేదు: మల్లికార్జున ఖర్గే

author img

By

Published : Oct 8, 2022, 3:47 PM IST

Mallikarjun Kharge
Mallikarjun Kharge

Mallikarjun Kharge on Congress Presidential Poll: పేరు మార్చుకున్నంత మాత్రాన తెరాస జాతీయ పార్టీ అయిపోదని ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. గతంలో చాలా ప్రాంతీయ పార్టీలు పేరు మార్చుకున్నా.. జాతీయ పార్టీలు కాలేదని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన.. మద్దతు కోసం రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో నేతల మధ్యే ఈ ఎన్నిక జరుగుతుందన్న ఖర్గే.. భాజపా చరిత్రలో ఇలాంటి ఎన్నిక జరగలేదన్నారు.

భాజపా చరిత్రలో ఇలాంటి ఎన్నిక ఎప్పుడూ జరగలేదు: మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge on Congress Presidential Poll: ప్రాంతీయ పార్టీలు పేరు మార్చుకున్నంత మాత్రాన జాతీయ పార్టీలు అయిపోవని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జునఖర్గే పేర్కొన్నారు. తెరాస జాతీయ పార్టీగా మారుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ఖర్గే.. పార్టీ ప్రతినిధుల మద్దతు కోసం రాష్ట్రానికి వచ్చారు. ఇందులో భాగంగా గాంధీభవన్​లో పీసీసీ ప్రతినిధులతో ఖర్గే సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఖర్గే ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ పార్టీలో ఎన్నిక జరుగుతుందని.. భాజపా చరిత్రలో ఇలాంటి ఎన్నిక ఎప్పుడూ జరగలేదన్నారు. మోదీ, అమిత్‌షా దేశాన్ని నాశనం చేస్తున్నారని ఖర్గే విమర్శించారు. తొమ్మిది వేలకు పైగా ఉన్న ఓటర్లను తాను నేరుగా కలిసి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పర్యటించి, కాంగ్రెస్ ఓటర్లను అభ్యర్థించానని పేర్కొన్న ఖర్గే.. 138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్​లో నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగాయన్నారు. ఇప్పుడు ఐదోసారి.. తాను బరిలో దిగానని తెలిపారు. ఈ క్రమంలోనే ఉదయ్​పూర్ చింతన్ బైటక్​లో తీసుకున్న డిక్లరేషన్​ను అమలు చేస్తానన్న ఖర్గే.. రైతులు, యువత, మహిళలు, అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తామన్నారు. శశిథరూర్ కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఇందులో ఎలాంటి వ్యత్యాసం ఉండదని స్పష్టం చేశారు.

మోదీ, అమిత్‌షా కలిసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. 60 ఏళ్లలో ఏం చేశారంటున్నారు. మేము దేశాన్ని ధాన్య భాండాగారంగా తీర్చిదిద్దాం. ప్రాజెక్టులు నిర్మించాం.పెద్దపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశాం. భాజపా, దాని వెనక ఉన్న ఆర్ఎస్‌ఎస్‌ కలిసి మేము నెలకొల్పిన వాటిని ఒకదాని తర్వాత మరొకదాన్ని అమ్మేస్తూ వస్తున్నారు. కొందరిని కుబేరులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ రూపాయి విలువ 82.82కి పడిపోయింది. బియ్యం, పప్పులు, పెట్రోల్‌, డీజిల్‌.. ఇలా నిత్యావసర వస్తువుల ధరలు జీఎస్టీ కారణంగా ఆకాశాన్నంటుతున్నాయి. మా హయాంలో రూ.414గా ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇవాళ రూ.1,100 అయింది. మహిళలకు ఉచితంగా ఇచ్చే పథకాలనూ లేకుండా చేశారు. ఇలాంటి పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. ఇలాంటి ధోరణులపై పోరాడేందుకే నేను నిలబడుతున్నాను.'-మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి

'భాజపాకు ప్రజాస్వామ్యంపై నమ్మకమే లేదు. అద్వానీ, గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, నడ్డాలను ఎన్నికలు జరిపే ఎన్నుకున్నారా.? పైగా నడ్డా పదవీ కాలాన్ని పొడిగించారు. ముందు మీరు పాటించకుండా ఇతరుల గురించి మాట్లాడటమెందుకు? ప్రజాస్వామ్య విధానం కాకుండా ఏకఛత్రాధిపత్యంతో వ్యవహరించే భాజపాకు కాంగ్రెస్‌ అంతర్గత ఎన్నికల గురించి మాట్లాడే హక్కులేదు. ఏడీఎంకేగా ఉన్న పార్టీ ఏఐడీఎంకేగా మారింది. టీఎంసీగా ఉన్న పార్టీ ఆల్‌ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ అయింది. ఇలా అనేక ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా పేరు మార్చుకున్నాయి. కానీ, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా వాటిలో ఎవరూ చేరలేదు' అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

అంతకుముందు ప్రత్యేక విమానంలో బేగంపేట ఏయిర్‌పోర్టుకు చేరుకున్న ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రేవంత్, ఉత్తమ్, పొన్నం, వీహెచ్, పొన్నాల, సంపత్ స్వాగతం పలికారు. ఖర్గే వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా హైదరాబాద్ వచ్చారు. అక్కడి నుంచి గాంధీ భవన్ చేరుకున్న ఖర్గే.. ఇందిరా భవన్‌లో పీసీసీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.