ETV Bharat / city

కరోనాపై ప్రభుత్వ చర్యల పురోగతి వివరాలేవి: హైకోర్టు

author img

By

Published : May 5, 2021, 10:35 AM IST

ap high court news, high-court-on-covid-treatment
కరోనాపై ప్రభుత్వ చర్యల పురోగతి వివరాలేవి: హైకోర్టు

కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగి విపత్కర పరిస్థితులు ఎదురైతే లోటుపాట్లు లేకుండా చికిత్సనందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొన్ని రాష్ట్రాల అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని సూచించింది. ప్రస్తుతానికి సరేనని, భవిష్యత్తు గురించే తాము ఆలోచిస్తున్నామంది. ఆక్సిజన్‌ నిల్వలు సరిపోకపోతే పరిస్థితేమిటని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో మృతుల చివరి ప్రయాణం గౌరవప్రదంగా ఉండాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్​లో కరోనా పరిస్థితులపై దాఖలైన వ్యాజ్యాల్లో కోర్టుకు సహాయకుడిగా వాదనలు వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ను అమికస్‌ క్యూరీగా నియమించింది. పిటిషనర్లు, ప్రభుత్వం కోర్టులో దాఖలు చేసిన దస్త్రాలను అమికస్‌ క్యూరీకి అందజేయాలని సూచించింది. కరోనాపై ప్రభుత్వ చర్యల పురోగతి వివరాలను మెమో రూపంలో అందించాలని ఏజీని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ సామాజిక కార్యకర్త తోట సురేశ్‌బాబు గతేడాది సెప్టెంబరులో హైకోర్టులో పిల్‌ వేశారు. కరోనా కట్టడికి కేంద్రం మార్చి 23న ఇచ్చిన మార్గదర్శకాలను అమలుచేయడం లేదంటూ ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి బి.మోహన్‌రావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వీటిపై హైకోర్టు మరోసారి విచారించింది. ధర్మాసనం ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌, అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి, జీపీ సుమన్‌ సమాధానాలనిచ్చారు.

ఆక్సిజన్‌ నిల్వ సామర్థ్యం పెంచుతున్నాం..
కేంద్రాన్ని ఆక్సిజన్‌ ఎక్కువ పంపమని కోరతామని, దాని నిల్వ సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకున్నామని అదనపు ఏజీ, జీపీ ధర్మాసనం ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. హిందూపురంలో మరణాలు ఆక్సిజన్‌ కొరత వల్ల కాదని వివరించారు. కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రిలో పైప్‌లైన్‌ పగిలిపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్​లోని ఆసుపత్రుల్లో 55,719 పడకలున్నాయని, వీటిల్లో 33,760 పడకలపై బాధితులున్నారని తెలిపారు. కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో మరికొన్ని పడకలున్నాయన్నారు. కర్ఫ్యూపై ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదని న్యాయమూర్తుల ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు.
వినతినిచ్చేందుకు వెసులుబాటు
న్యాయవాదులు, గుమస్తాలు, కోర్టు సిబ్బందికి కరోనా పరీక్షలు, చికిత్స విషయంలో తాడేపల్లి/విజయవాడలో చికిత్స కేంద్రాన్ని ఏర్పాటుచేయాలంటూ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి పి.రామన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం విచారించింది. దీనిపై సంబంధిత అధికారులకు వినతినిచ్చేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిచ్చింది.

ఇదీ చదవండి: కొవిడ్‌ దెబ్బకి గిరాకీలు లేక అల్లాడుతున్న వ్యాపారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.