ETV Bharat / city

LANKA VILLAGES: గోదావరి మహోగ్రరూపం.. లంకగ్రామాలు విలవిల

author img

By

Published : Jul 14, 2022, 9:41 AM IST

godavari floods
godavari floods

LANKA VILLAGES: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎటుచూసినా నీరే.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద కాటన్‌ బ్యారేజీకి జలాలు పోటెత్తుతున్నాయి. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురు, శుక్రవారాల్లో ఉద్ధృతి మరింత పెరిగి మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉండవచ్చని అంచనా. బుధవారం రాత్రి 11 గంటలకు 15,07,669 క్యూసెక్కులు వస్తుండగా.. అదే స్థాయిలో సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 15.10 అడుగులకు చేరింది. పరీవాహక ప్రాంతాల్లో చాలాచోట్ల పంటలు నీట మునిగాయి.

LANKA VILLAGES:కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 40 లంక గ్రామాలను గోదావరి జలాలు చుట్టుముట్టడంతో రాకపోకలు స్తంభించాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పశ్చిమలంకలో 13 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలాచోట్ల ఉద్యాన పంటలు, నర్సరీ మొక్కలు నీట మునిగాయి. కొవ్వూరు మండలం మద్దూరు లంకకు ముంపు ముప్పు ఎదురవగా.. గ్రామంతోపాటు, గట్ల పరిస్థితినీ అధికారులు సమీక్షించారు.

LANKA VILLAGES
గోదావరి మహోగ్రరూపం.. లంకగ్రామాలు విలవిల

సురక్షిత ప్రాంతాలకు గర్భిణులు: ముంపు ప్రాంతాల్లోని 338 మంది గర్భిణులను వైద్యారోగ్యశాఖ గుర్తించింది. హైరిస్క్‌ గర్భిణులు 52 మందిని ఆసుపత్రులకు తరలించామని.. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 1,970 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా చెప్పారు.

ఎటపాక, కూనవరం అతలాకుతలం: భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవహిస్తుండటంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన ఎటపాక, కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాలు అతలాకుతలం అవుతున్నాయి. రాయనపేట, నెల్లిపాక, కన్నాయిగూడెం, మురుమూరు ప్రధాన, జాతీయ రహదారులపై వరద ప్రవాహం కొనసాగుతోంది. రాకపోకలు స్తంభించాయి. కూనవరం మండలంలో 15 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాల్లో 6,500 మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. దాదాపు 25,000 మంది నిరాశ్రయులైనట్లు చెప్పారు. దేవీపట్నం వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కొండమొదలు పంచాయతీలోని గ్రామాల ప్రజలు కొండలపైనే ఉంటున్నారు. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్దకు భారీగా వరద చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యాం పైభాగంలో ఉన్న పోశమ్మగండి- పూడిపల్లి గ్రామాలకు వరద నీరు పోటెత్తింది.

LANKA VILLAGES
గోదావరి మహోగ్రరూపం.. లంకగ్రామాలు విలవిల
  • జూరాల ద్వారా శ్రీశైలానికి చేరుతున్న వరదకు తుంగభద్ర ప్రవాహం తోడైతేనే శ్రీశైలం జలకళ సంతరించుకోనుంది. తుంగభద్ర డ్యాం నుంచి బుధవారం రాత్రి లక్ష క్యూసెక్కులకు పైగా విడుదల చేయడం ప్రారంభించారు. వరద శ్రీశైలం చేరుకోవడానికి 36 గంటల కన్నా ఎక్కువ సమయమే పట్టనుంది.
  • గోదావరికి వరద ఉద్ధృతి మరింత పెరగనుందని.. గురువారం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ తెలిపారు. అత్యవసర సహాయం కోసం రాష్ట్రస్థాయి సమాచార కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. 1070, 1800 4250 101, 08632 377118 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

నేడు, రేపు వర్షాలు: వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం, రుతుపవన ద్రోణితోపాటు తూర్పు-పడమర గాలుల కోత నేపథ్యంలో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.

పోలవరం వద్ద స్థిరంగా వరద: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద వరద స్థిరంగా ఉంది. ప్రస్తుతం నీటిమట్టం 34.23గా ఉంది. 48 గేట్ల నుంచి 14.60 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. అధికారులు గేట్ల పని తీరును మరోసారి పర్యవేక్షించారు. ప్రస్తుతం గేట్లను 40 మీటర్ల ఎత్తుకు లేపి ఉంచినట్లు పర్యవేక్షణాధికారి పి.సుధాకరరావు చెప్పారు.

గాలుల తాకిడికి నేలకూలిన అరటి: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో వాణిజ్య పంటలకు వర్షాలు, ఈదురు గాలులు నష్టాన్ని మిగిల్చాయి. కొల్లూరు మండలం సుగ్గునలంక, ఈపూరు, రేవు అంచు ప్రాంతాల్లో వంద ఎకరాల్లో అరటి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది..

LANKA VILLAGES
గోదావరి మహోగ్రరూపం.. లంకగ్రామాలు విలవిల

తుంగభద్ర 30 గేట్ల ఎత్తివేత: కర్ణాటకలోని తుంగభద్రకు బుధవారం సాయంత్రం వరద ఉద్ధృతి పెరగడంతో ముందు జాగ్రత్తగా 99 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని వచ్చిన వరదను వచ్చినట్లే నదికి వదులుతున్నారు. 30 క్రస్టు గేట్లను ఎత్తి 1,10,078 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం 33 గేట్లను ఎత్తే అవకాశం ఉంది. శృంగేరిలోని తుంగ జలాశయం పూర్తిగా నిండింది. భద్ర ఇంకా నిండలేదు. అది నిండితే తుంగభద్రకు వచ్చే వరద అమాంతం పెరిగే అవకాశం ఉంది. కర్ణాటకలోని ఆలమట్టి నుంచి నారాయణపురలోకి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. నారాయణపుర జలాశయం నుంచి జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 1,05,822 క్యూసెక్కుల వరద నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి 826.90 అడుగులకు చేరింది.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.