ETV Bharat / city

Agnipath: ఆ చట్టం కింద కేసు నమోదైతే.. ఆర్మీలో ఉద్యోగం ఇక కల్ల..!

author img

By

Published : Jun 18, 2022, 11:03 AM IST

Agnipath
Agnipath

Agnipath News: ఎంతో కఠినతరంగా ఉండే శిక్షణ, హుందాతనం, దేశభక్తి, ఎలాంటి రాజకీయాలకు తావులేని ఆర్మీ ఉద్యోగం కోసం ఏళ్ళ తరబడి యువకులు ప్రయత్నిస్తుంటారు. సికింద్రాబాద్‌లో ఆందోళనకు కారణమైన వాళ్ళంతా ఆ సైనిక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావారే. సగం ప్రక్రియను పూర్తిచేసిన వారంతా... అగ్నిపథ్‌ తెచ్చారనే అవేదన, ఆవేశంలో చేసిన ఆందోళన వారి జీవితాన్ని ప్రశ్నార్ధకంలో పడేలాచేసింది. భవిష్యత్‌లో ఇలాంటి ఉద్యోగాలకు అనర్హులుగా చేసే ప్రమాదంలోకి నెట్టింది.

Agnipath News: అన్యాయంచేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రఆగ్రహంతో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న కొందరు అభ్యర్థులు... భారీమూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అగ్నిపథ్‌ ప్రవేశంతో గతంలో రాసిన పరీక్షలు రద్దయ్యాయనే ఆక్రోశంతో.. విధ్వంస రచనకు పూనుకున్న వారిపై రైల్వేపోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాడిలో పాల్గొన్నారంటూ పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీసులు.. నిందితుల జాబితాను రూపొందిస్తున్నారు. అయితే వారిపై మాత్రం 14 సెక్షన్లను ప్రయోగించారు.

ఐపీసీలోని 143 సెక్షన్ ప్రకారం చట్టవ్యతిరేకంగా గుమిగూడటం, 147 సెక్షన్‌ ప్రకారం అల్లర్లకు పాల్పడటం, 324 నిబంధన ప్రకారం మారణాయుధాలతో దాడి కింద కేసు నమోదు చేశారు. 307సెక్షన్‌ ప్రకారం హత్యాయత్నం... 435 ప్రకారం పేలుడు పదార్థాలతో ఆస్తిని నష్టపరచడం, 427నిబంధన ప్రకారం ఆస్తలకు నష్టం కలిగించడం, 448 సెక్షన్‌ ప్రకారం... అనుమతి లేకుండా చొరబడటం కింద కేసు నమోదు చేశారు. 336 నిబంధన ప్రకారం ఇతరుల ప్రాణానికి హానికలిగించే చర్యకు పాల్పడటం, 332ప్రకారం విధినిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని గాయపరచడం కింద అభియోగం మోపారు. 341 రెడ్‌విత్ సహా 149 నిబంధన కింద సంయమనం కోల్పోవడం సెక్షన్లతోపాటు.. భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 150 ప్రకారం హానికరంగా రైలును ధ్వంసం చేయడం, 151 ప్రకారం రైల్వే ఆస్తుల నష్టం, 152 ప్రకారం రైల్వే ప్రయాణికులను గాయపరచడం, సెక్షన్ 3 ప్రకారం.. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం సెక్షన్లు ప్రయోగించారు.

రైల్వే పోలీసులు పెట్టిన.. ఐపీసీ సెక్షన్ల కంటే ఐఆర్​ఏ సెక్షన్లు చాలా కఠినంగా ఉంటాయి. అవి చాలావరకు నాన్‌బెయిలబుల్ సెక్షన్లే. అరెస్టయిన వెంటనే తప్పనిసరిగా జైలుకెళ్లాల్సి ఉంటుంది. సాధారణంగా బెయిల్ దొరకదు. ఐఆర్ఏ 150 సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్షకు గురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రైల్​రోకోలకు పాల్పడిన కేసుల్లో... పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికీ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తునిలో రైలుదహనం కేసులోనూ అదే పరిస్థితి. సాధారణంగా అల్లర్లకు సంబంధించి ఐపీసీ సెక్షన్ల కింద రాష్ట్ర పోలీసులు.. నమోదు చేసే కేసులను ఎత్తేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన... చాలా కేసులను ఆ విధంగానే ఎత్తేశారు. కానీ భారతీయ రైల్వే చట్టం కింద నమోదైన కేసులను ఉపసంహరించే అవకాశం లేదు. ఆ కేసుల్లో చిక్కుకుంటే ఆర్మీలాంటి కీలక ఉద్యోగాలు చేసేందుకు అనర్హులుగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు ఇబ్బందులు తప్పవు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.