ETV Bharat / city

power cuts in AP : అప్రకటిత విద్యుత్ కోతలు.. ఆందోళనలో అన్నదాతలు

author img

By

Published : Apr 1, 2022, 8:47 AM IST

power cuts in AP
power cuts in AP

power cuts in AP : ఓ వైపు భానుడి భగభగలు.. మరోవైపు అప్రకటిత విద్యుత్‌ కోతలు.. వెరసి వేసవి తొలినాళ్లలోనే ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పేరుకు తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా అని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా... గంటల కొద్దీ కోతలు విధిస్తున్నారు. నీరందక పంటలు ఎండిపోవడంతో రైతుకు గుండెకోతే మిగులుతుంది.

అప్రకటిత విద్యుత్ కోతలు.. ఆందోళనలో అన్నదాతలు

power cuts in AP : వేళాపాళా లేని విద్యుత్ కోతల కారణంగా ఉక్కపోతతో జనం అల్లాడుతుంటే.. నీరందక పంటలు ఎండిపోతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి కరెంట్ కోతలు అధికంగా ఉన్నా... డిమాండ్‌కు తగ్గట్టు ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా చేయడం లేదు. విద్యుత్ కోతలను వ్యతిరేకిస్తూ... అనేక చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట మండలాల్లో విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతులు నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా నలగాంపల్లి విద్యుత్తు ఉప కేంద్రం వద్ద అన్నదాతలు ధర్నా చేశారు. తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్తు హామీ ఏమైందని నిలదీశారు.

ముప్పుతిప్పలు : ఏపీ వ్యాప్తంగా కరెంటు కోతలు రైతన్నలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ప్రస్తుతం పత్తి ధర క్వింటాల్‌కు 12వేలకు పైగా ఉంది. ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో రైతులు... వేల రూపాయలు పెట్టుబడి పెట్టి.... బోర్ల కింద పత్తి సాగుకు ఉపక్రమించారు. బోర్లలో నీళ్లు ఉన్నా.. విద్యుత్ కోతల కారణంగా రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఒక తడి నీరిచ్చారు. రెండో తడి నీరు పెట్టే సమయంలో కరెంట్ కోతలు మొదలయ్యాయి. మొలక వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కర్షకుల ఆగ్రహం : ప్రకాశం జిల్లా గిద్దలూరు, కనిగిరిలో వరి, మొక్కజొన్న, చెరకు, మిర్చి, గోరుచిక్కుళ్లు, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, ఆకుకూరల సాగు చేస్తున్నారు. ఎండాకాలం కావడంతో.. నీరు ఇవ్వడంలో ఒకట్రెండు రోజులు ఆలస్యమైనా దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతోంది. విద్యుత్తు కోతల వల్ల నీరు తడులు అందడం లేదు. విద్యుత్‌ వచ్చిందని మోటారు వేయగానే.. 10 మీటర్ల వరకూ నీరు పారుతుంది. ఇంతలోనే మళ్లీ సరఫరా నిలిచిపోతోంది. రోజులో 40 నిమిషాలైనా విద్యుత్తు సరఫరా చేయడం లేదని కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్ పేరుతో : ఉక్కబోత పెరిగిన తరుణంలో విద్యుత్ కోతలు ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరెంటు కోతలతోపాటు విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్ పేరుతో గంటల కొద్దీ విద్యుత్ నిలిపివేయడంపై మండిపడుతున్నారు.విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ప్రకాశం జిల్లా కనిగిరిలో లాంతర్లను ప్రదర్శిస్తూ తెలుగుదేశం నిరసన తెలిపింది.

పద్మ

ఒక్క కోతా కాలేదు..ఎండిపోతోంది : '30 సెంట్లలో బీర, బెండ నాటాం.. రూ.30వేలకు పైగా ఖర్చయింది. ఒక్క కోతా కాలేదు. కరెంటు లేక నీరు అందడం లేదు. ఎండిపోతోంది.' -పద్మ, హంసా పురం, కుప్పం మండలం, చిత్తూరు జిల్లా

గంటే ఇస్తున్నారు : 'ఆరెకరాల్లో వరి, మొక్కజొన్న, జామ ఉన్నాయి. రోజుకు గంటే విద్యుత్తు ఇస్తున్నారు. పొలం ఎండిపోయే పరిస్థితికి వచ్చింది.'-దేవేంద్ర, నలగాంపల్లె, గుడుపల్లె మండలం, చిత్తూరు జిల్లా

మూడు రోజుల నుంచి ఇబ్బందే : 'మూడు రోజులుగా విద్యుత్తు సరఫరా సరిగా ఉండటం లేదు. అయిదెకరాల్లో వేసిన చెరకుకు సమయానికి నీరివ్వలేకపోతున్నాం. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు కోత పెడతారో సమాచారం ఇవ్వడం లేదు.'- బైరి గోవిందరావు, కొల్లివలస, పొలాకి మండలం, శ్రీకాకుళం జిల్లా

నీరు లేకపోతే అరటి పోయినట్లే : 'నాలుగు రోజులుగా విద్యుత్తు రోజుకు రెండు గంటలకు మించి ఇవ్వడం లేదు. దీంతో తోటలు దెబ్బతింటున్నాయి. అధికారుల్ని అడిగితే రెండు గంటలే ఇవ్వమంటున్నారని చెబుతున్నారు. అరటితోట సూటి దశలో ఉన్నప్పుడు నీరు సమృద్ధిగా ఉండాలి. లేదంటే మొగ్గ రానీయదు. చెట్లు విరిగిపడతాయి. నాలుగెకరాలకు రూ.2లక్షల పెట్టుబడి నష్టపోవాల్సి వస్తుంది.' -ఎన్‌.చిన్నకొండయ్య, సోమవారపేట, బేస్తవారపేట మండలం, ప్రకాశం జిల్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.