ETV Bharat / city

CM KCR Delhi tour : రేపు దిల్లీకి సీఎం కేసీఆర్​

author img

By

Published : Nov 20, 2021, 7:59 PM IST

Updated : Nov 20, 2021, 9:15 PM IST

kcr
kcr

19:57 November 20

రేపు దిల్లీకి సీఎం కేసీఆర్​

వరిధాన్యం కొనుగోలు గురించి కేంద్రాన్ని ఎన్నోసార్లు అడిగినట్లు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. యాసంగి పంట కొనుగోలుపై కేంద్రం నాన్చివేత ధోరణి వహిస్తోందని మండిపడ్డారు. స్పష్టమైన ప్రకటన కోసం రేపు దిల్లీ వెళ్లి తేల్చుకుంటామని స్పష్టం చేశారు. సీఎస్‌తో కలిసి అంతా దిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, ఎఫ్‌సీఐని కలవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఏడాదిలో ఎంత కొంటారో కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం.. మాట్లాడతామని కేంద్రం చెప్పిందన్నారు. ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

మా నీటి వాటా ఎంతో తేల్చండి!

'రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా...  కేంద్రం ఇంకా నీటి వాటాలు తేల్చలేదు. తెలంగాణ నీటి వాటా ఎంతో స్పష్టం చేయాలి. ఈ విషయంలో కేంద్రం చేస్తున్న తాత్సారం తెలంగాణ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. దీనిపై దిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని, కేంద్ర జలశక్తిశాఖ మంత్రిని కలిసి నీటి వాటా తేల్చాలని కోరతాం. కృష్ణా, గోదావరిలో నీటి వాటాలను తేల్చేందుకు వెంటనే  ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసి నిర్దేశిత సమయంలో తేల్చాలి. కోర్టులో కేసు కూడా ఉపసంహరించుకున్నాం. లేనిపక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. మా సహనాన్ని పరీక్షించొద్దు.. తెలంగాణ ఉద్యమాల గడ్డ. నీటి వాటా తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ, ఆ బాధ్యతను  విస్మరించింది. దయచేసి వెంటనే తేల్చాలి.'  

-కేసీఆర్‌, సీఎం

ఏ కులంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో...

బీసీ కులగణన చేపట్టాలని బీసీలు అడుగుతున్నారని సీఎం అన్నారు.  అది న్యాయమైన డిమాండ్​ అని పేర్కొన్నారు. కుల గణన చేయమని కేంద్రం ఎందుకు చెప్పాలని...  ఏ కులంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో  తేల్చలేని పరిస్థితి దేశంలో ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీల రిజర్వేషన్‌ పెంపును కూడా తేల్చకుండా తొక్కిపెట్టారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి పంపితే దానిపైనా కేంద్రం నుంచి స్పందన లేదని అన్నారు.  

వానా కాలం పంటలో ప్రతిగింజా కొనుగోలు చేస్తాం

'రైతుల అనురాధ కార్తి నిన్న వచ్చేసింది.. ఇంకా తాత్సారం చేయొద్దు. ఏడాదిలో తెలంగాణ ధాన్యం ఎంత తీసుకుంటారో స్పష్టం చేయాలి. స్థానిక భాజపా నాయకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా .. మీరు చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఇంకా అడ్డగోలుగా మాట్లాడతామంటే కుదరదు. వానాకాలం పంటలో చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. 6600 కేంద్రాలు ప్రారంభించాం. ఎవరూ ఆందోళన చెందవద్దు. భాజపా నాయకులు చేసే చిల్లర ప్రచారాన్ని రైతులు నమ్మొద్దు. యాసంగికి రైతుబంధు కూడా సకాలంలో ఇస్తాం. రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకోవాలి.యాసంగి పంటల గురించి దిల్లీ వెళ్లి వచ్చాక చెప్తాం,'  

- కేసీఆర్‌, సీఎం 

ఇదీ చదవండి : సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం... వారికి రూ.3 లక్షల ఆర్థికసాయం

Last Updated :Nov 20, 2021, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.