ETV Bharat / city

సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి: చంద్రబాబు

author img

By

Published : Jul 1, 2022, 8:54 PM IST

సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి: చంద్రబాబు
సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి: చంద్రబాబు

Chandrababu fires on CID activities in AP: ఏపీలో సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టును సైతం లెక్కచేయని విధంగా సీఐడీ అధికారులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని అక్రమ కేసులు పెడుతూ తెదేపా కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి అర్ధరాత్రి తలుపులు తడితే కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Chandrababu fires on CID: ఆంధ్రప్రదేశ్​లో పోలీసుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సీఐడీ వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయని మండిపడ్డారు. పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా? అని ప్రశ్నించిన చంద్రబాబు.. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని అక్రమ కేసులు పెడుతూ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహంచారు. ఎంపీ రఘురామరాజు వ్యవహారంలో కస్టోడీయల్ హత్యకు కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై కస్టోడియల్ టార్చర్​కు పాల్పడుతున్నారని విమర్శించారు.

తమ పోరాటం పోలీసులపై కాదని.. వైకాపా పైనే అని చంద్రబాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు వెంకటేశ్‌, సాంబశివరావు విషయంలో వ్యవహరించిన తీరు అమానుషమని ధ్వజమెత్తారు. తప్పుడు అధికారులను వదిలిపెట్టనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ పెద్దలు చెప్పింది చేస్తూ.. బలిపశువులు కావొద్దని సూచించారు. మళ్లీ అధికారంలోకి రాబోయే పార్టీ తెలుగుదేశమే అన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పోలీసులు వచ్చి అర్ధరాత్రి తలుపులు తడితే కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దని.. వెంటనే సమాచారం ఇస్తే న్యాయవాదుల్ని అప్రమత్తం చేస్తామని భరోసా ఇచ్చారు.

పోలీసులకు మానవత్వమే లేదా?: '41ఏ నోటీసు కింద అరెస్టు చేస్తే పాటించాల్సిన నిబంధనలన్నీ పోలీసులు ఉల్లంఘించారు. చట్టాన్ని ఉల్లింఘించే అధికారులకు ఖాకీ బట్టలు వేసుకునే హక్కు లేదు. పోస్టు పెట్టడమే నెరమైతే నారాసుర రక్త చరిత్ర కథనం రాసిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారు. అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి వెళ్లి.. బిడ్డకు పాలిస్తున్న తల్లిని కూడా పట్టించుకోకుండా అరెస్టులు చేస్తారా?. పోలీసులకు మానవత్వమే లేదా' అని చంద్రబాబు నిలదీశారు.

ఆ అధికారులు తప్పించుకోలేరు: పోలీసులు వచ్చి అర్ధరాత్రి తలుపులు తడితే కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దని.. వెంటనే పార్టీకి సమాచారం ఇస్తే న్యాయవాదుల్ని అప్రమత్తం చేస్తామని చంద్రబాబు తెలిపారు. న్యాయవాదుల సమక్షంలోనే నోటీసులు తీసుకొని చట్టపరంగా పోరాడుదామన్నారు. కొందరు పోలీసులు చేసే ఏ ఒక్క అరచకాన్నీ మర్చిపోమని.. అన్నీ గుర్తుపెట్టుకుంటామన్నారు. తప్పు చేసిన అధికారులు శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. 'రేపు అనేది ఒకటుందని తప్పు చేసే పోలీసులు గుర్తుంచుకోవాలి. తమాషాగా తీసుకోవద్దని హెచ్చరించారు. అర్ధరాత్రి ఇళ్లకు యూనిఫామ్ లేకుండా వస్తే పోలీసులనుకోవాలా ? వైకాపా గూండాలనుకోవాలా ?' అని చంద్రబాబు నిలదీశారు.

సోషల్‌ మీడియాలో 600మందిపై కేసులు పెట్టారు. 41ఏ నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేస్తున్నారు. కొందరు అధికారుల ద్వారా తప్పుడు కేసులు పెడుతున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదు. అవసరమైతే పోలీస్‌ స్టేషన్‌కు నేను వెళ్తా. నా రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త పరిపాలన చూడలేదు. పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా? సాంబశివరావు, వెంకటేశ్‌ ఇళ్లకు వెళ్లి బెదిరిస్తారా? 41ఏ నోటీసు ఇవ్వాలంటే అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లాలా? ఇంటి గోడలు దూకి వెళ్లాలా.. లైట్లు పగలగొడతరా? ఇలాంటి కేసులను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి. సుప్రీంకోర్టును సైతం లెక్క చేయని విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆయా అధికారులను చట్టం ముందు దోషులుగా నిలబెడతాం. ఇలాంటి పాలనలో బలిపశువులు కావొద్దని పోలీసులను కోరుతున్నా. - చంద్రబాబు, తెదేపా అధినేత

అది తన బాధ్యత: జగన్ తల్లి విజయలక్ష్మి కోపంగా ఉన్న మాట వాస్తవం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. చెల్లి షర్మిళ మాట వినడం లేదని వైకాపానే చెప్పిందని గుర్తుచేశారు. ఏమైనా చెప్పాలనుకుంటే సమాధానం చెప్పాలి కానీ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం చేస్తారా అని ధ్వజమెత్తారు. ఒక్కరిని కొడితే పది మంది తిరిగి కొడతారు.. జాగ్రత్త అని హెచ్చరించారు. రక్షణ కల్పించాలని కోరుతూ తెదేపా నేత అయ్యన్న కోర్టుకెళ్లారని.. ప్రధాని కార్యక్రమంలో పాల్గొనేందుకు రక్షణ కల్పించాలని ఎంపీ రఘు రామకృష్ణంరాజు కోర్టుని ఆశ్రయించారని తెలిపారు. వైకాపా నేతలు ఇక్కడే ఉంటారుగా..? మీ మీ ప్రాంతాల్లో తిరగాలిగా..? అప్పుడు చూద్దామని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తమదేని స్పష్టం చేశారు. కార్యకర్తలనే కాదు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కర్ని మాకు చేతనైనంత వరకు ఆదుకుంటామని తేల్చిచెప్పారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నారాయణ తమ పార్టీ కాకపోయినా ఆ కుటుంబానికి తాము అండగా నిలిచామని గుర్తుచేశారు.

ఇవీ చదవండి:

మోదీ హైదరాబాద్​ పర్యటన.. 'మినిట్​ టూ మినిట్​' షెడ్యూల్​ ఇదే..!

TTD: ఈ ఏడాది అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఈవో ధర్మారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.