ETV Bharat / city

నిన్న హుజూరాబాద్​, నేడు మునుగోడు, రేపు తెలంగాణ నినాదంతో ప్రచారబరిలోకి భాజపా

author img

By

Published : Oct 4, 2022, 10:55 AM IST

BJP focus on munugodu election
మునుగోడు ఎన్నికపై భాజపా దృష్టి

BJP Focus on Munugode ByPoll: మునుగోడు షెడ్యూల్ ప్రకటించడంతో భాజపా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్న కమలనాథులు.. మరింత జోరు పెంచే పనిలోపడ్డారు. తెరాస వైఫల్యాలే అజెండాగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రులతో పాటు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మునుగోడుకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.

మునుగోడు ఎన్నికపై భాజపా ఫోకస్​

BJP Focus on Munugode ByPoll: తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భాజపా.. మునుగోడు ఉపఎన్నికను ఓ అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఈ ఎన్నికలో గెలుపు ద్వారా రానున్న అసెంబ్లీ పోరుకు ఆత్వవిశ్వాసంతో వెళ్లాలని భావిస్తోంది. మొన్న దుబ్బాక.. నిన్న హుజూరాబాద్.. నేడు మునుగోడు.. రేపు తెలంగాణ.. అనే నినాదంతో ముందుకెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.

బూత్​ స్థాయిలో పార్టీ బలోపేతం.. మునుగోడులో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన కాషాయదళం.. అధికార పార్టీ కంటే ముందే స్టీరింగ్ కమిటీని ప్రకటించింది. బూత్‌ ఇన్‌ఛార్జీల జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో 298 బూత్‌లు ఉండగా.. ఒక్కో దానికి ముగ్గురితో ప్రత్యేక కమిటీని వేయనుంది. ఇందులో ఒకరిని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతను, మరొకరిని రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉన్న నాయకుడిని పెట్టాలని నిర్ణయించింది. మూడో వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముఖ్య అనుచరుల్లో ఒకరిని పెట్టాలని నిర్ణయించింది.

ఎవరికి కేటాయించిన బూత్ బాధ్యతలు వారే నిర్వర్తించాలనే షరతును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పెట్టారు. గందరగోళ పరిస్థితులు లేకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పని విభజన లేకుండా ఇష్టమొచ్చినట్లుగా నేతలు పర్యటనలు కొనసాగించినా వృథా అని, పార్టీకి నష్టం రాకుండా ఉండాలనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయి నేతలు అన్ని మండలాల్లో ప్రచారం చేపట్టినా వారికి కేటాయించిన బూత్‌పై పూర్తి నివేదిక ఇచ్చేలా ఉండాలని అధిష్ఠానం ఆదేశించింది.

జాతీయస్థాయి నాయకులతో ప్రచారం.. మునుగోడులోని ప్రతి మండలంలో ఒక్క జాతీయ స్థాయి నేతను కానీ, భాజపా పాలిత ముఖ్యమంత్రులతో ప్రచారం చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 6న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు కేంద్ర కార్మిక శాఖమంత్రి భూపేంద్ర యాదవ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. వారు వచ్చేది అలయ్-బలయ్ కార్యక్రమానికి అని చెబుతున్నా.. కచ్చితంగా మునుగోడుపై మాట్లాడుతారని నేతలు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.