AP Employees Steering Committee: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు రెండు పీఆర్సీలను కోల్పోయారని పీఆర్సీ సాధన సమితి నేతలు తెలిపారు. వేతన సవరణ తేదీకి.. అమలు తేదీకి ప్రభుత్వాల వ్యత్యాసం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పుగా సీఎస్ లాంటి ఉన్నతాధికారి మాట్లాడటం వితండవాదమని వ్యాఖ్యానించారు. సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని నేతలు స్పష్టం చేశారు.
రాజకీయ ప్రసంగాలు చేస్తూ సమస్యను ప్రభుత్వం జఠిలం చేస్తుందని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాలు ఉద్యోగులకు అక్కర్లేదని.. సమస్యల పరిష్కారమే కావడమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
"వాస్తవాలు బయటపెట్టకుండా ఉద్యోగులను కించపరుస్తున్నారు. చర్చల పేరిట ఉద్యోగులను అవమానపరుస్తున్నారు. బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమా..? చర్చలకు పిలిచి చాయ్, బిస్కెట్ ఇచ్చి పంపుతున్నారు. సమ్మెలోకి వెళ్తే జీతాలు మిగుల్చుకుందామని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మొన్న చర్చలకు వెళితే అరగంటలో మాట్లాడి చెబుతామన్నారు. ఆరు గంటలైనా సమస్య పరిష్కారం చేయలేదు. సజ్జలకు ఫోన్ చేస్తే.. అయ్యో! మీరింకా అక్కడే ఉన్నారా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రసంగాలు చేస్తూ సమస్యను జఠిలం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. రాజకీయ అవసరాలు ఉద్యోగులకు అక్కర్లేదు.. సమస్యల పరిష్కారమే తమకు కావాలన్నారు. ప్రభుత్వానికి అన్ని రకాలుగా చెప్పి చూశాకే సమ్మెకు వెళ్తున్నాం. ఉద్యోగులు చర్చలకు ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నారు" - బొప్పరాజు వెంకటేశ్వర్లు
పీఆర్సీకి డీఏకి ఏదన్నా సంబంధం ఉందా: వెంకట్రామిరెడ్డి
మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పుగా సీఎస్‌లాంటి ఉన్నతాధికారి మాట్లాడటం వితండవాదమని మరో నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీకి డీఏకి ఏదన్నా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగికి కేంద్రం ఆదేశాల మేరకు చెల్లింపు ఉంటుందన్నారు. సీఎం చుట్టూ ఉన్న సలహాదారులకు లెక్కలు తెలీదని, ఉద్యోగులకు మాత్రమే వారి వేతన వివరాలు తెలుస్తాయని చెప్పారు.
"ఐఆర్ అనేది వడ్డీలేని రుణమని సీఎస్ చెప్పడం బాధాకరం. పీఆర్సీ సమయానికి అమలు కాకపోతే మధ్యంతర భృతి ఇస్తారు. ఉద్యోగులకు జీతంలో భాగంగా ఇచ్చేది అప్పుగా భావిస్తారా? ఉద్యోగుల ఆందోళనను ప్రభుత్వం గుర్తించట్లేదు. పీఆర్సీకి డీఏకు సంబంధం ఉందా అనేది చెప్పాలి. కొత్త పీఆర్సీ ప్రకారం డీఏ అమలు చేయాల్సి ఉంటుంది. పాత స్కేల్ ప్రకారం డీఏ ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదా? డీఏలతో సంబంధం లేకుండా పీఆర్సీని పరిగణనలోకి తీసుకోవాలి" - వెంకట్రామిరెడ్డి
చలో విజయవాడలో వారు పాల్గొనలేదు..
'చలో విజయవాడ' కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, ఇతర రాజకీయ పార్టీల వ్యక్తులు ఎవ్వరూ పాల్గొనలేదని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు రాసి విలువలు పొగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల మేలు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు ఎవ్వరూ మద్ధతు ఇచ్చినా మంచిదేనని చెప్పారు. ఉద్యోగులు స్వచ్చందంగా తరలిరావడంతో చలో విజయవాడ విజయవంతం అయ్యిందన్నారు. విజయవాడ చరిత్రలో ఇటువంటి ఉద్యమం ఎప్పుడు చూడలేదన్నారు. కొందరు వ్యక్తులు ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావన తెచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్య ఏంటో గుర్తింస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: