ETV Bharat / business

ఆర్థిక మాంద్యానికి దగ్గర్లో ప్రపంచం.. వరల్డ్ బ్యాంక్​ అధ్యక్షుడి హెచ్చరిక

author img

By

Published : Oct 14, 2022, 4:43 PM IST

world bank president
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు

ప్రపంచం ఆర్థిక మాంద్యానికి దగ్గరగా ఉందని.. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్‌ హెచ్చరించారు. పేదలపై అధికంగా ప్రభావం ఉంటుందని.. వారిని ఆదుకోవాలని కోరారు. 2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటును 3 శాతం నుంచి 1.9 శాతానికి కుదించిన విషయాన్ని గుర్తుచేశారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి అత్యంత దగ్గరగా ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్‌ గురువారం హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పేదలను లక్ష్యంగా చేసుకొని వారికి మద్దతునందించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటును 3 శాతం నుంచి 1.9 శాతానికి కుదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వాషింగ్టన్‌లో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక సదస్సు సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, పెట్టుబడుల కోత.. వంటి సమస్యలు పేదవర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని మల్‌పాస్‌ అన్నారు. ఇది ప్రపంచ బ్యాంక్‌ ఎందుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ అని తెలిపారు. దీని పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో దేశంలో ఒక్కో తరహా సమస్య ఉందని.. వాటికి అనుగుణంగా పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు వడ్డీరేట్లను పెంచడం ప్రారంభించినట్లు తెలిపారు. వీటిలో కొన్ని మరిన్ని పెంపులు చేపట్టలేని స్థితికి చేరాయన్నారు.

మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలను కలవరపెడుతున్న మరో సమస్య రుణభారం అని మల్‌పాస్‌ తెలిపారు. భారీ ఎత్తున రుణం తీసుకోవడమే పెద్ద సమస్య అయితే.. దానిపై అధిక వడ్డీలు పరిస్థితిని మరింత జటిలం చేశాయన్నారు. ఆయా దేశాల కరెన్సీలు బలహీనంగా మారడం మరో పెద్ద సవాల్‌గా పరిణమించిందన్నారు. దీంతో అప్పులభారం మరింత తీవ్రమైందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐదో రుణ సంక్షోభాన్ని చూస్తున్నామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.