ETV Bharat / business

ఏంటీ కొత్త పన్ను విధానం? ఎవరికి వర్తిస్తుంది? ఎంత కట్టాలి?

author img

By

Published : Feb 1, 2023, 2:37 PM IST

Updated : Feb 1, 2023, 4:10 PM IST

NEW TAX REGIME EXPLANATION
NEW TAX REGIME EXPLANATION

ఉద్యోగులకు ఊరటనిస్తూ పన్ను శ్లాబుల్లో మార్పులు చేసింది కేంద్రం. కొత్త పన్ను విధానం ప్రకారం ఎవరు ఎంత పన్ను చెల్లించాలి? ఏం ప్రయోజనాలు లభిస్తాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు మీకోసం..

లక్షలాది మంది మధ్యతరగతి ఉద్యోగులకు ప్రయోజనం కల్పించేలా పన్ను శ్లాబుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​లో కీలక ప్రకటన చేసింది. వార్షిక ఆదాయం రూ.7లక్షలు వరకు ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, శ్లాబుల్లో మాత్రం రూ.3లక్షల వరకు సున్నా శాతం పన్ను అని పేర్కొంది. దీన్ని చూసి చాలా మందికి ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు వస్తున్నాయి. అసలు ఈ పన్ను మినహాయింపులు ఎవరికి వర్తిస్తాయి? ఎంత ఆదాయం ఉన్నవారు ఎంత పన్ను చెల్లించాలి? వంటివి వివరంగా చూద్దాం.

కొత్త శ్లాబులు ఇలా..
గతంలో రూ.2.50లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను పరిధి నుంచి మినహాయింపు ఉండేది. ఇప్పుడు అది రూ.3లక్షలకు పెరిగింది. అంటే ఏడాదికి మూడు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన శ్లాబుల వివరాలు ఇలా ఉన్నాయి.

UNION BUDGET 2023
కొత్త పన్ను శ్లాబులు

మరి రూ.7లక్షల మాటేంటి?
కొత్త పన్ను విధానం ప్రకారం రూ.3 లక్షల నుంచి రూ.6లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 5శాతం పన్ను పరిధిలోకి వస్తారు. రూ.6లక్షలు- రూ.9లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం రిబేట్ ఇస్తుంటుంది. ఇదివరకు రూ.5లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రిబేట్ ఉండగా.. ప్రస్తుతం ఆ పరిమితిని రూ.7లక్షల వరకు పెంచింది. అంటే.. రూ.7లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను మినహాయింపులు ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎవరు ఎంత కట్టాలి?

  • పైన చెప్పినట్లు ఏడాదికి రూ.7లక్షల వరకు సంపాదించేవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
  • రూ.9లక్షల వార్షిక వేతనం పొందుతున్న వ్యక్తులు ప్రస్తుతం సుమారు రూ.60వేలు పన్ను చెల్లిస్తున్నారు. ఇకపై వీరు చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు మాత్రమే. ఫలితంగా రూ.15వేల మేర ప్రయోజనం కలగనుంది.
  • రూ.15 లక్షల వార్షిక వేతనం పొందే వ్యక్తులు ఇదివరకు రూ.1.87 లక్షలు చెల్లిస్తుండగా.. ఇప్పుడు అది రూ.1.5 లక్షలకు తగ్గనుంది. వీరు రూ.37వేలు పన్ను ఆదా చేసుకోవచ్చు.
  • కొత్త పన్ను విధానం కింద ప్రతి పన్ను చెల్లింపుదారుడు రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దీని వల్ల రూ.15.5లక్షలు, ఆపైన ఆదాయం ఉన్న వేతన ఉద్యోగులు రూ.52,500 మేర పన్ను ప్రయోజం పొందనున్నారు.
  • అయితే, పన్ను చెల్లింపుదారులు ఇన్వెస్ట్​మెంట్లపై ఎలాంటి డిడక్షన్లు, మినహాయింపులు పొందలేరని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

ఇకపై, ఆదాయపు పన్ను వెబ్​సైట్​లో కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఆప్షన్​గా కనిపిస్తుంది. చెల్లింపుదారులు పాత విధానాన్ని సైతం ఎంపిక చేసుకోవచ్చు. కొత్త విధానం ఎంపిక చేసుకున్నవారికే పైన పేర్కొన్న మినహాయింపులు లభిస్తాయి.

ప్రస్తుతం ఇలా..
ప్రస్తుతం రూ.2.5లక్షలు- రూ.5లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 5శాతం పన్ను విధిస్తున్నారు. రూ.5-రూ.7లక్షల మధ్య 10 శాతం, రూ.7.5 నుంచి రూ.10 లక్షల మధ్య 15 శాతం రూ.10 నుంచి రూ.12.5 మధ్య 20 శాతం, రూ.12.5 నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం, రూ.15లక్షలపైన ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్​లో ఐచ్ఛిక పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. మినహాయింపులు వదులుకుంటే తక్కువ రేటుకు పన్ను మదింపు చేసేలా నిబంధనలు తీసుకొచ్చింది. అయితే, ఈ విధానానికి చెల్లింపుదారులు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. మినహాయింపులు వదులుకున్నప్పటికీ.. పన్ను అధికంగానే కట్టాల్సి వచ్చింది.

Last Updated :Feb 1, 2023, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.