ETV Bharat / business

బడ్జెట్​పై రియల్​ ఎస్టేట్​ రంగం భారీ ఆశలు.. సీతమ్మ ఏం చేసేనో?

author img

By

Published : Jan 31, 2023, 4:11 PM IST

real estate sector expectations on budget 2023
real estate sector expectations on budget 2023

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న.. నూతన బడ్జెట్‌పై స్థిరాస్తి రంగం ఎన్నో ఆశలు పెట్టుకుంది. జోరు కొనసాగించేందుకు మరిన్ని ప్రోత్సాహకాలను ఇచ్చి వెన్నుదన్నుగా నిలవాలని.. కోరుతోంది. గృహరుణాలపై వడ్డీ భారాన్ని తగ్గిస్తే కొనుగోలు శక్తి మరింత పెరుగుతుందని.. స్థిరాస్తి రంగ నిపుణులు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రుణ అర్హతల్లో మార్పులు సహా గృహరుణాల వడ్డీపై.. ఆదాయపు పన్ను మినహాయింపును పెంచాలని స్థిరాస్తి రంగం విజ్ఞప్తి చేస్తోంది.

దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేసే రంగాల్లో ఒకటైన స్థిరాస్తి రంగం నూతన బడ్జెట్‌పై భారీగానే ఆశలు పెట్టుకుంది. కరోనా భయాలు తొలగడం వల్ల.. 2022లో ఇళ్ల విక్రయాలు 50 శాతం పుంజుకున్నాయి. ఆ జోరును కొనసాగించేందుకు కేంద్రం ఊతమివ్వాలని.. స్థిరాస్తి రంగం కోరుతోంది. ద్రవ్యోల్బణాన్ని చల్లార్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు పెంచుతున్న వడ్డీ రేట్లు గృహరుణం తీసుకున్నవారికి.. భారంగా మారాయి. నెలవారీ చెల్లింపులపై వడ్డీ పెరిగి ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడింది. వడ్డీరేట్ల పెరుగుదలతో రుణం తీసుకొని కొత్త ఇల్లు కొనాలని భావిస్తున్నవారు.. ప్రస్తుతం తమ ఆలోచనలను వాయిదా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రుణ అర్హతల్లో కొన్నిసడలింపులు చేయాలని.. నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు ప్రస్తుతం మార్కెట్‌ విలువపై.. 80 శాతం వరకు రుణాన్ని ఇస్తున్నాయి. ఈ మొత్తాన్ని పెంచాలని స్థిరాస్థి రంగం కోరుతోంది.

ప్రస్తుతం ఇళ్లు కొంటున్నవారు గృహరుణంపై చెల్లించే వడ్డీలో.. 2 లక్షలపై పన్ను మినహాయింపు పొందుతున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 24B కింద.. ఈ వెసులుబాటు లభిస్తోంది. 2016-17 నుంచి ఈ పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. ఈ సారి ఈ పరిమితిని 5 లక్షలకు పెంచాలనే.. డిమాండ్‌ వినిపిస్తోంది. వడ్డీతో పాటు గృహరుణం అసలుపైనా సెక్షన్‌ 80సీ కింద 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. సెక్షన్‌ 80సీ ఇతర పెట్టుబడులకు కూడా వర్తిస్తుంది. గృహరుణ అసలు మొత్తంతో పాటు వాటిని కూడా కలిపి 1.5లక్షలపై వరకు.. మినహాయింపు ఉంటుంది. 80సీ మినహాయింపును ఇతర పెట్టుబడులను నుంచి వేరుచేసి.. గృహరుణం అసలుపై ప్రత్యేక మినహాయింపునివ్వాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

ప్రస్తుతం 45 లక్షలు అంతకంటే తక్కువ విలువ చేసే ఇళ్లను.. అందుబాటు ధరలో ఇళ్ల కేటగిరీ కింద పరిగణిస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా.. కొన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న ధరలను పరిగణనలోకి తీసుకొని.. 45 లక్షల పరిమితిని 75 లక్షల వరకు పెంచాలని.. స్థిరాస్తి వర్గాలు కోరుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇంటిని అమ్మగా వచ్చిన దీర్ఘకాల మూలధన లాభాలను ఆదాయ పన్నుచట్టంలోని సెక్షన్‌ 54 ప్రకారం కొత్త ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణానికి.. వినియోగించొచ్చు. ఆ డబ్బుతో నిర్మాణంలో ఉన్న ఇంటిని కూడా కొనొచ్చు.ఐతే దాని నిర్మాణం మూడేళ్లలోపు పూర్తైతేనే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. వివిధ కారణాల వల్ల.. ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం జరుగుతున్నందున.. ఈ గడువును ఐదేళ్లకు పొడిగించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.

ఇళ్ల నిర్మాణానికి వాడే స్టీల్‌పై 18 శాతం, సిమెంట్‌పై 28 శాతం.. జీఎస్‌టీ కొనసాగుతోంది. కాబట్టి నిర్మాణ వ్యయాలు పెరిగి.. ఆ భారాన్ని కొనుగోలుదారులపై మోపాల్సివస్తోందని స్థిరాస్తి వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా ధరలు పెరిగి కొనుగోలు చేయడానికి.. ప్రజలు ముందుకు రావడం లేదని వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. నిర్మాణంలో ఉపయోగించే వస్తువులపై జీఎస్‌టీ తగ్గించాలని కోరుతున్నాయి. దేశంలో సామాన్యుల సొంతింటి కలను నిజం చేయడంలో.. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన వంటి పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని.. ఇక్రా’ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో.. తాజా బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని.. నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం దాదాపు 4.6 లక్షల ఇళ్లకు.. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు అందించాల్సి ఉందని ఇక్రా తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.