ETV Bharat / business

జాక్​మాపై వదంతులు.. అలీబాబా షేర్లు పతనం.. ఒక్కరోజే 26 బిలియన్ డాలర్లు ఆవిరి!

author img

By

Published : May 4, 2022, 5:16 PM IST

Alibaba Jack Ma
Alibaba Jack Ma

Alibaba Jack ma: ఈ-కామర్స్​ దిగ్గజం అలీబాబా అధినేత జాక్​మా అరెస్టయ్యారనే వదంతులు హాంకాంగ్ స్టాక్​మార్కెట్​లో ప్రకంపనలు సృష్టించాయి. సంస్థ షేర్లు 9.4శాతం కుప్పకూలాయి. 26 బిలియన్​ డాలర్ల మదుపర్ల సంపదం ఆవిరైంది. చివరకు అసలు నిజం తెలిసి అలీబాబా షేర్లు మళ్లీ పుంజుకున్నాయి. చైనాలో ఈ నాటకీయ పరిణామాలకు కారణమేంటంటే..?

Jack Ma Arrest News: చైనా కుబేరుడు, దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అలీబాబా అధినేత జాక్​మా అరెస్టయ్యారనే పుకార్లు మంగళవారం పెద్దఎత్తున వ్యాపించాయి. దీంతో హాంకాంగ్​ స్టాక్​ మార్కెట్లో ఆ సంస్థ షేర్లు ఒక్కసారిగా 9.4శాతం పతనం అయ్యాయి. గంటల వ్యవధిలోనే 26 బిలియన్ డాలర్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

అలీబాబా సంస్థపై చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న తర్వాత 2020 చివరి నుంచి జాక్​ మా ఎవరికీ కన్పించడం లేదు. కానీ మంగళవారం ఉదయం ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అలీబాబా నివాసం ఉండే హాంగ్​జౌ ప్రాంతంలో ఓ వ్యక్తిని అధికారులు విచారిస్తున్నారని చైనా ప్రభుత్వ టీవీ ఛానెల్​ సీసీటీవీ వార్తలు ప్రసారం చేసింది. అతని ఇంటి పేరు 'మా' అని వెల్లడించింది. అంతకుమించి ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వలేదు. కానీ మదపర్లు మాత్రం ఆ వ్యక్తి జాక్​మానే అని నమ్మారు. చైనీస్​లో జాక్​ మా పేరు 'మా యున్'​ కావడమూ ఇందుకు ఓ కారణం. దీంతో అలీబాబా షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.

Alibaba Share: ఆ తర్వాత కాసేపటికే చైనా ప్రభుత్వానికే చెందిన మరో మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్​ మరో వార్తను ప్రసారం చేసింది. అధికారులు విచారిస్తున్న వ్యక్తి పేరు మూడు అక్షరాలతో ఉందని తెలిపింది. అంతేకాదు ఆయన 1985లో జన్మించాడని, హార్డ్​వేర్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ కంపెనీకి ఎండీ అని పేర్కొంది. ఈ వ్యక్తి జాక్​మా కంటే కనీసం 20 ఏళ్లు చిన్నవాడు అని తెలిసి మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు.

Jack Ma News: అధికారులు విచారించింది జాక్​మాను కాదని తెలిశాక అలీబాబా షేర్లు మళ్లీ పుంజుకున్నాయి. మంగళవారం మార్కెట్లు ముగిసే సమయానికి స్వల్పంగా 0.83శాతమే నష్టపోయాయి. ఒక్కరోజులో అలీబాబా షేర్ల ధరలో ఈ ఒడుదొడుకులను చూస్తే మదుపర్లు ఎంత సున్నితంగా ఉంటారో అర్థమవుతోంది. చైనా ప్రభుత్వం ఏ టెక్ సంస్థను మూసివేస్తుందో తెలియక వారు భయాందోళనతో ఉన్నారు. ఇటీవలి కాలంలో టెక్ కంపెనీలకు వ్యతిరేకంగా చైనా యాంటీ ట్రస్ట్ దర్యాప్తులను చేపట్టింది. డేటా భద్రతపై పర్యవేక్షణ పెరిగింది. ఇంటర్నెట్, గేమింగ్ ప్లాట్‌ఫాంల వినియోగంపై ఆంక్షలు విధించింది. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా.. ఇన్వెస్టర్లు టెక్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచిస్తున్నారు.

Jack ma Alibaba: 2020 అక్టోబరులో చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్‌ మా ప్రసంగిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని హితవు పలికారు. ఇంకేముంది.. జాక్‌ మా వ్యాఖ్యలపై మండిపడ్డ డ్రాగన్‌.. ఆయనపై ప్రతీకార చర్యలకు దిగింది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. యాంట్‌ ఫైనాన్షియల్‌ ఐపీవోను అడ్డుకొంది. అక్రమ వ్యాపార పద్ధతులను అనుసరించారంటూ 2.75 బిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించింది. అక్కడ మొదలైన జిన్‌పింగ్‌ ఆంక్షల పర్వం ప్రైవేటు రంగంపై క్రమంగా కొనసాగుతూ వచ్చింది. టెక్నాలజీ, స్థిరాస్తి, గేమింగ్‌, విద్య, క్రిప్టోకరెన్సీ.. ఇలా విస్తరిస్తూ పోయింది. అయితే తాజాగా చైనా ప్రభుత్వం తన అణచివేత వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. డిజిటల్​ ప్లాట్‌ఫాం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ఆరోగ్యకరమైన వాతావరణంలో పోత్సహిస్తామని చెప్పింది. ఫలితంగా ఇంటర్నెట్ స్టాక్​ ధరలు పెరిగాయి.

ఇదీ చదవండి: ట్విట్టర్​ యూజర్లకు మస్క్​ షాక్​- వారు డబ్బు చెల్లించాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.