ETV Bharat / business

ఈ వ్యూహాలు పాటిస్తే మ్యూచువల్​ ఫండ్స్​లో లాభాలు గ్యారెంటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 12:30 PM IST

Tips to Invest in Mutual Funds
mutual fund investment tips

Mutual Fund Investment Tips In Telugu : మీరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టారా? చిన్నపాటి నష్టాలకే భయపడి.. పెట్టుబడులను వెనక్కు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మ్యూచువల్ ఫండ్స్​ పెట్టుబడుల విషయంలో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే, మంచి లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Mutual Fund Investment Tips : ఈ కాలంలో చాలా మంది భారతీయ మదుపరులు మ్యూచువల్ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్​ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) గణాంకాల ప్రకారం, మ్యూచువల్​ ఫండ్ల నిర్వహణలో ఉన్న సగటు ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.46.71 లక్షల కోట్లు. వాస్తవానికి గత నెలలో మ్యూచువల్​ ఫండ్లలోకి దాదాపు రూ.20,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా ఇండియన్ ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలో మ్యూచువల్ ఫండ్లకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

దీర్ఘకాలిక వ్యూహంతో..
Mutual Fund Long Term Investment Benefits : మ్యూచువల్ ఫండ్స్​లో దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కానీ దాదాపు 51 శాతం మంది కేవలం ఒక్క ఏడాదిలోపే తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. మరో 29 శాతం మదుపరులు మాత్రమే తమ పెట్టుబడిని రెండేళ్లకు మించి కొనసాగిస్తున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

నష్టభయం ఉంటుంది.. కానీ
కొన్ని మ్యూచువల్​ ఫండ్లలో నష్టభయం కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరికొన్నింటిలో నష్టభయం కాస్త తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్​ తీసుకుంటే.. వీటిలో రిస్కు, రాబడి రెండూ తక్కువగానే ఉంటాయి. అదే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్ విషయానికి వస్తే.. వీటిలో రిస్క్​, రివార్డ్ రెండూ ఎక్కువగానే ఉంటాయి. అంటే నష్టభయం ఎక్కువగా ఉన్న చోట, దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. అందుకే స్వల్ప నష్టభయం ఉన్న పథకాల్లో కనీసం 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకూ పెట్టుబడులను కొనసాగించాలి. అదే నష్టభయం ఎక్కువగా ఉన్న పథకాల్లో కనీసం 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు పెట్టుబడులను కొనసాగించాలి. అప్పుడే మార్కెట్‌ అస్థిరతలను తట్టుకొని, మంచి లాభాలు పొందేందుకు వీలవుతుంది.

పన్నుల భారం తగ్గాలంటే..
మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను స్థూలంగా డెట్‌, ఈక్విటీలుగా వర్గీకరించవచ్చు. వీటిపై వచ్చే లాభాలపై పన్నులు వేర్వేరుగా ఉంటాయి. వాస్తవానికి నిర్ణీత డెట్‌ ఫండ్ల నుంచి వచ్చిన లాభాలను.. మీ వ్యక్తిగత ఆదాయంలో భాగంగా కలిపి చూపించి, అందుకు వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లపై వచ్చిన లాభాలను ఒక ఏడాదిలోపు స్వీకరిస్తే.. ఆ మొత్తంపై 15 శాతం వరకు స్వల్పకాలిక మూలధన రాబడి పన్ను చెల్లించాలి. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించినప్పుడు.. దానిపై వచ్చిన లాభాలను దీర్ఘకాలిక మూలధన రాబడిగా పరిగణిస్తారు. అప్పుడు ఏడాదికి రూ.1,00,000కు మించి వచ్చిన లాభాలపై 10 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

తొందరపడకూడదు..
మీరు కనీసం 3 ఏళ్లపాటు పెట్టుబడులను కొనసాగించాలని అనుకుంటే.. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) లేదా క్లోజ్డ్‌ ఎండెడ్‌ ఫండ్‌ పథకాల్లో ఇన్వెస్ట్​ చేయాలి. ఎందుకంటే.. ఈఎల్‌ఎస్‌ఎస్‌లకు 3 ఏళ్ల లాకిన్‌ పీరియడ్​ ఉంటుంది. అలాగే క్లోజ్డ్‌ ఎండెడ్‌ పథకాలకు.. సాధారణంగా 3 ఏళ్లు నుంచి 5 ఏళ్ల వరకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. కనుక తొందరపాటుతో పెట్టుబడులను వెనక్కు తీసుకోకుండా ఇవి అడ్డుకుంటాయి.

ఎగ్జిట్ లోడ్ పడకుండా..
How To Avoid Exit Load In Mutual Fund : కొన్ని మ్యూచువల్​ ఫండ్స్​లోని పెట్టుబడులను నిర్ణీత వ్యవధి కంటే ముందే ఉపసంహరించుకున్నప్పుడు అమ్మకపు రుసుము (ఎగ్జిట్‌ లోడ్‌) చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు కొన్ని మ్యూచువల్​ ఫండ్లు పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి ఒక ఏడాదిలోపు యూనిట్లను విక్రయిస్తే.. 1 శాతం వరకు రుసుమును వసూలు చేస్తాయి. వాస్తవానికి రిడీమ్ చేసిన యూనిట్ల విలువ ఆధారంగా (ఎగ్జిట్ లోడ్) రుసుము వసూలు చేస్తాయి. కనుక ఇలాంటి అనవసర వ్యయాలు జరగకుండా ఉండాలంటే.. లాకిన్ పీరియడ్ ముగిసే వరకైనా పెట్టుబడులను కొనసాగించడం మంచిది.

సమీక్షించుకోవాలి!
చాలా మంది తాము ఇన్వెస్ట్ చేసిన ఫండ్‌ పనితీరు బాగా లేనప్పుడు పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ సూచీలు కుదుటపడ్డాక ఇవి వేగంగా కోలుకుంటాయి. కనుక, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా.. దీర్ఘకాలంలో ఫండ్‌ పనితీరు ఎలా ఉందో పరిశీలించాలి. అదే విభాగంలోని ఇతర మ్యూచువల్​ ఫండ్లతో పోల్చి చూసుకోవాలి. ఒక వేళ మీరు పెట్టుబడి పెట్టిన మ్యూచువల్ ఫండ్​ పనితీరు ఏ మాత్రం బాగా లేకపోతే.. అప్పుడు మాత్రమే దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. ఒక వేళ ప్రామాణిక సూచీలకు అనుగుణంగానే రాబడిని అందిస్తుంటే.. మరి కొంత కాలం మీ పెట్టుబడులను కొనసాగించే ప్రయత్నం చేయాలి.

లక్ష్యం నెరవేరేదాక..
వాస్తవానికి మీ ప్రతి పెట్టుబడికీ ఒక లక్ష్యం ఉండాలి. ఇందుకోసం దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లాలి. ఎంచుకున్న పథకంలో అనుకున్న మొత్తం జమ అయ్యేదాకా వేచి చూడాలి. ఎప్పుడూ చిన్న చిన్న అవసరాల కోసం దీర్ఘకాలిక పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా జాగ్రత్త పడాలి. మీరు ఆశించిన మొత్తం సమకూరిన వెంటనే సదరు మ్యూచువల్ ఫండ్​ నుంచి మీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలి. ఇలా చేస్తే కచ్చితంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

మీ వంటగ్యాస్ త్వరగా అయిపోతోందా? - ఈ టిప్స్​తో నెల వచ్చేది 2 నెలలు రావడం పక్కా!

కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? - అయితే ఈ టిప్స్ పాటించి నష్టాలకు నో చెప్పండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.