ETV Bharat / business

అవన్నీ తెలుసుకున్నాకే సూచీ ఫండ్లలో పెట్టుబడులు, ప్రయోజనాలు ఇవే

author img

By

Published : Aug 23, 2022, 2:26 PM IST

INVESTING IN INDEX FUNDS IS IT PROFITABLE
INVESTING IN INDEX FUNDS IS IT PROFITABLE

Investing in Index Funds స్టాక్​ మార్కెట్లలో మంచి లాభాలను ఆర్జించాలనుకుంటున్నారా. అయితే మార్కెట్​ వృద్ధిని ప్రతిబింబించే సూచీల్లో పెట్టుబడులు పెడితే నిర్వహణలోనూ ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు దాదాపు అన్ని ఫండ్​ సంస్థలు ఈ సూచీ ఫండ్లను తీసుకొస్తున్నాయి. దీని గురించి తెలుసుకుందాం.

Investing in Index Funds: స్టాక్‌ మార్కెట్లో ఎన్నో కంపెనీలుంటాయి. వాటిలో మంచి పనితీరున్న వాటిని ఎంచుకోవడం అంత తేలికకాదు. కానీ, మార్కెట్‌ వృద్ధిని ప్రతిబింబించే సూచీల్లో ఉండే షేర్లలో మదుపు చేస్తే లాభాలను ఆర్జించడం సులువవుతుంది. పైగా పెట్టుబడుల నిర్వహణలోనూ పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ వ్యూహంతో వచ్చిందే ఇండెక్స్‌ ఫండ్లు. దీనినే సూచీ ఫండ్లు అని కూడా అంటారు. ఇప్పుడు దాదాపు అన్ని ఫండ్‌ సంస్థలూ ఇండెక్స్‌ ఫండ్లను తీసుకొస్తున్నాయి. సూచీల్లో ఉండే షేర్ల వెయిటేజీ నిష్పత్తి ఆధారంగా ఈ ఫండ్లు ఆయా షేర్లలో మదుపు చేస్తాయి. కాబట్టి, సూచీల లాభాలను నేరుగా అందించేందుకు వీలవుతుంది.
ఫండ్లు ఏ సూచీల ఆధారంగా పనిచేస్తాయనేది ముందుగానే నిర్ణయిస్తారు. ఉదాహరణకు నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ విడుదల చేస్తే.. ఆ సూచీలో ఉండే షేర్లలోనే అది మదుపు చేస్తుందన్నమాట. ఈ తరహా ఫండ్లలో మదుపు చేయడం వల్ల ఉన్న ప్రయోజనాలను గమనిస్తే..

  • మార్కెట్లో అన్ని రకాల క్యాపిటలైజేషన్‌ ఉన్న షేర్లలో మదుపు చేసేందుకు ఇండెక్స్‌ ఫండ్లు దోహదం చేస్తాయి. బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌ లేదా నిఫ్టీ 100 ఇండెక్స్‌.. ఇలా మదుపరులు తమకు నచ్చిన సూచీ ఫండ్లను ఎంచుకోవచ్చు. దీనివల్ల వైవిధ్యానికి వీలు కలుగుతుంది. ఈక్విటీలే కాకుండా.. స్థిరాదాయం అందించే సురక్షిత పథకాలకు సంబంధించిన సూచీ ఫండ్లూ ఉంటాయి. ఇవి ప్రధానంగా ప్రభుత్వ సెక్యూరిటీలు, టి-బిల్లులు, కార్పొరేట్‌ బాండ్లు, కమర్షియల్‌ పేపర్లు ఇలా పలు రకాల విభాగాల్లో మదుపు చేస్తుంటాయి. ఒక సూచీలో ఏ తరహా పెట్టుబడి పథకాలుంటాయన్నది మార్కెట్‌ నియంత్రణ సంస్థ చాలా స్పష్టమైన విధివిధానాలను రూపొందించింది.
  • సాధారణ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలతో పోలిస్తే.. వీటిలో ఖర్చుల నిష్పత్తి తక్కువగా ఉంటుంది. అందుకే, ఈ ఫండ్లకు ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతోందని చెప్పొచ్చు. పెట్టుబడులు ఆయా ప్రామాణిక సూచీల్లోని షేర్లలోనే ఉంటాయి కాబట్టి, ఫండ్‌ మేనేజర్‌ పాత్ర తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఫీజు, ఇతర నిర్వహణ ఖర్చులు తక్కువే ఉంటాయి.
  • ఫండ్‌ పెట్టుబడి కోసం ఏయే షేర్లను ఎంచుకుంటుందనే విషయం పూర్తి పారదర్శకంగా ఉంటుంది. పెట్టుబడులు ఎంత మేరకు వృద్ధి సాధించాయి అనేదీ సులువుగా తెలుసుకోవచ్చు. ఏయే షేర్లకు ఎంత పెట్టుబడిని కేటాయించిందీ మదుపరులకు తేలిగ్గా అర్థం అవుతుంది.
  • మహమ్మారి తర్వాత ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, వినియోగ వస్తువులు, టెక్నాలజీ సంస్థలు మంచి వృద్ధిని సాధించాయి. ఈ రంగాల్లోని వృద్ధిని అందుకునేందుకు మదుపరులు బ్యాంకింగ్‌ ఇండెక్స్, కన్సంప్షన్‌ ఇండెక్స్, టెక్నాలజీ ఇండెక్స్‌ తదితర ఫండ్లను ఎంచుకోవచ్చు. ఈ ఫండ్లు మార్కెట్లోని పలు షేర్లలో మదుపు చేస్తాయి కాబట్టి, మదుపరుల పెట్టుబడి పెరిగేందుకు వీలవుతుంది.
  • సంప్రదాయ సూచీలకు భిన్నంగా కొత్త ప్రామాణిక సూచీలను తీసుకొచ్చేందుకూ ఫండ్‌ మేనేజర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న కొన్ని థీమ్యాటిక్‌ సూచీలను మన దేశంలోనూ ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆశాజనకంగా కనిపిస్తున్న రంగాల్లో పని చేస్తున్న కంపెనీలతో సూచీలను ఏర్పాటు చేసి, ఇండెక్స్‌ ఫండ్లను తీసుకొస్తున్నారు.

- అశ్విన్‌ పత్ని, హెడ్‌-ప్రొడక్ట్స్, యాక్సిస్‌ ఏఎంసీ

ఇవీ చూడండి: పదవీ విరమణ ప్రశాంతంగా సాగేలా ఆర్థిక పాఠాలివిగో

నెలకు రూ.9వేల పెన్షన్, అప్లై ఎలా చేసుకోవాలో తెలుసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.