How Is Gold Price Calculated In India : భారతదేశంలో బంగారం అంటే ఇష్టపడని మహిళలు ఉండరంటే.. అది అతిశయోక్తి కాదు. ఈ రోజుల్లో చాలా మంది పురుషులు కూడా గోల్డ్ చైన్లు, ఉంగరాలు ధరించడానికి ఇష్టపడుతున్నారు. కొంత మంది ఫ్యాన్సీగా గోల్డ్ వాచ్లు కూడా ధరిస్తున్నారు. వాస్తవం ఏమిటంటే.. మన సంస్కృతికి - బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది. మన దేశంలో ప్రతి పండుగకు, ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి కచ్చితంగా బంగారు నగలు ధరించాలని మహిళలు ఆశపడుతూ ఉంటారు. అందుకే ఆయా సమయాల్లో.. భారీ ఎత్తున షాపింగ్ కూడా చేస్తూ ఉంటారు. మరి ఆ బంగారు భరణాల విలువను ఎలా లెక్కగడతారో మీకు తెలుసా? ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా?
బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారు?
Who Sets Gold Prices In India : వాస్తవానికి బంగారం ధరలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. గోల్డ్ జ్యువెలర్ అసోసియేషన్ నిర్ణయించిన ధరల ప్రకారం.. బంగారం వర్తకులు, చిల్లర వ్యాపారులు (రిటైలర్స్) రోజువారీ అమ్మకాలు జరుపుతారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ప్రతి నగరంలోనూ గోల్డ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ఉంటుంది. ఇది స్థానికంగా బంగారం ధరలను నిర్ణయిస్తుంది. అందువల్లనే ప్రతి నగరంలో బంగారం ధరలు కాస్త భిన్నంగా ఉంటాయి. అయితే ఈ ధరల వ్యత్యాసం ఎప్పుడూ స్వల్పంగానే ఉంటుంది అనే విషయాన్ని కొనుగోలుదారులు గుర్తించుకోవాలి.
బంగారు ఆభరణాల ధరను ఎలా లెక్కిస్తారు?
బంగారం నాణ్యత, తయారీ ఖర్చులు, పన్నులు అన్నీ కలిపి.. బంగారు ఆభరణాల ధరలను నిర్ణయించడం జరుగుతుంది. వాస్తవానికి పసిడి ఆభరణాల ధరలను లెక్కించేందుకు ఒక ఫార్ములా ఉంది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గోల్డ్ రేట్ కాలిక్యులేషన్ ఫార్ములా :
The Formula Used For Gold Rate Calculation :
ఆభరణం తుది ధర = గ్రాము బంగారం ధర (22 క్యారెట్ లేదా 18 క్యారెట్) X (బంగారం బరువు) + మేకింగ్ ఛార్జీలు/గ్రాము + జీఎస్టీ
నోట్ : ఆభరణం ధర + మేకింగ్ ఛార్జీల మొత్తం విలువపై జీఎస్టీ విధించడం జరుగుతుంది.
ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా.. బంగారు ఆభరణాల రేటు ఎలా కడతారో.. సులువుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
- ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల (22 క్యారెట్) బంగారం ధర రూ.30,000 ఉంది అనుకుందాం. అప్పుడు..
- 1 గ్రాము 22 క్యారెట్ బంగారం ధర = రూ.3,000
- మీరు కొన్న నగ బరువు = 20 గ్రాములు
- మేకింగ్ ఛార్జీలు = రూ.300/ గ్రాము
- జీఎస్టీ = 3% (ఫ్లాట్ రేట్)
- బంగారు ఆభరణం ధర = 3000 x 20 + (20 x 300) = రూ.66,000. దీనిపై 3% జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. అప్పుడు..
- బంగారం ఆభరణం తుది ధర = రూ.67,980 అవుతుంది. మీరు ఈ ధర వద్దనే సదరు ఆభరణాన్ని కొనాల్సి ఉంటుంది.
బంగారు నగల ధరలపై ప్రభావం చూపించే అంశాలు
- గోల్డ్ ప్యూరిటీ : బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ బంగారం అనేది పూర్తి స్వచ్ఛమైనది. అయితే దీనితో మనం పసిడి ఆభరణాలను తయారు చేయలేము. సాధారణంగా 18 క్యారెట్ లేదా 22 క్యారెట్ బంగారంతో నగలు తయారుచేస్తారు. గోల్డ్ ప్యూరిటీ ఎంత ఎక్కువగా ఉంటే.. నగల ధర అంత ఎక్కువగా ఉంటుంది.
- మేకింగ్ ఛార్జీలు : బంగారు వర్తకులను అనుసరించి గోల్డ్ మేకింగ్ ఛార్జీలు మారుతూ ఉంటాయి. సాధారణంగా తయారీ ఖర్చులు.. బంగారం ధరలో 8% నుంచి 35% వరకు ఉంటాయి. అందుకే బంగారం నగలు కొనేముందు కచ్చితంగా ఈ మేకింగ్ ఛార్జీలు తగ్గించమని బేరం ఆడడం మంచిది.
- విలువైన మణులు, రత్నాలు పొదిగిన ఆభరణాలు : కొన్ని సార్లు మనం కోరుకున్న మణులు, మాణిక్యాలు, రత్నాలు, రంగు రాళ్లు పొదిగి పసిడి ఆభరణాలను తయారు చేస్తారు. ఇలాంటి సమయంలో బంగారం ధరను సపరేట్గా లెక్కిస్తారు. రత్నాల విలువను ప్రత్యేకంగా లెక్కిస్తారు. అయితే ఇలాంటి నగల మేకింగ్ ఛార్జీలు కాస్త అదనంగా ఉంటాయి.
- గోల్డ్ ప్రైసింగ్ : పడిసి ధరలు రోజు వారీగా మారుతాయి. డిమాండ్, సప్లై సహా అనేక ఇతర అంశాలు పుత్తడి ధరలను ప్రభావితం చేస్తాయి.
పసిడి ధరలు వివిధ నగరాల్లో, దుకాణాల్లో భిన్నంగా ఉంటాయి. ఎందుకు?
Why Are Gold Prices Different Across The Country : సాధారణంగా బంగారం ధరలు వివిధ నగరాల్లో భిన్నంగా ఉంటాయి. ఒకే నగరంలోని దుకాణాల్లో కూడా పసిడి ఆభరణాల ధరలు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే.. స్థానిక గోల్డ్ అసోసియేషన్లు రోజువారీగా బంగారం ధరలను నిర్ణయిస్తాయి. అందుకే ఒక్కో నగరంలో ఒక్కో ధర ఉంటుంది. ఇక పసిడి ఆభరణాల విషయానికి వస్తే.. మేకింగ్ ఛార్జీలు అనేవి ఆయా దుకాణాలను అనుసరించి మారుతూ ఉంటాయి. కొన్ని షాపులు ప్రత్యేకమైన డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తూ ఉంటాయి. కొన్ని షాపులు.. బంగారం తరుగు లెక్కలను భిన్నంగా వేస్తూ ఉంటాయి. కనుక ఆయా షాపులను అనుసరించి.. పసిడి ఆభరణాల ధరల్లో తేడాలు ఉంటాయి. అందుకే గోల్డ్ రేట్ కాలిక్యులేషన్ తెలుసుకోవాలి. అప్పుడే సరైన ధరకు బంగారం ఆభరణాలు కొనుగోలు చేసే వీలు ఉంటుంది.