ETV Bharat / business

మస్క్ సంపద డౌన్.. ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ ఆర్నాల్ట్.. అసలు ఎవరీయన?

author img

By

Published : Dec 14, 2022, 3:22 PM IST

bernard arnault world richest man
ప్రపంచ కుబేరుడు

Bernard Arnault World Richest Man : ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్‌ మస్క్‌ రెండో స్థానానికి పడిపోయారు. ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి స్థానంలో నిలిచారు.

Bernard Arnault World Richest Man : టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానాన్ని ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ దక్కించుకున్నారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌తాజా నివేదిక ప్రకారం న్యూయార్క్‌లో ఉదయం 10:20 గంటల సమయంలో మస్క్‌ సంపద 168.5 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. బెర్నార్డ్‌ సంపద విలువ 172.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దీంతో మస్క్‌ను వెనక్కినెట్టి బెర్నార్డ్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గతవారం ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచ ధనవంతుల జాబితాలో బెర్నార్డ్ తొలిస్థానంలో నిలవగా.. మస్క్‌ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఈ ర్యాంకులు ప్రకటించిన కొద్దిసేపటికే మస్క్‌ తన వ్యక్తిగత సంపద విలువను పెంచుకుని తొలిస్థానానికి చేరుకున్నారు. తాజాగా మరోసారి మస్క్ వ్యక్తిగత ఆస్తుల విలువ తగ్గడం వల్ల ఆయన రెండో స్థానానికి దిగజారారు.

మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు చేసిన నాటి నుంచి ఆయన వ్యక్తిగత సంపద విలువ తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లకు ట్విట్టర్​ను కొనుగోలు చేశారు. ఈ డీల్‌ను పూర్తి చేసేందుకు మస్క్‌ 19 బిలియన్‌ డాలర్ల విలువైన టెస్లా షేర్లను రెండు దఫాలుగా ఏప్రిల్‌, ఆగస్టు నెలల్లో విక్రయించారు. దీంతో మస్క్‌ వ్యక్తిగత సంపద విలువ తగ్గుతూ వస్తోంది.

ఇక తాజా ప్రపంచ కుబేరుడు బెర్నార్డ్‌ చాలా కాలంగా ప్రపంచ కుబేరుల జాబితాలో కొనసాగుతున్నారు. ఇతర బిలియనీర్ల తరహాలో బెర్నార్డ్ సంపద విలువలో ఒక్కసారిగా పెరగడం, తగ్గడం జరగదు. ఈయన సంపద విలువ క్రమానుగతంగా పెరుగుతుందని విశ్లేషకులు అంచనా. వడ్డీ రేట్ల కారణంగా మార్క్‌ జుకర్‌బర్గ్‌, జెఫ్‌ బెజోస్‌, లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ వంటి బిలియనీర్ల సంపద విలువ తగ్గడం వల్ల అనూహ్యంగా బెర్నార్డ్‌ అగ్రస్థానానికి చేరుకున్నారు.

ఎవరీ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌..?

  • 73 ఏళ్ల బెర్నార్డ్‌ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువుల బ్రాండ్‌కి పెట్టింది పేరైన ఎల్‌వీఎంహెచ్‌ కంపెనీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువుల బ్రాండ్లు ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి.
  • ఇకోలే పాలిటెక్నిక్‌ నుంచి బెర్నార్డ్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం కొంతకాలం ప్రముఖ వ్యాపారవేత్త ఫెరెట్‌ సావినెల్‌ కుటుంబ వ్యాపారంలో పనిచేశారు. 1981లో అమెరికాకు మకాం మార్చారు. తండ్రికి వారసత్వంగా స్థిరాస్తి రంగంలోకి ప్రవేశించారు.
  • 1984లో ఫ్రాన్స్‌కు తిరిగొచ్చారు. దివాలా తీసిన వస్త్ర కంపెనీ బౌశాక్‌ సెయింట్‌-ఫ్రెరేస్‌ను కొనుగోలు చేశారు. ఇది క్రిస్టియన్‌ డయోర్‌ అనే బ్రాండ్‌ పేరిట ఫ్యాషన్‌ వస్తువులను విక్రయిస్తుండేది. అనంతరం ఇతర గ్రూప్‌ కంపనీల్లో పెట్టుబడులు పెట్టి వచ్చిన లాభాల ద్వారా ఎల్‌వీఎంహెచ్‌లో నియంత్రిత వాటాలను కొనుగోలు చేశారు. అనంతరం దీంట్లోనే రెండు ప్రధాన కంపెనీలైన లూయిస్‌ విటన్‌, మోయెట్‌ హెన్నెస్సీ విలీనం అయ్యాయి.
  • ఎల్‌వీఎంహెచ్‌ను బెర్నార్డ్‌ విలాసవంత వస్తువులకు మారుపేరుగా మార్చారు. లూయిస్‌ విటన్‌, సెఫోరా సహా మొత్తం 70 ఇతర ఫ్యాషన్‌ బ్రాండ్లు ఎల్‌వీఎంహెచ్‌ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. షాంపేన్‌, వైన్‌, స్పిరిట్‌, ఫ్యాషన్‌, లెదర్‌ వస్తువులు, చేతి గడియారాలు, ఆభరణాలు, హోటళ్లు, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5,500 స్టోర్లు ఉన్నాయి.
  • 73 ఏళ్ల బెర్నార్డ్‌ సామాజిక మాధ్యమాల్లో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. ఆయనకు ఐదుగురు సంతానం. వీరిలో నలుగురు ఎల్‌వీఎంహెచ్‌లోనే వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఏళ్లుగా వివిధ మార్కెట్లను గమనిస్తూ సంపాదించిన అనుభవమే తన విజయానికి కారణమని బెర్నార్డ్‌ చెబుతుంటారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.