ETV Bharat / business

ఢమాల్​ స్ట్రీట్​: రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరి

author img

By

Published : Mar 12, 2020, 11:18 AM IST

Updated : Mar 12, 2020, 11:47 AM IST

market
స్టాక్

స్టాక్ మార్కెట్ల భారీ పతనంతో రూ.11 లక్ష కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. అంతర్జాతీయంగా నెలకొన్న కరోనా భయాలతో దేశీయ మార్కెట్లు రికార్డు స్థాయి నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైన వేళ మదుపరులు భారీగా నష్టపోయారు. అంతర్జాతీయ పరిణామాలతో అమ్మకాల ఒత్తిడి పెరగటం వల్ల మదుపరుల సంపద రూ.11 లక్షల కోట్లు ఆవిరైంది.

ఉదయం 11.09 సమయంలో సెన్సెక్స్​ 2,582 పాయింట్లు కోల్పోయి 33,114 పాయింట్లకు చేరి 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 767 పాయింట్లు నష్టపోయి ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది.

స్టాక్​ మార్కెట్లు ప్రారంభమైన నిమిషంలోనే రూ.6 లక్షల కోట్లను నష్టపోయారు మదుపరులు. అనంతరం 10.30 గంటలకు 1,800 పాయింట్ల నష్టంలో ఉండగా రూ.8.5 లక్షల కోట్లను కోల్పోయారు. 11 గంటలకు ఆ నష్టం రూ.11లక్షల కోట్లకు చేరింది.

ఇదే తీరు కొనసాగితే కొద్దిసేపు ట్రేడింగ్​ను నిలిపివేసే అవకాశం ఉంది.

కమ్మేసిన భయాలు..

సూచీల పరిస్థితి ఏమాత్రం బాగోకపోవడం వల్ల ఎఫ్‌ఐఐలు కూడా మార్కెట్లను వీడుతున్నారు. ఈ క్రమంలో షేర్లు మరింత పతనం అయి భయాలను ఎగదోస్తున్నాయి. నిఫ్టీ 10వేల మార్కు కిందకు రావడం, 700 పాయింట్లకు పైగా పతనం కావడం మదుపరుల సెంటిమెంట్‌ను భారీగా దెబ్బతీసింది. ఇదంతా ఒక గొలుసుకట్టు వ్యవస్థలా పనిచేసి మార్కెట్లలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. భారీ షేర్లు ఏవీ లాభాల్లో ట్రేడ్‌ కావట్లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

అన్ని నష్టాల్లోనే..

టాటా మోటార్స్​, ఎస్ బ్యాంకు, యాక్సిస్​ బ్యాంకు, టాటా స్టీల్, ఎస్బీఐ, ఓఎన్​జీసీ, సన్​ఫార్మా, టైటాన్​ భారీ నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ పరిణామాలు..

కరోనా వైరస్​ను అంతర్జాతీయ వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ప్రకటించింది. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. వైరస్ తీవ్రత కారణంగా బ్రిటన్​ మినహా ఐరోపా దేశాలన్నింటికీ 30 రోజుల పాటు రాకపోకలు నిలిపేశారు.

ఫలితంగా ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. చమురు ధరలు 6 శాతం పడిపోయాయి. ఈ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది.

Last Updated :Mar 12, 2020, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.