ETV Bharat / business

కీలక వడ్డీ రేట్లు మళ్లీ యథాతథం!

author img

By

Published : Mar 28, 2021, 3:54 PM IST

rbi
ఆర్​బీఐ

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్​బీఐ తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష నిర్ణయాలు ఏప్రిల్ 7న వెలువడనున్నాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతుండటం సహా ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా మళ్లీ అంచనాలను దాటిన నేపథ్యంలో.. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దేశంలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి తీసుకునే చర్యలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తదుపరి సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. దీనితో పాటు ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు వేచి చూసే ధోరణి అవలబించొచ్చని కూడా చెబుతున్నారు.

ఎంపీసీ సమీక్ష ఎప్పుడు..

మూడు రోజుల ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం అనంతరం ఏప్రిల్ 7న కీలక వడ్డీ రేట్లు సహా, ఇతర అంశాలపై కమిటీ నిర్ణయాలను వెల్లడించనుంది ఆర్​బీఐ. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జరగనున్న తొలి ఎంపీసీ సమీక్ష కూడా ఇదే.

ఫిబ్రవరి 5న వెలువడిన చివరి ఎంపీసీ నిర్ణయాల్లోనూ వడ్డీ రేట్లు యథాతథంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది కమిటీ. రెపో రేటు ప్రస్తుతం 4 శాతం వద్ద, రివర్స్​ రెపో రేటు 3.35 శాతం వద్ద ఉన్నాయి. గత ఏడాది మేలో చివరి సారిగా రెపో, రివర్స్​ రెపో రేట్లను సవరించింది ఆర్​బీఐ.

'రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా అస్థిరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రెపో, రివర్స్​ రెపో రేట్లను యథాతథంగా ఉంచుతూ ఎంపీసీ నిర్ణయం తీసుకునే అవకాశముంది'అని అనరాక్​ ప్రాపర్టీ కన్సల్టెంట్స్​ ఛైర్మన్​ అనూజ్​ పూరీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఐటీ కొత్త రూల్స్... గురువారం నుంచే అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.