ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ యూని వివిధ రకాల క్రెడిట్ కార్డులను(Credit card) ప్రవేశపెడుతోంది. తాజాగా 'పే వన్ థర్డ్'(Pay 1/3rd) అనే సరికొత్త కార్డును తీసుకొచ్చింది. దీన్ని 'పే లేటర్' కార్డుగా(pay later credit card) వ్యవహరిస్తున్నారు. ఈ తరహా కార్డును భారత్‌లో విడుదల చేయడం ఇదే తొలిసారి. భారత్‌లో అత్యధిక కాలం వడ్డీ రహిత నగదు సదుపాయాన్ని అందిస్తున్న కార్డుగా దీన్ని పేర్కొంటున్నారు.
మూడు విడతల్లో చెల్లింపు.. కానీ ఈఎంఐ కాదు
ఈ కార్డు ద్వారా చేసే వ్యయం మొత్తం మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక్కో భాగాన్ని ఒక్కో నెల చొప్పున మూడు నెలల వరకు చెల్లించవచ్చు. ఎలాంటి వడ్డీ ఉండదు. స్వల్పకాలంలో డబ్బులు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొనే వినియోగదారులే లక్ష్యంగా ఈ కార్డును తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది. అయితే, కస్టమర్లు కావాలంటే మూడు భాగాలను ఒకేసారి చెల్లించవచ్చు. అలా చేసిన వారికి ఒక శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
ప్రస్తుతానికి ఈ నగరాల్లో మాత్రమే..
ఈ 'పే వన్ థర్డ్' కార్డును జూన్ నెలలోనే పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చారు. రెండు నెలల్లోనే 10 వేల మంది కస్టమర్లు దీన్ని తీసుకున్నారు. దీంతో ఈ కార్డు సేవల్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. రానున్న ఏడాది వ్యవధిలో మొత్తం 10 లక్షల మంది వినియోగదారులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కార్డు పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, దిల్లీ, ముంబయిలో మాత్రమే అందుబాటులో ఉంచారు.
లక్ష్యమిదే..
క్రెడిట్ కార్డును వినియోగదారులకు మరింత చేరువ చేయాలంటే చెల్లింపు వ్యవధిని మూడు నెలలకు పెంచడమే సరైన పరిష్కారమని తాము భావించినట్లు యూని వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ గుప్తా వెల్లడించారు. కస్టమర్లకు పే వన్ థర్డ్ కార్డును ఓ జీవనశైలి కార్డుగా మార్చే దిశగా సాగుతున్నామని పేర్కొన్నారు. ఎలాంటి రహస్య ఛార్జీలు లేకుండా పారదర్శకంగా ఈ కార్డును రూపొందించినట్లు తెలిపారు.
రుసుములు లేవు..
యూని 'పే వన్ థర్డ్' కార్డు తీసుకునే వారి నుంచి ప్రస్తుతం ఎలాంటి ప్రవేశ, వార్షిక రుసుము వసూలు చేయడం లేదు. పే వన్ థర్డ్ యాప్ ద్వారా మన ఖర్చుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే చెల్లింపు తేదీ దగ్గరపడుతున్న సమయంలో సందేశ రూపంలో హెచ్చరికలు కూడా వస్తాయి. ఈ కార్డును 'వీసా కార్డు' మద్దతుతో తీసుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ కార్డును వీసా కార్డులకు అనుమతి ఉండే ప్రతిచోటా ఉపయోగించవచ్చు. ఫుడ్, గ్రోసరీస్, ఈ-కామర్స్ సహా పీఓఎస్ అందుబాటులో ఉన్న ప్రతిచోటా దీన్ని వినియోగించవచ్చు.
త్వరలో మరిన్ని ఫీచర్లు..
త్వరలో ఈ కార్డులో దీర్ఘకాల ఈఎంఐ వసతి, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, స్కూలు ఫీజు, రివార్డు పాయింట్ల వంటి ఫీచర్లను కూడా తీసుకొస్తామని యూని తెలిపింది. ప్రస్తుతం యూని యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని 'పే వన్ థర్డ్' కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
25-60 ఏళ్ల మధ్య వయసు వారు దీనికి అర్హులు. ఐదు నుంచి పది నిమిషాల్లో మీకు డిజిటల్ కార్డు అందుబాటులోకి వస్తుంది. ఫిజికల్ కార్డును పోస్టు ద్వారా ఇంటికి పంపుతారు.
ఇదీ చదవండి: Electric vehicles: ఆన్లైన్లో జోరుగా విద్యుత్ వాహన కొనుగోళ్లు!