ETV Bharat / business

కరోనా గండంతో ప్రపంచ మార్కెట్లు విలవిల

author img

By

Published : Mar 17, 2020, 9:09 AM IST

Stocks, oil plunge as Fed virus move fails to ease fears
కరోనా గండంతో ప్రపంచ మార్కెట్లు పతనం

కరోనా భయాలతో ప్రపంచ దేశాల మార్కెట్లు భారీగా నష్టపోయాయి. కేంద్ర బ్యాంకుల ఉద్దీపన చర్యలు, వడ్డీరేట్ల తగ్గింపు మదుపరుల సెంటిమెంట్​ను బలపరచలేకపోయాయి.

కరోనా​ ప్రభావంతో ప్రపంచ దేశాల స్టాక్​మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల ఉద్దీపన చర్యలు, వడ్డీరేట్ల తగ్గింపు కూడా మదుపరుల్లో విశ్వాసాన్ని పెంపొందించలేకపోయాయి.

భారీ పతనం

సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే వాల్​స్ట్రీట్​లో వర్తకం నిలిచిపోయింది. అప్పటికే ఆ మార్కెట్ 10 శాతం వరకు నష్టపోయింది. యూరప్​లో ఆఫ్టర్​నూన్​ ట్రేడింగ్​లో పారిస్ 10.7 శాతం, మిలన్​ 10.9 శాతం, మాడ్రిడ్​ 11.3 శాతం, ఫ్రాంక్​ఫర్ట్​ 9.5 శాతం, లండన్​ 7.9 శాతం నష్టపోయాయి. ముఖ్యంగా వాహన, విమానాయాన, పర్యాటక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి.

సౌదీ అరేబియా, రష్యాల మధ్య కొనసాగుతున్న చమురు యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు నాలుగేళ్ల కనిష్ఠానికి (అంటే 10 శాతానికి మించి) పతనమయ్యాయి.

అమెరికా ఫెడరల్ రిజర్వ్​ అత్యవసరంగా వడ్డీ రేట్లను(దాదాపు సున్నా శాతానికి) తగ్గించింది. గత రెండు వారాల్లో ఇలా అత్యవసరంగా వడ్డీరేట్లు తగ్గించడం ఇది రెండో సారి. ఫలితంగా యూరో... డాలర్​తో పోల్చితే ఒక శాతం పెరిగింది. మరోవైపు మాంద్యాన్ని నివారించేందుకు ఫెడరల్ రిజర్వ్​ తన పరిమితులను చేరుకుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

కేంద్ర బ్యాంకుల నష్ట నివారణ చర్యలు

  • యూఎస్ సెంట్రల్ బ్యాంకు భారీ ఆస్తుల కొనుగోలు కార్యక్రమానికి నాంది పలికింది. ఒక దశాబ్దం క్రితం ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ఫెడ్​ ఈ విధమైన చర్యలే చేపట్టింది.
  • పీపుల్స్ బ్యాంక్ ఆఫ్​ చైనా ఫైనాన్షియల్​ మార్కెట్లలోకి ద్రవ్య సరఫరా పెంచడానికి భారీ ఎత్తున నిధులను గుమ్మరిస్తోంది.
  • బ్యాంక్ ఆఫ్ జపాన్ బాండ్ కొనుగోలు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని తెలిపింది.
  • మార్కెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు న్యూజిలాండ్​ కేంద్ర బ్యాంకు కూడా కీలక వడ్డీరేట్లను తగ్గించింది.

సమన్వయంతో

డాలర్​పై ఒత్తిడిని తగ్గించడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్​ ఇంగ్లాండ్​, బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంకు ఆఫ్ కెనడా, స్విస్ నేషనల్ బ్యాంకుల సమన్వయంతో కీలక చర్యలు తీసుకుంటున్నామని అమెరికా ఫెడరల్​ రిజర్వ్ బాస్ జెరోమ్ పావెల్ అన్నారు.

నమ్మకం కుదరడం లేదు...

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) చీఫ్​ టెడ్రోస్ అధనామ్​ ఘెబ్రేయేసస్​... ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ.. మున్ముందు దాని తీవ్రత మరితం పెరిగి, ఎప్పుడు గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందో చెప్పడం అసాధ్యమని స్పష్టం చేశారు. దీనితో కేంద్ర బ్యాంకులు ఎన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నా మదుపరుల్లో మాత్రం విశ్వాసం కలగడం లేదు.

ఇదీ చూడండి: పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి ఈ నెల 31 చివరి గడువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.