ETV Bharat / business

ప్రైవేటీకరణతో మరిన్ని ఉద్యోగాలు: అనురాగ్​

author img

By

Published : Feb 21, 2021, 8:43 AM IST

Uninon Minister Anurag Thakur
ప్రైవేటీకరణతో మరిన్ని ఉద్యోగాలు: అనురాగ్​

ప్రైవేటీకరణతో మరింత మందికి ఉపాధి లభిస్తుందన్న తమ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంటోంది ప్రభుత్వం. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల.. బ్యాంకుల పరిమాణం పెరుగుతుందని కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్​ ఠాకూర్​ చెప్పారు. తద్వారా మరిన్ని ఉద్యోగాలు సృష్టించవచ్చన్నారు.

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంటోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే బ్యాంకుల పరిమాణం పెరుగుతుందని.. మరిన్ని ఉద్యోగాలను సృష్టించవచ్చని, వినియోగదార్లకు మెరుగైన సదుపాయాలు కల్పించవచ్చని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రైవేటీకరణకు నాలుగు బ్యాంకులను ఇప్పటికే గుర్తించినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. ఆ విశేషాలు..

* ప్రైవేటీకరణకు బ్యాంకులను ఎలా గుర్తిస్తారు?

ఏ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.. దేనికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.. ఏ పీఎస్‌యూలు వ్యూహాత్మక విక్రయానికి వెళ్లవచ్చన్నది నీతి ఆయోగ్‌ నిర్ణయిస్తుంది. అందులో ఏ పీఎస్‌యూల ఆస్తుల నగదీకరణ చేయాలి? ఎన్ని షేర్లు విక్రయించాలి? ఏ పీఎస్‌యూ వాటా విక్రయం ద్వారా యాజమాన్య బదిలీ చేయాలి వంటివన్నీ మా ఆర్థిక విభాగం చూసుకుంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఈ పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా ఎంత నిధులు ఖజానాకు వస్తాయన్నది లెక్కవేస్తుంది. వాటిని ప్రజల అభివృద్ధి కోసం కేటాయిస్తుంది. ఇప్పటి వరకు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక ప్రభుత్వ రంగ బీమా కంపెనీలను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)కు పెట్టాలని చర్చించాం.

* ప్రైవేటీకరణపై బ్యాంకుల యాజమాన్య వ్యవస్థ (బీఎమ్‌ఎస్‌) విమర్శించింది కదా?

అన్ని వర్గాలతోనూ బ్యాంకులు చర్చలు చేపట్టాయి. విలీనాలకు ముందు వచ్చిన భిన్నాభిప్రాయాలన్నీ సమసిపోయాయి. ఈ బ్యాంకులకు మూలధనం ఇవ్వడానికి కూడా ప్రజల ధనమే ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. 2014-2020 మధ్య రూ.3.5-4 లక్షల కోట్ల వరకు బ్యాంకుల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. అయినప్పటికీ పలు ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకుల కంటే మిన్నగా ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ప్రజలకు ఆరోగ్యం, విద్య, రోడ్లు, నీటి సదుపాయాలు అవసరం. అలాంటప్పుడు ప్రభుత్వం డబ్బులను వీటిపై వెచ్చించాలా? లేదంటే బ్యాంకుల్లోనా?.

* విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు గట్టి విమర్శలు ఎదురవుతున్నాయి?

ఎటువంటి విధానాలను తీసుకురావడం లేదని(పాలసీ పెరాలసిస్‌) మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని అప్పట్లో విమర్శించారు. ఇపుడు మోదీ ప్రభుత్వం భారీ స్థాయిలో మంచి నిర్ణయాలను తీసుకుంటున్నా.. వాటినీ విమర్శిస్తున్నారు. దేశం ముందుకు వెళ్లాలన్నా.. మరిన్ని ఉద్యోగాలు రావాలన్నా.. కంపెనీలు సరిగా పనిచేయలేకపోతున్నా.. వాటి పరిమాణాన్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఇపుడు తన ప్రాధాన్యాలపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మా ప్రాధాన్యాలను మేం గుర్తించాం.

* క్రిప్టో కరెన్సీలను నియంత్రించే అంశంలో ప్రభుత్వ ప్రణాళికలు ఏమిటి?

ఈ అంశంపై ప్రభుత్వం ఒక అంతర్‌ మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కేబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలో కార్యదర్శుల బృందం ఒకటి కూడా నివేదికను రూపొందించింది. దీనిని కేబినెట్‌కు సమర్పిస్తారు. ఒక వేళ కేబినెట్‌ ఇందుకు ఆమోదం తెలిపితే ప్రభుత్వం ప్రస్తుత సమావేశాల్లోనే క్రిప్టో కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. అపుడు దేశంలో క్రిప్టో కరెన్సీలను నియంత్రించే ఒక చట్టం వస్తుంది.

*గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, లింక్డ్‌ఇన్‌, ట్విటర్‌ వంటి సాంకేతిక దిగ్గజాలపై పన్నులు విధించడంపై విస్తృత చర్చలు నడుస్తున్నాయి. వీటిపై ఏదైనా పురోగతి ఉందా?

అంతక్రితం వీటిపై పన్ను లేదు. ఇపుడు ఉంది. ఈ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా తమ ప్లాట్‌ఫామ్స్‌పై భారీ స్థాయిలో వ్యాపార ప్రకటనలు పబ్లిష్‌ చేస్తున్నాయి. ఈ అంశంపై ఆదాయాన్ని ఎలా రాబట్టుకోవాలన్నదానిపై రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. ప్రభుత్వం మరింత ఆదాయాన్ని పొందే ఏ అవకాశాన్నైనా మనం ఎందుకు వద్దనుకోవాలి.

* పెట్రోలు ఉత్పత్తులపై అధిక ఎక్సైజ్‌ సుంకాన్ని విధించడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా?

పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం ఒకటే సుంకాలు విధించడం లేదు. రాష్ట్రాలు కూడా తమ పన్నులను వసూలు చేసుకుంటున్నాయి. అధిక పన్నుల విషయంలో కేవలం కేంద్రాన్నే విమర్శించడం తగదు. రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించే విషయంలో ఆలోచించాలి.

* ఎన్నో ఏళ్లుగా మలిన నీటి వల్ల వచ్చే వ్యాధులను అరికట్టడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది?

75-80 శాతం వరకు వ్యాధులు స్వచ్ఛత లేని నీటి వల్లే వస్తున్నాయన్నది వాస్తవం. మంచి నీటి కోసం ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళుతుండడం దురదృష్టకరం. దిల్లీలోనూ పలు కాలనీల్లో స్వచ్ఛమైన నీటి కొరత ఉంది. పలు దేశాలు 2030 లక్ష్యంగా ఉంచుకున్న సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌(ఎస్‌డీజీ)పై భారత్‌ కూడా నమ్మకం ఉంచుతోంది. ఈ లక్ష్యాల కింద నీరు, శానిటైజేషన్‌, శుభ్రత(వాష్‌) దిశగా పనిచేస్తున్నాం.

ఇదీ చదవండి: త్వరలో క్రిప్టోకరెన్సీ బిల్లు: కేంద్ర మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.