ETV Bharat / business

కరోనా వేళ విద్యా రుణం ఇలా ఈజీగా!

author img

By

Published : Sep 28, 2020, 1:18 PM IST

How can you reduce the burden of education loan amid coronavirus pandemic?
కరోనా వేళ.. విద్యా రుణం ఇలా ఈజీగా..!

కరోనా కారణంగా ఇప్పటికే తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితి కొందరిది. వీరిని ఆదుకునేందుకు ఆర్బీఐ వ్యక్తిగత రుణాలకు పునర్​వ్యవస్థీకరణ వీలు కల్పించింది. ఇందులో విద్యా రుణాలు కూడా ఉన్నాయి. అయితే కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వారికి తనఖా రుణాలే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా ప్రతి ఒక్కరిపై ఏదో ఒకరకంగా ప్రభావం చూపింది. కొంతమందికి ఆదాయాలు తగ్గిపోయాయి. కొందరు వేతన జీవులకు జీతాల్లో కోత పడింది. మరికొందరు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో రుణాలపై ఈఎమ్ఐ చెల్లించలేని పరస్థితి ఏర్పడింది.

డిగ్రీ పూర్తి చేసుకుంటున్న వారికి ఉద్యోగ నియామకాలు చాలా ముఖ్యం. సరిగ్గా అవి జరిగే సమయంలో కరోనా వచ్చింది. దీనితో ఉద్యోగ నియామకాలు దాదాపు నిలిచిపోయాయి. దీనివల్ల తీసుకున్న విద్యా రుణంపై ఈఎమ్ఐ కట్టటంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగంపై ప్రభావం పడిన విద్యా రుణం చెల్లిస్తున్న ఉద్యోగులు కూడా ఈ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

విద్యా రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న వారు బ్యాంకును సంప్రదించవచ్చు. వారు రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం ఉపశమనం పొందవచ్చు. కొత్తగా రుణాలు తీసుకున్న వారు ఎక్కువ ఖర్చు చేయకుండా తక్కువలో రుణం తీసుకునేందుకు పలు మార్గాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ఇప్పటికే రుణం తీసుకున్న వారు ఏం చేయొచ్చు?

కరోనా వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న వారిని ఆదుకునేందుకు...రిజర్వు బ్యాంకు ఇటీవల వ్యక్తిగత రుణాలకు కూడా పునర్​వ్యవస్థీకరణ చేసుకునే వీలు కల్పించింది. ఇందులో విద్యా రుణాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే విద్యా రుణం చెల్లిస్తున్న వారు ప్రస్తుతం ఈఎమ్ఐ చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే బ్యాంకును సంప్రదించాలి. పునర్​వ్యవస్థీకరణలో భాగంగా వడ్డీని రుణంగా మార్చుకోవటం, రీపేమెంట్ కాలాన్ని మార్చుకోవటం లేదా 2 సంవత్సరాల మారటోరియం తీసుకోవటం లాంటివి చేసుకోవచ్చు. లోన్ తిరిగి చెల్లించేందుకు ఉన్న గడువును కూడా పెంచుకోవచ్చు.

తనాఖా రుణాలు తీసుకోండి.

కొత్తగా రుణం తీసుకోవాలనుకునే వారు తనాఖా రుణాలు తీసుకోవటం, అంతేకాకుండా విద్యా రుణం మారటోరియం సమయంలో వడ్డీ చెల్లించటం, సబ్సిడీలను ఉపయోగించుకొని విద్యా రుణం భారం తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రధాన బ్యాంకుల్లో తనాఖా లేకుండానే విద్యార్థులు విద్యా రుణాలను తీసుకోవచ్చు. తనాఖా పెట్టి రుణం తీసుకున్నట్లయితే వడ్డీ తక్కువ పడే అవకాశం ఉంటుంది. తనాఖా లేని రుణాలు అన్ సెక్యూర్డ్ రుణాలు కాబట్టి వాటి విషయంలో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. భూమి, బంగారం, ఆస్తులు, ఫిక్సడ్ డిపాజిట్లు ఉన్న వారు వాటిని తనాఖాగా ఉంచి రుణాన్ని పొందవచ్చు.

మారటోరియం సమయంలో వడ్డీ చెల్లించటం..

విద్యా రుణం తీసుకున్న వెంటనే ఈఎమ్ఐలు వెంటనే ప్రారంభం కావు. చదువు పూర్తి చేసిన అనంతరం లేదా ఉద్యోగం ప్రారంభించిన కాలం నుంచి అవి ప్రారంభం అవుతాయి. రుణం తీసుకున్న కాలం ఈఎమ్ఐ ప్రారంభమైన కాలంలో మారటోరియం ఉంటుంది. మారటోరియం సమయంలో వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ సమయంలో వడ్డీ అసలుకు జమ అవుతూ ఉంటుంది. ఈఎమ్ఐ మొత్తాన్ని తగ్గించుకునేందుకు మారటోరియం సమయంలో కూడా వడ్డీ చెల్లించాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికి బ్యాంకులు వీలు కల్పిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. మొదటి నుంచి వడ్డీ చెల్లిస్తున్నట్లయితే... వడ్డీపై సబ్సిడీ కూడా కొన్ని బ్యాంకులు అందిస్తున్నాయని వారు చెబుతున్నారు.

మహిళలకు ప్రత్యేక రుణాలు

మహిళలకు కొన్ని బ్యాంకులు సబ్సడీ రేటు వద్ద రుణాలను అందిస్తున్నాయి. ఐఐటీ, ఐఐఎమ్ ఇతర ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో చదివే వారికి చాలా తక్కువకే రుణాలను ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయి.

అన్ సెక్యూర్డ్ రుణాలపై వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా విద్యారుణాల రుణ గడువు 8 ఏళ్ల వరకు ఉంటోంది. అదే సమయంలో సెక్యూర్డ్ రుణాలు 10 సంవత్సరాల వ్యవధితో తీసుకోవచ్చు. ఎక్కువ వ్యవధి ఉన్నట్లయితే ఈఎమ్ఐ తగ్గినప్పటికీ... మనం కట్టే మొత్తం ఎక్కువఅవుతుందన్నది గుర్తుంచుకోవాలి.

రుణ సబ్సిడీ పథకాలు...

కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రుణాలకు సంబంధించి సబ్సిడీలను అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా బలహీన వర్గాల వారికి ఈ తరహా సబ్సిడీలను అందిస్తోంది. వీటిని ఉపయోగించుకోవటం ద్వారా విద్యా రుణం భారాన్ని తగ్గించుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.