ETV Bharat / business

త్వరలో మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటీకరణ!

author img

By

Published : Feb 16, 2021, 6:28 AM IST

banks privatisation
త్వరలో మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటీకరణ!

ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. నాలుగు ప్రధాన బ్యాంకుల్ని ప్రైవేటు సంస్థలకు విక్రయించేందుకు సన్నాహాలు జరుపుతోంది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు అధికారులు నిరాకరించారు. కేంద్రం నిర్ణయం పట్ల బ్యాంకు ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వ్యయ అంచనాలను చేరుకునేందుకు వీలుగా.. పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రైవేటీకరించేందుకు ‘బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’లను ఎంపిక చేశారని.. ఈ బ్యాంకుల్లో పని చేస్తున్న పేరు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు ఉన్నతాధికారులు తెలిపినట్లు వార్తా సంస్థ ‘రాయిటర్స్‌’ పేర్కొంది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇందులో 2 బ్యాంకుల్ని తొలుత ప్రైవేటుపరం చేయనున్నారని సమాచారం. అయితే, బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది వేలమంది ఉద్యోగులతో ముడిపడిన వ్యవహారమైనందున, తొలుత చిన్న, మధ్య స్థాయి ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందని, దీనిపై వచ్చే స్పందన ఆధారంగా వచ్చే కొన్నేళ్లలో పెద్ద బ్యాంకుల్ని కూడా విక్రయించాలని భావిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సదరు వర్గాలు తెలిపాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)ను వ్యూహాత్మక బ్యాంకుగా పరిగణిస్తూ, అందులో మెజారిటీ వాటాను ప్రభుత్వం అట్టిపెట్టుకుంటుందనే అంచనాను వ్యక్తం చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో రుణ విస్తరణకు ఈ బ్యాంకు కీలకమని ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు కారణం. అయితే, ఈ అంశంపై స్పందించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతినిధి నిరాకరించారు.

ఉద్యోగ సంఘాల వ్యతిరేకత

బ్యాంకుల ప్రైవేటీకరణ, బీమా, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సోమవారం నుంచి 2 రోజుల సమ్మెకు దిగారు. తెలుగు రాష్ట్రాలకు వస్తే.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యవహారం కూడా ఇప్పటికే ఆందోళనలకు కారణమవుతోంది. ప్రైవేటీకరించేందుకు అనువైన బ్యాంకులను గుర్తించి.. ప్రక్రియ మొదలుపెట్టడానికి 5-6 నెలల సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగులు - కార్మిక సంఘాల ఒత్తిళ్లు, రాజకీయ పరిణామాలు ఈ అంశాన్ని ప్రభావితం చేస్తాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఏదైనా బ్యాంకు ప్రైవేటీకరణ అంశం చివరి నిమిషంలో మారిపోయే అవకాశం ఉందనీ తెలిపాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) త్వరలోనే ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) రుణ పరిమితుల్ని సులభతరం చేస్తుందన్న ఆశతో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఇది సత్వర దిద్దుబాటు ప్రక్రియలో ఉంది. దీన్నుంచి విముక్తి లభిస్తేనే, ఏ బ్యాంకును అయినా విక్రయించడం సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, చిన్న బ్యాంకుల విక్రయంతో బడ్జెట్‌ వ్యయాలకు అవసరమైన వనరుల్ని సాధించలేకపోతే, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) వంటి పెద్ద బ్యాంకులనూ విక్రయించేందుకు సిద్ధపడవచ్చని కొందరు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి : ఉద్యోగుల జీతాల్లో 30% కోత- తల్లిదండ్రులకు బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.