ETV Bharat / bharat

విజయవంతమైన 'యువగళం-నవశకం" భారీ బహిరంగ సభ

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 10:42 PM IST

Updated : Dec 21, 2023, 6:19 AM IST

yuvagalam meeting overall
yuvagalam meeting overall

Yuvagalam Vijayotsava Sabha Successfully Completed: విజయనగరం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ పాదయాత్ర ముగింపు సందర్భంగా, టీడీపీ నిర్వహించిన 'యువగళం-నవశకం" భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్​లు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలాల నుంచి టీడీపీ - జనసేన పార్టీల శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Yuvagalam Vijayotsava Sabha Successfully Completed: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘యువగళం-నవశకం’ పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ విజయనగరం జిల్లాలో నిర్వహించిన ఈ సభ విజయవంతమైంది. జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. సభకు తరలివచ్చిన ప్రజలను చూసినప్పుడే ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తోందని టీడీపీ పేర్కొంది. భవిష్యత్​ కోసం ప్రజలు టీడీపీ - జనసేనను ఆదరించాలని అచ్చెన్న కోరారు. సొంత ఇంటి ఆడవాళ్లకే మర్యాద ఇవ్వలేని వ్యక్తి, రాష్ట్రంలోని ఆడపడుచులకు గౌరవమేలా ఇస్తారని పవన్​ విమర్శించారు.

యువగళం-నవశకం విజయోత్సవ సభ - భారీగా తరలివచ్చిన జనం

తొలిసారి పాదయాత్రలపై దండయాత్రలు చూశా: పాదయాత్రలు చేయడం ఈ దేశంలో కొత్తేమీ కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజా చైతన్యం కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చైతన్యయాత్ర చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఎన్నో రకాల యాత్రలు జరిగాయని ఆయన అన్నారు. కానీ, పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తొలిసారి సైకో జగన్‌ పాలనలో దండయాత్రలు చూసినట్లు చంద్రబాబు విమర్శించారు. జగన్​కు ఒక్క ఛాన్స్‌ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. రాష్ట్రం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌గా మారాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అమరావతిని సర్వనాశనం చేసి మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు.

ఏపీ ప్రజలు మంచి ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు: నాదెండ్ల

ఏపీ భవిష్యత్​ను నిర్ణయించే క్షణాలివే: టీడీపీ అధినేత చంద్రబాబును అన్యాయంగా జైలులో పెడితే బాధ కలిగిందని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఆశించి టీడీపీకి మద్దతివ్వలేదని, 2024లో టీడీపీ - జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ ఎమ్మెల్యేలను మార్చుతున్నారని, మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని సీఎం జగన్‌ను అంటూ పవన్​ విమర్శించారు. ప్రజాస్వామ్యం అనే పదానికి జగన్‌కు విలువ తెలియదని మండిపడ్డారు. తల్లి, చెల్లికి విలువ ఇవ్వని వ్యక్తి ఆడపడుచులకు ఏం గౌరవం ఇస్తారని పవన్‌ ఎద్దేవా చేశారు. వారాహి యాత్రలో తనపై దాడులు చేశారని ఆరోపించారు. ఏపీ భవిష్యత్తును నిర్దేశించే క్షణాలు ఇవేనని ప్రజలకు జనసేనాని పిలుపునిచ్చారు.

యువగళం-నవశకం - భారీగా తరలి వచ్చిన ప్రజలు - డ్రోన్​ దృశ్యాలు

జగన్‌ ఐపీఎల్‌ టీమ్‌ పేరు 'కోడి కత్తి వారియర్స్‌': యువగళం ముగింపు సభ కాదు, ఆరంభం మాత్రమే అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ఇది నవశకం, యుద్ధం మొదలైందని, ఈ యుద్ధం తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టే వరకు ఆగదని యువగళం ముగింపు సభలో వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని కానీ, రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుందని లోకేశ్ వెల్లడించారు. యువగళం, మనగళం, ప్రజాగళం అన్న లోకేశ్, బాంబులకే భయపడమని పిల్ల సైకోలకు భయపడతామా అంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆడుదాం ఆంధ్రా అంటూ జగన్​ కొత్త పథకం తెచ్చారని, ప్రజలు మాత్రం వైసీపీ నేతలు తమ జీవితాలతో ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. జగన్‌ ఐపీఎల్‌ టీమ్‌ పేరు 'కోడి కత్తి వారియర్స్‌' అని, కోడికత్తి వారియర్స్ ఆటగాడు అవినాష్‌ రెడ్డి అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. బెట్టింగ్‌ స్టార్‌ అనిల్‌ యాదవ్‌, అరగంట స్టార్‌ అంబటి అని లోకేశ్ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. గంట స్టార్‌ అవంతి, ఆల్‌ రౌండర్‌ గోరంట్ల మాధవ్‌ అంటూ విమర్శించారు. రీల్‌ స్టార్‌ భరత్‌, పించ్‌ హిట్టర్‌ బియ్యపు మాధవరెడ్డి అంటూ వైసీపీ నేతలపై లోకేశ్ ఆరోపణలు చేశారు.

యువగళం ప్రజాగళం: తెలుగుదేశం నిర్వహిస్తున్న బహిరంగ సభ యువగళం కాదని, ప్రజాగళమని లోకేశ్‌ నిరూపించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు. లోకేశ్‌ నాయకుడే కాదని, పోరాట యోధుడు కూడా అని స్పష్ట చేశారు. యువగళం పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను సృష్టించిందని ఆరోపించారు. అడ్డంకులను తట్టుకుని వాటిని లెక్క చేయకుండా ప్రభుత్వ తప్పులు, అవినీతిని లోకేశ్​ ఎండగట్టారని తెలిపారు.

తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టే వరకు యుద్ధం ఆగదు: నారా లోకేశ్

ఒక్క ఛాన్స్​ ఇస్తే ఎంత నష్టపోయామో చూశాం: రాష్ట్ర ప్రజల కోసమే టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. సెప్టెంబరు 13న రాజమహేంద్రవరంలో చంద్రబాబును కలిసిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో సంచలనంగా మారిందని ఆయన వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు మారాలనే దిశగా పవన్‌ అడుగులు వేశారని తెలిపారు.

పసుపుమయంగా మారిన జాతీయ రహదారి: యువగళం - నవశకం ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. భారీ బెలూన్లు, డీజే చప్పుళ్లు, జై లోకేశ్‌ నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది. నవశకం వేదికపై ఆహూతులను ఉత్తరాంధ్ర సంప్రదాయ కళా నృత్యాలు అలరించాయి. సభా ప్రాంగణంలో ఎన్టీఆర్‌, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌, బాలయ్య భారీ కటౌట్లు ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు.

రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ, జనసేన కార్యకర్తల కేరింతలతో సభాప్రాంగణం సందడిగా మారింది. విశాఖపట్నం నుంచి పోలిపల్లి వరకు బ్యానర్లు, తెలుగుదేశం - జనసేన జెండాలు, ఫ్లెక్సీలతో జాతీయ రహదారి పసుపు మయంగా మారింది. కార్యకర్తలు దూరం నుంచి కూడా కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా సభా ప్రాంగణం వెలుపల అతి పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

సమయం లేదు మిత్రమా - విజయమో వీర స్వర్గమో తేల్చుకునే సమయం వచ్చింది: బాలకృష్ణ

Last Updated :Dec 21, 2023, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.