ETV Bharat / bharat

'సభలో సింహం'.. వెంకయ్యపై ప్రశంసల జల్లు.. ఎంపీల స్పెషల్ రిక్వెస్ట్

author img

By

Published : Aug 8, 2022, 4:26 PM IST

venkaiah naidu farewell
'సభలో సింహం'.. వెంకయ్యపై ప్రశంసల జల్లు.. ఎంపీల స్పెషల్ రిక్వెస్ట్

Venkaiah Naidu farewell: ఐదేళ్ల పదవీ కాలం పూర్తిచేసుకోనున్న ఉపరాష్ట్రపతి​ వెంకయ్య నాయుడుపై రాజ్యసభ సభ్యులు పార్టీలకు అతీతంగా ప్రశంసల జల్లు కురిపించారు. ప్రాంతీయ భాషల్లో మాట్లాడేలా సభ్యుల్లో స్ఫూర్తి నింపారని కొనియాడారు. వెంకయ్య తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను ప్రస్తావిస్తూ ఆత్మకథ రాయాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు.

Venkaiah Naidu farewell: రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడుకు ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా ఘన వీడ్కోలు పలికారు. ఆగస్టు 10న ఆయన ఉపరాష్ట్రపతిగా ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకోనున్న నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో సభ్యులంతా వెంకయ్యకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు. ఎంపీలు ప్రాంతీయ భాషల్లో మాట్లాడేందుకు అనుమతించారని కొనియాడారు. ఆత్మకథ రాయాలని వెంకయ్యను కోరారు.

ఎన్ని 'ఒత్తిళ్లు' ఉన్నా వెంకయ్య బాగా పని చేశారని కితాబిచ్చారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే. "నాకు వెంకయ్య నాయుడు 30-40 ఏళ్లుగా, అంటే కర్ణాటక భాజపాకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. రాజ్యసభ ఛైర్మన్​గా ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం రావాలని ఆకాంక్షించారు. మీరు(వెంకయ్య) అసంపూర్ణంగా వదిలేసిన పనిని ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆశిస్తున్నా. మీ, నా సిద్ధాంతాలు వేర్వేరు. మీ సిద్ధాంతంతో నాకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఫిర్యాదులకు ఇది సమయం కాదు. సంక్లిష్ట పరిస్థితులు, ఒత్తిళ్లు ఉన్నా మీరు బాధ్యతల్ని నిర్వర్తించారు. అందుకు ధన్యవాదాలు, అభినందనలు." అని అన్నారు ఖర్గే. ప్రజా జీవితంలో వెంకయ్య మరింత కాలం పాటు చురుకుగా ఉంటారని, యువతకు మార్గదర్శిగా నిలుస్తారని ఆకాంక్షించారు.

Venkaiah Naidu Auto Biography: "సంప్రదాయం కాబట్టి మీకు వీడ్కోలు పలుకుతున్నాం. కానీ అలా ఎప్పటికీ చేయలేం. మా డీఎంకే సహచరులు అందరి తరఫున మీకు అభినందనలు. వెంకయ్య.. సభలోని అందరినీ క్రమశిక్షణలో పెట్టగల 'సింహం'. రాజ్యసభలో మాత్రమే ఏ సభ్యుడైనా 22 షెడ్యూల్డ్​ భాషల్లో ఏ భాషలోనైనా మాట్లాడవచ్చు. అది వెంకయ్య వల్లే సాధ్యమైంది. సర్.. దయచేసి మీరు ఆత్మకథ రాయండి. భావితరాలకు మీరు చేసే సహాయం అదే అవుతుంది." అని వెంకయ్యను కోరారు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ.

వెంకయ్య భావోద్వేగం
Venkaiah Naidu mother: ఏడాది వయసు ఉండగా తల్లిని కోల్పోయిన విషయాన్ని టీఎంసీ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ ప్రస్తావించగా.. వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. ఆత్మకథ రాయాలని, అందులో తల్లి గురించి చెప్పాలని వెంకయ్యను కోరారు డెరెక్. 2020 సెప్టెంబర్​లో రాజ్యసభలో సాగు చట్టాలు ఆమోదం పొందిన రోజు వెంకయ్య సభలో లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు డెరెక్. "సాగు చట్టాలు ఆమోదం పొందిన రోజు.. మీ పట్ల నాకు ఓ ప్రత్యేక దృక్పథం ఏర్పడిన ముఖ్యమైన రోజు. ఆ విషయంపై నా ప్రశ్నకు ఏదో ఒక రోజు మీ ఆత్మకథలో జవాబు ఇస్తారని అనుకుంటున్నా. మీరు సభను విడిచిపెట్టినా.. కనీసం 20 ఏళ్లు ప్రజాజీవితంలోనే ఉంటారు. మీరు ఆత్మకథ రాసినా, రాయకపోయినా.. కీలక అంశాలపై మీ అభిప్రాయాల్ని వెల్లడిస్తూ మాకు మార్గదర్శిగా ఉంటారని భావిస్తున్నా" అన్నారు డెరెక్ ఒబ్రెయిన్. ఇతర పార్టీల సభ్యులు ఇదే తరహాలో ఉపరాష్ట్రపతిపై ప్రశంసలు కురిపించారు.

ప్రపంచమంతా చూస్తోంది!
Venkaiah Naidu speech in Parliament: చట్టసభలు ఎప్పుడూ అర్థవంతమైన చర్చలకు వేదికలు కావాలని ఆకాంక్షించే వెంకయ్య.. తన వీడ్కోలు ప్రసంగంలోనూ సభ్యులకు అదే విషయమై కీలక సూచనలు చేశారు. "ఎగువసభగా మనకు ఎక్కువ బాధ్యత ఉంది. యావత్ ప్రపంచం భారత్​ను చూస్తోంది. భారత్.. ముందుకు సాగుతోంది. చట్టసభ గౌరవమర్యాదలు దెబ్బతినకుండా సభ్యులంతా హుందాగా వ్యవహరించాలని కోరుతున్నా." అని అన్నారు వెంకయ్య.

ఐదేళ్ల క్రితం ఉపరాష్ట్రపతి పదవి చేపట్టే అవకాశం వచ్చిన క్షణాలు గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. "భారత ఉపరాష్ట్రపతి పదవికి నన్ను ఎంపిక చేస్తున్నట్లు ప్రధాని చెప్పిన క్షణం.. నేను కన్నీరు పెట్టుకున్నాను. నేను పదవి కావాలని అడగలేదు. అయినా.. పార్టీ ఆదేశించింది. నేను అంగీకరించి, పార్టీకి రాజీనామా చేశా. పార్టీని వీడాల్సి వచ్చినందుకే నేను అప్పుడు కన్నీరు పెట్టుకున్నా. సభను సజావుగా నడిపేందుకు, అందరికీ అవకాశం ఇచ్చేందుకు నా శక్తిమేర కృషి చేశా." అని చెప్పారు వెంకయ్య.

మోదీ ప్రశంసలు
అంతకుముందు.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కార్యాదక్షత అందరికీ మార్గదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వెంకయ్య పదవీకాలంలో రాజ్యసభ పనితీరు గణనీయంగా మెరుగుపడిందని గుర్తు చేశారు. సభకు ఇది అత్యంత భావోద్వేగపరమైన క్షణం అని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయని గుర్తు చేసుకున్నారు మోదీ.

"రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ధన్యవాదాలు. 'రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నా. ప్రజా జీవితం నుంచి కాదు' అని మీరు చాలా సార్లు చెప్పారు. ఈ సభను నడిపించే బాధ్యత నుంచి మీరు ప్రస్తుతం వైదొలుగుతున్నారు. కానీ, దేశంతో పాటు ప్రజల కోసం పనిచేసే నాలాంటి వ్యక్తులకు మీ అనుభవాల నుంచి నేర్చుకొనే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. వెంకయ్యనాయుడి దక్షత, పనివిధానం.. మనందరికీ మార్గదర్శనం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఇదీ చదవండి: 'వెంకయ్య సాక్షిగా అనేక చారిత్రక ఘటనలు.. ఆయన దక్షతకు జోహార్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.