ETV Bharat / bharat

అఫ్గాన్​ నుంచి బలగాల తరలింపుతో భారత్​కు ఉగ్రముప్పు!

author img

By

Published : Jun 26, 2021, 11:35 AM IST

Indian Army
కశ్మీర్​లోకి ఉగ్రవాదులు

అఫ్గానిస్థాన్​ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటోంది అమెరికా. అగ్రరాజ్య బలగాలను తరలించటం వల్ల భారత్​కు ఉగ్రముప్పు పొంచి ఉందని, కొందరు ముష్కరులు కశ్మీర్​లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సైన్యం వెల్లడించింది. అయితే.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణతో కశ్మీర్​లోకి ఉగ్రవాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయని భారత సైన్యం పేర్కొంది. అయితే.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. శ్రీనగర్​లోని జక్లీ రెజిమెంట్​ కేంద్రంలో శుక్రవారం జరిగిన పాసింగ్​ ఔట్​ పారెడ్​ సందర్భంగా.. లెఫ్టినెంట్​ జనరల్​ దేవేంద్ర ప్రతాప్​ పాండే ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఆజాదీగా చెప్పుకునే కొందరు వ్యక్తులు.. నియంత్రణ రేఖ వెంబడి, పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​ సరిహద్దుల్లో పరిస్థితుల గురించి ఆలోచించాలి. 30ఏళ్ల కిందట జరిగిన ఘటనల వల్ల కశ్మీర్​ ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది. అవును, అఫ్గాన్​ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణతో కొంత మంది ఉగ్రవాదులు కశ్మీర్​ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ప్రస్తుత పరిస్థితులు 30 ఏళ్ల కిందటిలా లేవు. చొరబాటు యత్నాలను భగ్నం చేసేందుకు మేము అన్ని విధాల సిద్ధంగా ఉన్నాం. "

- లెఫ్టినంట్​ జనరల్​ దేవేంద్ర ప్రతాప్​ పాండే.

సైన్యంలోకి అధునాతన ఆయుధాల కొనుగోలుపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. అది సాధారణంగా ప్రతి ఏటా జరిగే ప్రక్రియేనని స్పష్టం చేశారు అధికారి. చైనాతో ప్రతిష్టంభన నేపథ్యంలో సరిహద్దుల్లో బలగాల మోహరింపును సమతూకంగా కొనసాగించాల్సి వస్తోందన్నారు. సరిహద్దుల గుండా ఒకప్పుడు నగదు అక్రమ రవాణా జరిగేదని, ప్రస్తుతం డ్రగ్స్​ చేరవేసే వారి సంఖ్య పెరిగినట్లు చెప్పారు. జమ్ముకశ్మీర్​ పోలీసులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కపాదం మోపుతున్నారని తెలిపారు.

Indian Army
కశ్మీర్​లో భారత బలగాలు

కశ్మీర్​ పరిస్థితులపై..

జమ్ముకశ్మీర్​లోని రాజకీయ నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు జరిగిన నేపథ్యంలో కశ్మీర్​ భద్రత పరిస్థితులపై ఏదైనా ప్రభావం ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు.. భద్రత, రాజకీయం రెండు వేరు వేరు అని స్పష్టం చేశారు. 'చర్చలు ఎప్పుడూ కొనసాగుతాయి. భద్రత అనేది వేరు.. అది వివిధ స్థాయుల్లో చర్యలు తీసుకునే అంశం' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.