ETV Bharat / bharat

Telugu Passengers భూమి కంపించినట్లైంది.. తలచుకుంటేనే వణుకుపుడుతోంది.. తెలుగు ప్రయాణికుల అనుభవాలు

author img

By

Published : Jun 4, 2023, 7:17 AM IST

Updated : Jun 4, 2023, 7:33 AM IST

Telugu Passengers in Train Accident
రైలు ప్రమాదంలో తెలుగు ప్రయాణికులు

Telugu Passengers in Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం గురించి తలచుకుంటేనే.. వారి వెన్నులో వణుకుపుడుతోంది. ఆ పీడకల గురించి అడిగితే.. వారి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సాఫీగా సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా కుదుపులకు లోనై.. తాము ఉంటున్న బోగీలు బోల్తాపడ్డాయని చెప్పారు. స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నా.. తోటి ప్రయాణీకుల ఆర్తానాదాలు, చనిపోయినపోయిన వారి మృతదేహాలు ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయని.. కన్నీటి పర్యంతమయ్యారు. ఒడిశా రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన తెలుగువారు ప్రత్యేక రైలులో స్వస్థలాలకు చేరుకున్నారు.

Telugu Passengers in Odisha Train Accident: ఒడిశా రైలు ఘోర ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్న కొందరు తెలుగు ప్రయాణికులు సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నారు. ప్రమాద భయాందోళన నుంచి వారు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఒక్క క్షణం భూమి కంపించినట్లు అయిపోయిందని..బోగీలు బోల్తాపడటంతో ఒకరిపై ఒకరు పడిపోయామన్నారు. అతికష్టం మీద ప్రాణాలతో బయటపడ్డామని కొందరు చెప్పగా.. మరికొందరు స్వల్ప గాయాలతో తప్పించుకున్నామన్నారు.

చుట్టూ తెగిపడిన అవయవాలు, రక్తం, చనిపోయిన వారి మృతదేహాలతో సంఘటన జరిగిన ప్రాంతం భయంకరంగా మారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. స్థానికులు అందించిన సహకారం మరువలేదన్న ప్రయాణికులు వారి సాయంతోనే రోడ్డుపైకి చేరుకున్నామన్నారు. అక్కడి నుంచి రైల్వేసిబ్బంది, అధికారుల సహకారంతో స్వస్థలాలకు వచ్చామని వివరించారు.

Odisha Train Accident : 'ఘోర'మాండల్​ రైలు దుర్ఘటన.. ఏ క్షణంలో ఏం జరిగిందంటే?

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన 8మంది విజయవాడకు ప్రత్యేక రైలులో రాగా.. కలెక్టర్‌ ఢిల్లీరావు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రయాణికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు రవాణా సౌకర్యం కల్పించారు. ఎమ్మెల్యేలు మాల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ బాధితులను పరామర్శించారు.

"ఆ పరిస్థితిని మాటల్లో చెప్పలేను. అక్కడ నుంచి బయట పడ్డానంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. చాలా మంది ప్రయాణికులకు చేతులు, కాళ్లు విరిగాయి. ఎక్కడ చూసినా రక్తమే కనిపించింది. మేము అక్కడ నుంచి బయటకు వచ్చే అప్పుడు చూస్తే.. రోడ్డు మొత్తం మృతదేహాలతో నిండిపోయి ఉంది. అక్కడ ఉండే స్థానికులు చాలా సాయం చేశారు. వాళ్లు లేకపోతే మేము అంత వేగంగా బయటకు రాలేకపోయే వాళ్లం. వాళ్లు వాహనాలలో మమ్మల్ని తరలించారు. బస్సులో ఎక్కించారు". - ప్రయాణికులు

కుమారుడి వైద్యం కోసం వెళ్తుండగా ప్రమాదం.. తల్లి పెద్దకర్మకు వచ్చి మృత్యుఒడికి..

కోరమండల్ రైలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఏలూరుకు చెందిన శ్రీకర్‌బాబు అనే యువకుడు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. కోల్‌కతాలో చదువుకుంటున్న శ్రీకర్‌...సెలవులకు ఇంటికి వస్తుండగా రైలు ప్రమాదం జరిగింది. రాజమహేంద్రవరానికి చెందిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. ప్రత్యేక రైలులో చాలా మంది తెలుగు ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లారు. ప్రమాద ఘటనను తలచుకుంటేనే భయం వేస్తోందని ప్రయాణికులు తెలిపారు.

"అస్సలు మాటలు రావడం లేదు. అక్కడ నుంచి నా పిల్లలతో బయటపడ్డాను అదే చాలా సంతోషంగా ఉంది. అప్పటి నుంచి మా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు . ప్రమాద సమయంలో వీళ్లు బోగీ నుంచి కింద పడిపోయారు. చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి". - ప్రయాణికుడు

"ఒక ఏడుగురు కోరమాండల్, ఒకరు యశ్వంత్​పూర్.. మొత్తం ఎనిమిది మందే మన విజయవాడ స్టేషన్​కి చెందిన వాళ్లు. అందరూ సురక్షితంగా ఉన్నారు". - ఢిల్లీరావు, కలెక్టర్‌

రైలు ప్రమాదంలో బయటపడ్డ తెలుగు ప్రయాణికులు.. ఏం అంటున్నారంటే..?
Last Updated :Jun 4, 2023, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.