ETV Bharat / bharat

వివేకా హత్య కేసు.. సునీల్​ యాదవ్​ బెయిల్​ పిటిషన్​ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

author img

By

Published : Feb 27, 2023, 6:57 PM IST

TS HC DISMISSED SUNIL BAIL PETITION
TS HC DISMISSED SUNIL BAIL PETITION

TS HC DISMISSED SUNIL BAIL PETITION : వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛ కంటే నిష్పక్షపాత దర్యాప్తు, సాక్షుల భద్రత ముఖ్యమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సాక్షిగా వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత నిందితుడిగా మార్చవచ్చునని తెలిపింది. వివేకా హత్య కేసులో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోందని హైకోర్టుకు సీబీఐ తెలిపింది.

VIVEKA MURDER CASE UPDATES : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్​ యాదవ్​కు బెయిల్​ ఇచ్చేందుకు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. సునీల్​ యాదవ్​తో పాటు సీబీఐ, వివేకా భార్య వైఎస్ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత సుదీర్ఘ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం బెయిల్ పిటిషన్​ను కొట్టివేసింది.

ఛార్జ్​షీట్​ తర్వాత జైళ్లో పెట్టాల్సిన అవసరం లేదు: వివేకా హత్య కేసుతో సునీల్​కు సంబంధం లేదని.. ఓ మహిళ హనీ ట్రాప్‌తో జరిగిందని అతని తరఫు న్యాయవాది నయన్​కుమార్ వాదించారు. తన మామకు వివాహేతర సంబంధాలున్నాయని.. ఓ మహిళకు 8 కోట్ల రూపాయలు ఇచ్చారని వివేకా అల్లుడే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు గుర్తు చేశారు. రెండు రాజకీయ గ్రూపుల మధ్య పోరులో సునీల్ యాదవ్ చిక్కుకున్నారన్నారు.

ఛార్జ్‌షీట్‌ వేసిన తర్వాత కూడా ఇంకా జైళ్లో పెట్టాల్సిన అవసరం లేదని.. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని వాదించారు. ఏపీ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు తన పేరు ఎక్కడా రాలేదన్నారు. సీబీఐ సాక్షిగా వాంగ్మూలం సేకరించి.. ఉన్నట్టుండి నిందితుడిగా పేరు చేర్చి అరెస్టు చేసిందన్నారు. సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని.. బెయిల్ ఇచ్చి అవసరమైతే ఏపీకి వెళ్లకూడదు అనే షరతు విధించాలని సునీల్​ న్యాయవాది కోర్టును కోరారు.

సునీల్​కు బెయిల్​ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం: మరోవైపు.. వివేకా హత్య కేసు నిందితుడు సునీల్​ యాదవ్‌కు బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టును సీబీఐ కోరింది. హత్యలో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టుకు తెలిపింది. హత్యకు ముందు, ఆ తర్వాత సునీల్ యాదవ్ అనుమానిత రాజకీయ నేతలతో కలిసి ఉన్నట్లు గూగుల్ టేక్​ అవుట్ ద్వారా గుర్తించినట్లు సీబీఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేంద్రన్ హైకోర్టుకు వివరించారు. సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని.. సాక్షులను బెదిరిస్తారన్నారు. సునీల్ యాదవ్ ఇతర నిందితులతో కలిసి చేసిన కుట్రను దస్తగిరి, రంగయ్య స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు.

హత్యలో పాత్రధారి, సూత్రధారి: వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదించారు. సునీల్ యాదవ్ రెండు రాజకీయ గ్రూపుల మధ్య చిక్కుకున్న సాధారణ వ్యక్తి కాదని.. హత్యలో పాత్రధారిగా, సూత్రధారిగా వ్యవహరించారని వాదించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు సాక్షులు ప్రభావితమయ్యారని.. కుట్రలో భాగమైన ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నందున.. సునీల్​కు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.

ప్రస్తుత దశలో బెయిల్​ ఇవ్వలేము: ఏపీ పోలీసుల దర్యాప్తులో తన ప్రస్తావనే రాలేదన్న సునీల్ యాదవ్‌పై కౌంటర్ ఇస్తూ .. అందుకే ఏపీ పోలీసుల దర్యాప్తు సరిగా లేదనే కోర్టు సీబీఐకి అప్పగించిందన్నారు. అన్ని వాదనలు విని సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ కొట్టి వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్.సుమలత తీర్పు వెల్లడించారు. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రస్తుత దశలో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిందితుల వ్యక్తి గత స్వేచ్ఛ ముఖ్యమే అయినప్పటికీ.. నిష్పక్షపాత దర్యాప్తు, సాక్షుల భద్రత అంతకంటే ప్రధానమని తేల్చిచెప్పింది. సాక్షిగా విచారణ జరిపి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత.. తదుపరి ఆధారాలతో అదే వ్యక్తిని నిందితుడిగా మార్చవచ్చునని హైకోర్టు పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.