ETV Bharat / bharat

అందుకే సస్పెండ్​ చేశారు.. త్వరలోనే రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా: ఎమ్మెల్యే ఉండవల్లి

author img

By

Published : Mar 26, 2023, 1:43 PM IST

undavalli sridevi
undavalli sridevi

MLA UNDAVALLI SRIDEVI: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణహాని ఉండటం వల్లే మూడు రోజుల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నానని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందాలు, ఇతర అక్రమాలకు తాను అడ్డుగా ఉన్నందు వల్లే సస్పెండ్‌ చేశారని ఆమె విమర్శించారు. తనపై చర్యలు తీసుకున్న వారికి రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తానని స్పష్టం చేశారు.

అందుకే సస్పెండ్​ చేశారు.. త్వరలోనే రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా

MLA UNDAVALLI SRIDEVI: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్​ ఓటింగ్​ వేసారన్న ఆరోపణలతో అధికార పార్టీ నుంచి సస్పెండ్​ అయిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆమె కొట్టిపారేసారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తాను అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయినట్లు విమర్శిస్తున్నారని ఆగ్రహించారు. తాను ఏమైనా మాఫియా డాన్‌నా అజ్ఞాతంలోకి వెళ్లడానికి అని శ్రీదేవి ప్రశ్నించారు. గతంలో డా.సుధాకర్‌, డా.అచ్చెన్న ఎలా చనిపోయారనేది తనకు తెలుసన్న శ్రీదేవి.. రేపు వారిలా డా.శ్రీదేవి కూడా చనిపోకూడదనే వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో నాపై నిందలు: తన కార్యాలయంపై వైసీపీ గూండాలు ఇష్టారీతిన దాడులు చేశారని.. తాను చేసిన తప్పేంటో చెప్పకుండా వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో ఇసుక దందాలు, మైనింగ్‌ దోపిడీలు చేశారని విమర్శించారు. వాళ్ల దందాలకు అడ్డు వస్తాననే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలు చేయబోనని తెలిసి తనని తొలగించాలని చూశారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నుంచే తనపై ఆరోపణలు చేసినట్లు శ్రీదేవి పేర్కొన్నారు.

జగనన్న ఇళ్ల పథకం పెద్ద స్కాం: డబ్బులు దోచుకుని పారిపోయినట్లు ఆరోపణలు చేసి.. తనపై దొంగ అనే ముద్ర వేశారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో జరిగిన అభివృద్ధిలో 10 శాతమైనా చేశారా? అని ప్రశ్నించారు. జగనన్న ఇళ్ల పథకం అనేది పెద్ద కుంభకోణం అని ఆమె ఆరోపించారు. జగనన్న ఇళ్ల పథకంలో రూ.వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీలను అణగదొక్కేందుకు దాడులు చేస్తున్నారని.. అడ్డమొస్తే చంపుతున్నారని ధ్వజమెత్తారు. సామాన్యులు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉందా? అని నిలదీశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందిస్తూ.. రహస్య బ్యాలెట్‌ జరిగితే ఎవరికి ఓటేశారనేది ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో తనని సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో తాను తప్పితే ఎవరైనా గెలిచేవారా? అని నిలదీశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విస్తృతంగా తిరిగి గెలిపించానన్నారు. కరోనా సమయంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేసినట్లు శ్రీదేవి వ్యాఖ్యానించారు.

"నేను ఓటేసేటప్పుడు టేబుల్ కింద ఎవరైనా దాక్కున్నారా?. నేను ఓటేసేటప్పుడు సీసీ కెమెరా ఏమైనా పెట్టారా?. నా ప్యానల్‌లోనే ఎందరో అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను టీడీపీకి ఓటేశానని ఎలా చెబుతారు. రాజధాని నుంచి నన్ను తప్పించేందుకే పక్కా ప్లాన్‌ వేశారు. ఐవీఎఫ్‌ స్పెషలిస్టు డాక్టర్‌ను.. నన్ను పిచ్చికుక్కను చేశారు. అమరావతి విషయంలో ఎమ్మెల్యేగా ఎంతో బాధపడ్డాను. అమరావతి మహిళలు నిలదీస్తుంటే ఆవేదన చెందా. స్థానిక ఎమ్మెల్యేగా చెప్తున్నా.. ఇటుక తీసి ఇటుక పెట్టలేదు. ఇప్పుడు అడుగుతున్న అమరావతికి ఏం చేశారో చెప్పండి"-ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ ఎమ్మెల్యే

సజ్జలతోనే నాకు ప్రాణహాని.. త్వరలోనే రిటర్న్​ గిఫ్ట్​ ఇస్తా: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోనే తనకు ప్రాణహాని ఉంది అని శ్రీదేవి పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని.. ఆ సంఘం హామీ ఇస్తేనే ఏపీలో అడుగుపెడతానని శ్రీదేవి స్పష్టం చేశారు. మహిళా ఎమ్మెల్యేకు రక్షణ లేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయని మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేసిన వారికి త్వరలోనే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా అని శ్రీదేవి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ కొట్టిన దెబ్బకు తన మైండ్‌ బ్లాక్‌ అయ్యిందని.. ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను స్వతంత్ర ఎమ్మెల్యే అని.. ఏ పార్టీతో తనకు సంబంధం లేదని శ్రీదేవి కుండబద్దలు కొట్టారు.

సీఎం జగన్​కు చెవులు మాత్రమే ఉంటాయి: రాజధాని రైతులకు తన వంతు మద్దతు ఇస్తానన్న శ్రీదేవి.. వైసీపీ దందాలు, మైనింగ్‌లకు బినామీగా ఉండలేనని తేల్చిచెప్పారు. బినామీగా ఉండలేనందునే తనని పార్టీ నుంచి తప్పించారని.. అవినీతి ఆరోపణలు కూడా చేశారని మండిపడ్డారు. కాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలను బూచిగా చూపి రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు చెవులు మాత్రమే ఉంటాయని.. ఎవరు చెప్పినా వింటారని విమర్శించారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేను అప్రతిష్టపాలు చేయడం నచ్చలేదు: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై వస్తున్న ఆరోపణలపై ఆమె భర్త డా.శ్రీధర్‌ స్పందించారు. ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చే సమయంలో జగన్‌ తమని సంప్రదించారని.. మా ఇద్దరి కులాలు చూసి మరీ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారని ఆయన తెలిపారు. జగన్‌ కూడా ఊహించని విధంగా శ్రీదేవి గెలిచారని పేర్కొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేను అప్రతిష్టపాలు చేయడం నచ్చలేదన్న ఆయన.. ఏం తప్పు చేశారో చెప్పకుండానే శిక్ష విధించారని మండిపడ్డారు.

అమరావతి ఉద్యమం వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత: తమకు రెండు ఆస్పత్రులు ఉన్నాయని.. ఆస్తులు కూడా ఉన్నాయని.. రూ.10కోట్లకు, రూ.20 కోట్లకు అమ్ముడుపోతారని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. రూ.10 కోట్లకే అమ్ముడుపోతారంటే ఏమైనా నమ్మశక్యంగా ఉందా అని ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని ఆయన విమర్శించారు. అమరావతి ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని..గడప గడపకు కార్యక్రమానికి వెళ్లవద్దని శ్రీదేవిపై ఆంక్షలు విధించారన్నారు. అసలు రహస్య బ్యాలెట్‌ జరిగితే ఇతరులకు ఓటు వేశారని ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఎవరికి ఓటు వేశారో చెప్పడం.. అడగడం తప్పే అని.. ఆధారాలు లేకుండా మాట్లాడడం మరింత తప్పు అని డా.శ్రీధర్​ మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.