ETV Bharat / bharat

నుపుర్​ శర్మపై సుప్రీం ఫైర్.. 'దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే!'

author img

By

Published : Jul 1, 2022, 12:03 PM IST

Updated : Jul 1, 2022, 3:28 PM IST

supreme-cour-serious-on-nupur-sharma
supreme-cour-serious-on-nupur-sharma

Supreme Court Nupur Sharma: మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఓ పార్టీకి అధికార ప్రతినిధి అయితే మాత్రం ఇష్టానుసారం మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, జాతికి క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Supreme Court Nupur Sharma: మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి అంతర్జాతీయ స్థాయిలో దుమారానికి తెరలేపిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం దేశంలో జరిగిన పలు ఘటనలకు ఆమే బాధ్యురాలని న్యాయస్థానం మండిపడింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.

ఓ టీవీ ఛానల్‌లో డిబేట్​ సందర్భంగా మహమ్మద్‌ ప్రవక్తపై నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోనే కాక, అంతర్జాతీయంగా కూడా తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో భాజపా.. ఆమెను సస్పెండ్‌ చేసింది. ఈ వ్యాఖ్యలకు గానూ ఆమెపై దేశంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఈ కేసులన్నింటినీ దిల్లీకి బదిలీ చేయాలంటూ నుపుర్‌ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం నుపుర్​ శర్మపై తీవ్రస్థాయిలో మండిపడింది.

"ఆమెకు ముప్పు ఉందా? లేదా ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చ అంతా చూశాం. ఆమె వ్యాఖ్యలు సిగ్గుచేటు. చీప్​ పబ్లిసిటీనా లేక ఇదేమైనా కుట్రపూరితమా? ఆమె తన వ్యాఖ్యల ద్వారా దేశవ్యాప్తంగా ఎంతోమంది భావోద్వేగాలను రెచ్చగొట్టారు. ఆమె వ్యాఖ్యల అనంతరం దేశంలో దురదృష్టకర ఘటనలు జరిగాయి. ఉదయ్‌పుర్‌లో జరిగిన దారుణ ఘటనకూ ఆమే కారణం. ఒక పార్టీకి అధికార ప్రతినిధి అయితే మాత్రం ఇష్టానుసారం మాట్లాడతారా? మీలాంటి వ్యక్తులకు ఏ మతంపైనా గౌరవం లేదు. తక్షణమే యావత్​ దేశానికి క్షమాపణలు చెప్పాలి. నుపుర్​ శర్మ వ్యాఖ్యలు ఆమె అహంకారాన్ని తెలియజేస్తున్నాయి. ఆ కార్యక్రమం నిర్వహించిన ఛానల్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాల్సి ఉంది."

-- సుప్రీంకోర్టు

అయితే డిబేట్‌లో భాగంగా టీవీ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు మాత్రమే నుపుర్‌ సమాధానం చెప్పారని ఆమె తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. అయితే అప్పుడు టీవీ యాంకర్‌పైనా కేసు పెట్టి, చర్యలు తీసుకోవాలని సూచించింది. దాంతో పాటు నుపుర్‌ శర్మపై నమోదైన కేసులన్నింటినీ దిల్లీకి బదిలీ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఆమె తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించింది. దీంతో నుపుర్‌ చేసేదేమీలేక తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు. మేజిస్ట్రేట్ ముందు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

వారు తల దించుకోవాలి.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో భాజపాపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది కాంగ్రెస్. "దేశవ్యాప్తంగా భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి నుపుర్​ శర్మ మూలకారణమంటూ.. ఆమె దేశానికి క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు అనడం ముమ్మాటికీ సబబు. నుపుర్​పై సుప్రీం వ్యాఖ్యలు.. విచ్ఛిన్నకర సిద్ధాంతాలపై పోరాడాలన్న మా సంకల్పాన్ని మరింత దృఢంగా మార్చాయి. యావత్ దేశ ఆలోచనల్ని ప్రతిబింబించేలా సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలతో అధికార పక్షం సిగ్గుతో తల దించుకోవాలి." అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.

ఇవీ చదవండి: టైలర్ హత్య: 'నిందితులు ఇద్దరు కాదు.. ఉగ్ర గ్యాంగ్​తో సంబంధాలు!'

కన్హయ్య లాల్ ఇంటికి సీఎం.. ఉదయ్​పుర్​లో భారీ ర్యాలీ

Last Updated :Jul 1, 2022, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.