రూ.100 ఇవ్వలేదని మద్యం మత్తులో కన్న తండ్రినే హత్య చేశాడు ఓ కుమారుడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ బాంస్వాడా జిల్లాలోని లసోడియా గ్రామంలో జరిగింది. నిందితుడు అతడి తండ్రిని కర్రతో విచక్షణారహితంగా చితకబాదాడు. కొట్టొద్దని ఎంత ప్రాధేయపడినా వినిపించుకోలేదు. చావు దెబ్బలు తిన్న బాధితుడు కుమారుడిని నీరు అడిగినా ఇవ్వలేదు.
అసలేం జరిగిందంటే: జులై 12న జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన తండ్రి నానూ అదుపు తప్పి రాయి మీద పడి మరణించాడని సజ్జన్ఘడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు నిందితుడు సందేశ్. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించగా పలు విషయాలు బయటపడ్డాయి. మృతుడు శరీరం మీద 13 గాయాలు, పక్కటెముకలు కూడా విరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మృతుడు నానూ పెద్ద కుమారుడు.. తన తమ్ముడు సందేశే తండ్రిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. తన తమ్ముడికి భయపడే ఇన్ని రోజులు ఈ విషయాన్ని చెప్పలేదని అన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: మృతుడికి ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారునికి ఇంకా పెళ్లి కాలేదు. చిన్న కుమారుడు సందేశ్ కొన్నాళ్ల క్రితం ప్రేమ విహహం చేసుకున్నాడు. అతడికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. మద్యానికి బానిసైన నిందితుడు జులై 12 (సోమవారం) సాయంత్రం తాగొచ్చి తండ్రిని రూ.100 అడిగాడు. అతడు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడం వల్ల కర్రతో చితకబాదాడు. చివరకు నిందితుడు సందేశ్ పోలీసులు ఎదుట తన తండ్రిని చంపినట్లు ఒప్పుకున్నాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: యూనివర్సిటీకి డ్రగ్స్ సరఫరా.. మోడల్ అరెస్ట్