ETV Bharat / bharat

'రైతులపైనా నిఘా- ఇది అనైతిక ప్రభుత్వం!'

author img

By

Published : Jul 22, 2021, 4:40 PM IST

Protesting farmer
రైతుల నిరసనలు

జంతర్​మంతర్​ వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు.. తమపై కూడా కేంద్రం నిఘా పెట్టిందని ఆరోపించారు. ఇది అనైతిక ప్రభుత్వమని ధ్వజమెత్తారు. తమ డిమాండ్లను పార్లమెంట్​ సమావేశాల్లో లేవనెత్తాలని మంత్రులందరకీ లేఖ రాసినా.. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

సాగు చట్టాలపై కొన్ని నెలలుగా నిరసన గళం వినిపిస్తున్న రైతులు.. కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్​ సాయంతో తమపైనా కేంద్రం నిఘా పెట్టినట్టు ఆరోపించారు. "ఇది అనైతిక ప్రభుత్వం. మా ఫోన్లు కూడా ట్యాపింగ్​ జాబితాలో ఉన్నట్లు అనుమానిస్తున్నాం. ట్యాపింగ్ వెనుక ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మాపై కూడా నిఘా ఉంచారని మాకు తెలుసు" అని రైతు సంఘం నేత శివకుమార్​ కక్కా తీవ్ర విమర్శలు చేశారు.

అది నిరూపించడానికే..

రైతుల సమస్యపై బ్రిటన్​ పార్లమెంటులో చర్చ జరిగింది.. కానీ మన పార్లమెంట్​లో చర్చ జరగకపోవడం దురదృష్టకరమన్నారు మరో రైతునేత యోగేంద్ర యాదవ్. తాము అసమర్థులం కాదని నిరూపించడానికే జంతర్​మంతర్​ వద్ద నిరసనలు చేపట్టినట్లు తెలిపారు.

తమ డిమాండ్లపై పార్లమెంట్​లో చర్చ జరపాలని మంత్రులందరికీ లేఖ రాసినట్లు రైతు సంఘం నేత హన్నన్​ మొల్ల తెలిపారు. అయితే వాటికి గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు.

పార్లమెంట్​ వర్షకాల సమావేశాలు జరుగుతోన్న నేపథ్యంలో 200 మంది రైతులు.. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేపట్టారు.

ఇదీ చూడండి: దిల్లీ జంతర్​మంతర్​ వద్ద రైతుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.